Read more!

English | Telugu

సినిమా పేరు:మడతకాజా
బ్యానర్:సత్య సాయి ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 1, 2011

అల్లరి నరేష్ ఒక పోలీస్ ఇన్ ఫార్మర్. అతను స్వప్న (స్నేహ ఉల్లాల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మోసం చేసి ఆమె కూడా తనను ప్రేమించేలా చేసుకుంటాడు. ఆ విషయాన్ని ఆమెకు తర్వాత చెపుతాడు. స్వప్న కె.పి. (ఆహుతి ప్రసాద్) కూతురు.జె.పి. (జయప్రకాష్ రెడ్డి), కె.పి. ఇద్దరూ బ్యాంకాక్ లో ఉండే నందా (ఆశిష్ విద్యార్థి) అనే మాఫియా డాన్ కి ఇండియాలో అనుచరులుగా ఉంటారు. ఈ కె.పి., జె.పి.లను, నందాని అరెస్ట్ చేయటానికి తగిన ఆధారాలు సంపాదించమని పోలీస్ కమీషనర్ (చలపతిరావు) అల్లరి నరేష్ ని కోరతాడు...అల్లరి నరేష్ ఆ పనిని ఎలా సాధించాడన్నది వెండితెర మీద చూడండి.


ఎనాలసిస్ :

ఈ సినిమా దర్శకుడు సీతారామరాజుకి ఇది దర్శకుడిగా తొలి చిత్రం. అయినా ఆ తడబాటు ఎక్కడా కనిపించకుండా బాగానే దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే ఫరవాలేదు. అల్లరి నరేష్ కి ఎటువంటి కథయితే సినిమాగా బాగుంటుందో అలాంటి కథనే ఎన్నికున్నాడు. "కందిరీగ" చిత్రం స్క్రీన్ ప్లే పోకడలు ఈ చిత్రంలో మనకు కనపడతాయి. సుబ్బరాజు, నరేష్, స్నేహ ఉల్లాల్ లతో ఈ సినిమాలో జీవా, రఘుబాబు పాత్రలను కన్ ఫ్యూజ్ చేసిన తీరు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం బలంగానే చేశారు. ఆ ప్రయత్నంలో బాగానే సఫలీకృతులయ్యారనే చెప్పాలి. తొలిసారి నిర్మాతగా మారిన వేదరాజు టింబర్ ఈ సినిమాని ఖర్చుకి రాజీ పడకుండా నిర్మించారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - నరేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి..తన సహజ శైలిలో తన పాత్రను ఎనర్జిటిక్ గా పోషించాడు నరేష్. దానికి తోడు ఈ సినిమాలో నరేష్ డ్యాన్స్ కి కూడా మంచి ప్రాథాన్యతనిచ్చాడు. ఆరడుగుల రెండంగుళాల ఎత్తుతో ఉండే నరేష్ ఆ రకంగా డ్యాన్స్ చేయటం అంత తేలిక కాదు. ఇక ఐశ్వర్యారాయ్ లా కనిపించే స్నేహ ఉల్లాల్ ఈ సినిమాకి చక్కని గ్లామర్ ని యాడ్ చేసింది. అలాగే తన పాత్రకు తను న్యాయం చేసింది. ఇక సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, జయ ప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్థి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, జీవా, ఆలీ, యమ్.యస్.నారాయణ, వెన్నెల కిశోర్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - నూతన సంగీత దర్శకుడు శ్రీ వసంత్ ఈ సినిమాలో అందించిన సంగీతం అబ్బో అనిపించకపోయినా బాగుంది.తొలి పాటలో "మురిపించే మువ్వలు" చిత్రంలోని "నీ లీలపాడెద దేవా" మకుటం యొక్క ట్యూన్ని వాడుకున్న తీరు బాగుంది. రీ-రీకార్డింగ్ కూడా ఫరవాలేదు.

కెమెరా - కెమెరా వర్క్ ఫరవలేదు. ఈ సినిమాని కళ్ళకు ఏమాత్రం శ్రమ లేకుండా చూసేలా ఈ చిత్రంలోని కెమెరా వర్క్ ఉంది.

మాటలు - "ఫైర్ ఎగ్జామినేషన్" అదేనండి "అగ్నిపరీక్ష" వంటి మాటలు అనేకం ఈ చిత్రంలో సందర్భోచితంగా ఉండి మనల్ని నవ్విస్తాయి.

పాటలు - బాగున్నాయి...సాహిత్యపరంగా అలాగే సంగీత పరంగా కూడా ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయనే చెప్పాలి.

ఎడిటింగ్ - బాగుంది.

ఆర్ట్ - ఇది కూడా బాగుంది.

కొరియోగ్రఫీ - గతంలో వచ్చిన నరేష్ సినిమాల్లోకన్నా ఈ సినిమాలో కొరియోగ్రఫీ బాగుందని చెప్పాలి.

యాక్షన్ - ఈ సినిమాకి ఈ డిపార్ట్ మెంట్ అనవసరం.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొటీన్ అల్లరి నరేష్ సినిమాలా ఉన్నా కూడా మీరు కాసేపు నవ్వుకోవాలంటే ఈ "మడతకాజా" సినిమాని ఒకసారు చూసి హాయిగా నవ్వుకోవచ్చు.