Read more!

English | Telugu

సినిమా పేరు:లాల్ సింగ్ చ‌డ్ఢా
బ్యానర్:ఆమిర్ ఖాన్ ప్రొడక్ష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
Rating:2.50
విడుదలయిన తేది:Aug 11, 2022

సినిమా పేరు: లాల్ సింగ్ చ‌డ్ఢా
తారాగ‌ణం: ఆమిర్ ఖాన్‌, క‌రీనా క‌పూర్‌, నాగ‌చైత‌న్య‌, మోనా సింగ్‌, మాన‌వ్ విజ్‌, షారుక్ ఖాన్ (స్పెష‌ల్ అప్పీరెన్స్‌)
మ్యూజిక్: ప్రీత‌మ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్: త‌నూజ్ టికు
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌జిత్ పాండే
ఎడిటింగ్: హేమంతి స‌ర్కార్‌
నిర్మాత‌లు: ఆమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారే
ద‌ర్శ‌క‌త్వం: అద్వైత్ చంద‌న్‌
బ్యాన‌ర్స్: ఆమిర్ ఖాన్ ప్రొడక్ష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
విడుద‌ల: తేదీ 11 ఆగ‌స్ట్ 2022

టామ్ హాంక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా 1994లో వ‌చ్చిన హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్‌'కు ఇండియ‌న్ రీమేక్‌ 'లాల్ సింగ్ చ‌డ్ఢా' రూపంలో వ‌స్తున్న‌ద‌నే వార్త చాలా మంది సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని క‌లిగించింది. ఆమిర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా చేసిన ఈ మూవీలో మ‌న తెలుగు హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కొంత‌మందైనా ఈ సినిమాపై ఆస‌క్తి చూపించారు. 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' ఫేమ్‌ అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా' మ‌న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉందా?

క‌థ‌

పంజాబీ అయిన లాల్ సింగ్ చ‌డ్ఢా (ఆమిర్ ఖాన్‌) తండ్రి, తాత‌, ముత్తాత‌.. అంతా మిల‌ట‌రీలోనే ప‌నిచేసిన‌వాళ్లే. అంద‌రూ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన‌వాళ్లే. త‌ల్లి (మోనాసింగ్‌) అత‌డిని పెంచి పెద్ద‌చేస్తుంది. చిన్న‌త‌నంలో కాళ్ల బ‌ల‌హీన‌త్వం వ‌ల్ల స‌రిగా న‌డ‌వ‌లేని లాల్‌కు స్కూల్లో ప‌రిచ‌య‌మై స్నేహితురాలిగా మారిన‌ రూప వ‌ల్ల మామూలుగా న‌డ‌వ‌డ‌మే కాకుండా, మెరుపు వేగంతో ప‌రుగెత్తే శ‌క్తిమంతుడ‌వుతాడు. చిన్న‌త‌నం నుంచే ఏమాత్రం క‌ల్మ‌షం లేని అమాయ‌క‌త్వంతో ఉండే లాల్ అమ్మ కోరిక మేర‌కు ఆర్మీలో చేర‌తాడు. అక్క‌డ బాల‌రాజు (నాగ‌చైత‌న్య‌) అనే తెలుగు కుర్రాడు నేస్తం అవుతాడు. తండ్రి స‌హా అత‌డి వంశంలోని పూర్వీకులంతా చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే ప‌నిలో నిపుణులైన‌వాళ్లే. ఆర్మీలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌ను చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే కంపెనీ పెడ‌తాన‌నీ, పార్ట‌న‌ర్‌గా చేర‌మ‌నీ లాల్‌ను అడుగుతాడు బాల‌రాజు. స‌రేనంటాడు లాల్‌. కానీ కార్గిల్‌లో టెర్ర‌రిస్టుల‌తో జ‌రిగిన పోరులో బాల‌రాజు చ‌నిపోతాడు. మిత్రుడికి ఇచ్చిన మాట ప్ర‌కారం చెడ్డీలు, బ‌నియ‌న్ల కంపెనీ ప్రారంభిస్తాడు లాల్‌. ఇంకోవైపు త‌ను ఎంత‌గానో ఆరాధించే రూప (క‌రీనా క‌పూర్ ఖాన్‌)ను పెళ్లిచేసుకుంటావా? అన‌డుగుతాడు. చిన్న‌త‌నంలో విప‌రీత‌మైన పేద‌రికాన్ని చూసిన రూప డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంతో మ‌రో దారి ఎంచుకుంటుంది. బిజినెస్‌లో లాల్ స‌క్సెస్ అయ్యాడా?  రూప అత‌డికి ద‌గ్గ‌ర‌య్యిందా?  లాల్ జీవితం చివ‌ర‌కు ఏ తీరానికి చేరింది? అనేది మిగ‌తా సినిమాలో చూస్తాం.


ఎనాలసిస్ :

చిన్న‌పాటి మార్పులు త‌ప్ప 'ఫారెస్ట్ గంప్' క‌థ‌ను దాదాపు య‌థాత‌థంగా తీశాడు డైరెక్ట‌ర్‌ అద్వైత్ చంద‌న్‌. ఒక ట్రైన్‌లో చండీగ‌ఢ్‌కు వెళ్తున్న లాల్ సింగ్ చ‌డ్ఢా తోటి ప్ర‌యాణికుల‌కు త‌న క‌థ చెప్ప‌డం ప్రారంభించ‌డంతో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. చిన్న‌త‌నం నాటి సీన్ల‌న్నీ ఒరిజిన‌ల్‌కు కాపీగా క‌నిపిస్తాయి. అయితే కాలానుసారం భార‌త‌దేశంలో జ‌రిగిన కీల‌క ఘ‌ట‌న‌ల‌ను ఈ సినిమాలో వాడుకున్నారు. ఇందిరాగాంధీ హ‌త్యానంత‌రం ఢిల్లీలో సిక్కుల ఊచ‌కోత జ‌రిగిన సంద‌ర్భంలో లాల్ చిన్న‌పిల్లాడు. కొడుకును హంత‌కుల మూక నుంచి ర‌క్షించ‌డానికి త‌ల్లి అత‌డి త‌ల‌పాగా తీసేసి, జుట్టును ప‌గిలిన గాజు ముక్క‌తో కోసేయ‌డం హృద‌యాన్ని క‌దిలించే స‌న్నివేశం. ఆ త‌ర్వాత బాబ్రీమ‌సీదు విధ్వంసం, తాజ్ హోట‌ల్‌పై టెర్ర‌రిస్టు దాడి ఘ‌ట‌న‌ల‌ను కూడా క‌థానుసారం వాడుకున్నారు. 

ఎదుటి వ్య‌క్తుల్లోని క్రూర‌త్వాన్ని కానీ, క‌ల్మ‌షాన్ని కానీ గుర్తించ‌లేనంత స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సున్న లాల్ సింగ్ చ‌డ్ఢా జీవితాన్ని అత్యంత ప్ర‌భావితం చేసిన వ్య‌క్తులుగా అత‌ని త‌ల్లి, రూప‌, బాల‌రాజు క‌నిపిస్తారు. అమ్మ మాట వేదంగా భావించే లాల్.. ఆమె ఏం చెబితే అది చేస్తూ.. జీవితంలో ఎదుగుతాడు. ఇంకోవైపు రూప‌ను ఆరాధిస్తూ, ఆమె త‌న నుంచి దూరంగా పోతున్నా ఆప‌లేని నిస్స‌హాయ‌త్వంతో మూగ‌వేద‌న ప‌డుతుంటాడు. ఆర్మీ మిత్రుడు బాల‌రాజు కోసం అత‌ని క‌ల‌ను తాను నిజంచేసి, అత‌డి కుటుంబాన్ని ఆదుకుంటాడు. అలాంటి ఒక అద్భుత‌మైన పాత్ర తెర‌మీద క‌ద‌లాడుతుంటే నిజానికి ప్రేక్ష‌కులు స‌హానుభూతి చెందాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. కార‌ణం.. అతి నెమ్మ‌దిగా సాగిన క‌థ‌నం. బ‌ల‌హీన‌మైన స్క్రీన్‌ప్లే కార‌ణంగా కొన్ని చోట్ల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టిన‌ట్లు ఫీల‌వుతాం. సినిమాకి ఎండ్ కార్డ్ ప‌డుతుందేమోన‌ని అనిపించాక కూడా ఇంకో అర‌గంట సినిమా న‌డుస్తుంది. 

బాల‌రాజు పాత్రతో వినోదాన్ని అందించాల‌నుకున్న ప్ర‌య‌త్నం అంత‌గా ఫ‌లించ‌లేదు. రూప ఎంచుకున్న దారినీ, ఆమె ప్ర‌యాణాన్నీ మ‌నం హ‌ర్షించ‌లేం. దాంతో ఆమె పాత్ర‌తో క‌నెక్ట్ కాలేం. అలాగే మంచిత‌నం, అమాయ‌క‌త్వం త‌ప్ప ఏమాత్రం క‌ల్మ‌షం తెలీనివాడిగా క‌నిపించే లాల్ సింగ్ చ‌డ్ఢా పాత్ర‌తోనూ మ‌నం సంపూర్ణంగా స‌హానుభూతి చెంద‌లేం. మ‌రీ ఇంత అమాయ‌క‌త్వ‌మైతే ఎలా అనిపిస్తుంది. అది ఈ కాల‌పు పాత్ర‌లా అనిపించ‌దు. బ‌హుశా 1990వ ద‌శ‌కంలోనే ఈ మూవీని రీమేక్ చేస్తే ఫ‌లితం మ‌రోలా ఉండేదేమో.. 

టెక్నిక‌ల్‌గా 'లాల్ సింగ్ చ‌డ్ఢా' టాప్ క్లాస్‌లో ఉంద‌నేది నిజం. స‌త్య‌జిత్ పాండే సినిమాటోగ్ర‌ఫీ, త‌నూజ్ టికు బ్యాగ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్ అనిపిస్తాయి. ప్రీత‌మ్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు సంద‌ర్భానుసారం వ‌చ్చి బాగున్నాయ‌నిపిస్తాయి. హిందీ సినిమాకు తెలుగు అనువాద సంభాష‌ణ‌లు మెప్పించాయి. హేమంతి స‌ర్కార్ ఎడిటింగ్ మ‌రింత షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు అత్యున్న‌త స్థాయిలో ఉన్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు

నో డౌట్‌.. లాల్ సింగ్ చ‌డ్ఢాగా టైటిల్ రోల్‌లో ఆమిర్ ఖాన్ గొప్ప‌గా రాణించాడు. ఇప్ప‌టికే 'పీకే' సినిమాలో గ్ర‌హాంత‌ర‌వాసిగా అమాయ‌క‌మైన పాత్ర‌లో ఆక‌ట్టుకున్న ఆమిర్ ఇప్పుడు దానికి సిమిల‌ర్‌గా క‌నిపించే లాల్ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. ఒరిజిన‌ల్ మూవీలో చేసిన టామ్ హాంక్స్‌కు ఎక్క‌డా ఏమాత్రం త‌గ్గ‌ని న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. ఆ పాత్ర పోష‌ణ‌లో ఆయ‌న క‌న్విక్ష‌న్ మ‌న‌కు క‌నిపిస్తుంది. తెర‌పై లాల్ ప్ర‌ద‌ర్శించే హావ‌భావాలు.. అమాయ‌క‌పు చూపులు, న‌వ్వు, బాధ‌, విషాదం.. మ‌న‌ల్ని క‌దిలిస్తాయంటే అది ఆమిర్ న‌ట‌న వ‌ల్ల‌నే. రూప‌గా క‌రీనా క‌పూర్ ఉన్న‌త స్థాయి న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. అయితే పాత్ర తీరు వ‌ల్ల ఆమె మ‌న హృదయాల్ని క‌దిలించ‌లేదు. బాల‌రాజుగా నాగ‌చైత‌న్య న‌ట‌న‌ప‌రంగా ఆక‌ట్టుకున్నాడు కానీ లుక్స్ ప‌రంగా ఆక‌ట్టుకోలేదు. ఉబ్బెత్తుగా క‌నిపించ‌డానికి కింది పెద‌వి లోప‌ల ఏదో పెట్టుకొని మాట్లాడుతుండ‌టంతో ఇబ్బందిక‌రంగా అనిపించింది. లాల్ త‌ల్లి పాత్ర‌లో మోనా సింగ్ ఒదిగిపోయింది. కార్గిల్‌లో లాల్ వ‌ల్ల బ‌తికిపోయే టెర్రరిస్ట్ మ‌హ‌మ్మ‌ద్ పాత్ర‌కు మాన‌వ్ విజ్ న్యాయం చేశాడు. చిన్న‌ప్ప‌టి లాల్‌, రూప పాత్ర‌లు చేసిన బాల‌న‌టులు ఆక‌ట్టుకున్నారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఆమిర్ ఖాన్ న‌ట విన్యాసాల్ని ఆస్వాదించాల‌నుకునేవాళ్లు ఈ సినిమాని చూడ‌వ‌చ్చు. మ‌న‌సులో ఎలాంటి క‌ల్మ‌షం లేని వ్య‌క్తి, ఎదుటివాళ్ల నుంచి ఏమీ ఆశించ‌కుండా తానివ్వ‌ద‌ల‌చుకున్న దాన్ని ఇచ్చేసే మంచి వ్య‌క్తి జీవిత ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి ఎలా సాగింది, ఆ ప్ర‌యాణంలో అత‌నికి ఎవ‌రెవ‌రు తార‌స‌ప‌డ్డారు, ఆ ప్ర‌యాణం ఏయే మ‌లుపులు తిరిగింది అనే క‌థాంశంతో వ‌చ్చిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'ను ఆస్వాదించాలంటే ఒకింత ఓపిక కావాలి. ఆ ఓపిక లేక‌పోతే దీన్ని భ‌రించ‌డం క‌ష్టం.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి