Read more!

English | Telugu

సినిమా పేరు:మ్యాడ్
బ్యానర్:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Oct 6, 2023

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి 
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023

యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పేరున్న బ్యానర్ తోడైతే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సితార నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'. నవ్వించడమే టార్గెట్ గా చేసిన ఈ సినిమాతో ఎందరో నటీనటులు, దర్శకుడు పరిచయమయ్యారు. నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) కుమార్తె హారిక కూడా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవ్వడం విశేషం. మరి కొత్త వాళ్ళంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది? నిజంగానే నవ్వులు పూయించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లోకి అశోక్(నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ(సంగీత్ శోభన్), మనోజ్(రామ్ నితిన్), లడ్డు(విష్ణు) సహా పలువురు అడుగు పెడతారు. డీడీ, మనోజ్, లడ్డు తో పాటు మరికొందరు ఓ గ్యాంగ్ లా ఉంటారు. అనాథ అయిన అశోక్ మాత్రం ఎవరితో కలవకుండా తన పనేదో తను చూసుకుంటూ ఉంటాడు. అలాంటి అశోక్ క్యాంటీన్ గొడవ కారణంగా ఆ గ్యాంగ్ కి దగ్గరవుతాడు. వీళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. అశోక్, జెన్నీ(అనంతిక) ఒకరినొకరు ఇష్టపడతారు కానీ ఒకరిపై ఒకరికున్న ప్రేమను చెప్పుకోరు. చూసిన అమ్మాయిలందరినీ ఫ్లర్ట్ చేస్తూ పులిహార రాజాగా పేరు తెచ్చుకున్న మనోజ్.. శృతి(గౌరి) అనే అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి, తన ప్రేమ కోసం పరితపిస్తాడు. ఇక మనల్ని ఎవరు లవ్ చేస్తారు అనుకునే డీడీకి.. ఒకమ్మాయి నువ్వంటే ఇష్టమని పేరు చెప్పకుండా లెటర్ రాసి, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ దగ్గరవుతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు డీడీ. ఇలా వారి కాలేజ్ లైఫ్ ఎలా సాగింది? ముగ్గురి ప్రేమ కథలు సక్సెస్ అయ్యాయా? ఈ కథలో లడ్డు పాత్ర ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

కథగా చెప్పుకుంటే మ్యాడ్ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏంలేదు. జాతిరత్నాలు తరహాలో నవ్వించడమే టార్గెట్ గా ఈ సినిమా తీశామని.. కథాకథనాలు, లాజిక్స్ పట్టించుకోకుండా ఎంజాయ్ చేయాలని మేకర్స్ ముందుగానే చెప్పారు. సినిమా కూడా నిజంగానే అలాగే ఉంది. గొప్ప కథాకథనాలు, గొప్ప సన్నివేశాలు లేవు. సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా సినిమా నడిచింది. కాలేజ్, హాస్టల్ సన్నివేశాలతో ఎంతో ఫన్నీగా సాగింది. 

కొత్తగా కాలేజ్ హాస్టల్ లో జాయిన్ అయిన ఓ స్టూడెంట్ అక్కడి నుంచి పారిపోతుంటే.. అతన్ని ఆపి, అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అంటూ తమ గ్యాంగ్ కాలేజ్ లో చేసిన అల్లరి గురించి లడ్డు చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సినిమా ఆద్యంతం కామెడీగానే ఉంటుంది. ముఖ్యంగా డీడీ, లడ్డు పాత్రల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే జాతిరత్నాలులో నవ్వించడం తప్ప వేరే ఆలోచన లేకుండా సినిమా నడుస్తుంది. కానీ మ్యాడ్ లో మూడు లవ్ ట్రాక్ లు ఉండటంతో అక్కడక్కడా కాస్త కామెడీ డోస్ తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే దర్శకుడు కామెడీ పేరుతో లాజిక్స్ అన్నీ వదిలేసి మరీ గుడ్డిగా వెళ్ళలేదు. రియల్ లైఫ్ లో కాలేజ్ లో, హాస్టల్ లో కొందరు ఎలా ఉంటారో.. దాని నుంచి పాత్రలు, సన్నివేశాలు రాసుకున్నాడు. అందుకే అవి సహజంగా, హాస్యంగా అనిపించాయి. అయితే కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం ఇప్పటికే చాలాసార్లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి లేకపోతే క్లీన్ ఎంటర్టైనర్ గా ఉండేది.

ఈ సినిమాలో పాటలు పెద్దగా మెప్పించలేకపోయాయి. నేపథ్య సంగీతంతో పర్లేదు అనిపించుకున్న భీమ్స్ సిసిరోలియో పాటలతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నార్నే నితిన్ సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా ఇలా ఓ కామెడీ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించడం విశేషమే. అయినప్పటికీ ఉన్నంతలో తన మార్క్ చూపించాడు. యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలో మాత్రం కాస్త మెరుగుపడాలి. ఇప్పటికే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'తో తన టాలెంట్ నిరూపించుకున్న సంగీత్ శోభన్.. మరోసారి మ్యాజిక్ చేశాడు. కామెడీ హీరోగా అతనికి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే మనోజ్ పాత్రలో రామ్ నితిన్ కూల్ గా చేశాడు. ఇక ఈ సినిమాలో కమెడియన్ విష్ణు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. సంగీత్ శోభన్ తో కలిసి చాలావరకు సినిమాని భుజాల మీద మోశాడు. ఈ ఇద్దరి కామెడీనే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హీరోయిన్లు శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్,  అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నవ్వించడమే టార్గెట్ గా ఈ సినిమా తీశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటాం. కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి కాలేజ్ డేస్ ని, హాస్టల్ డేస్ ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. రెండున్నర గంటల పాటు థియేటర్ లో హాయిగా నవ్వుకోవచ్చు.

-గంగసాని