Read more!

English | Telugu

సినిమా పేరు:ఎల్‌జీఎం
బ్యానర్:ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 4, 2023

సినిమా పేరు: ఎల్‌జీఎం(లెట్స్ గెట్ మ్యారీడ్)
తారాగణం: హరీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు, ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు తదితరులు
సంగీతం: ర‌మేష్ త‌మిళమ‌ణి
సినిమాటోగ్రాఫర్: విశ్వజిత్ ఒడుక్కతిల్
ఎడిటర్: ప్రదీప్ E. రాఘవ్
రచన, దర్శకత్వం: ర‌మేష్ త‌మిళమ‌ణి
నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హ‌స్జా
బ్యానర్: ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: ఆగస్టు 4, 2023 

క్రికెట్ లో తిరుగులేని కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్.ధోని ఇప్పుడు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ ను స్థాపించి ఎల్‌జీఎం(LGM - Lets Get Married) అనే చిత్రాన్ని నిర్మించారు. తమిళ్ లో రూపొందిన ఈ చిత్రం నేడు తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ధోని బ్యానర్ కి శుభారంభాన్ని ఇచ్చేలా ఉందా?...

కథ:

ఒకే కంపెనీలో కలిసి పని చేస్తున్న గౌతమ్(హరీష్ క‌ళ్యాణ్‌), మీరా(ఇవానా) ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. వారి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒప్పుకుంటాయి. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో గౌతమ్ తో పెళ్లికి మీరా ఒక కండిషన్ పెడుతుంది. గౌతమ్ తల్లి(న‌దియా) గురించి తనకేం తెలియకపోవడంతో, ఆమెతో కలిసి ఉండలేనని, పెళ్లయ్యాక మనం విడిగా ఉండాలని, అలా అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటానని గౌతమ్ తో మీరా చెబుతుంది. పుట్టగానే తండ్రిని దూరంచేసుకున్న గౌతమ్ కి.. తల్లి అంటే ప్రాణం. తల్లికి దూరంగా ఉండటం అతనికి ఇష్టంలేదు. దీంతో గౌతమ్-మీరా పెళ్లికి బ్రేక్ పడుతుంది. ఈ క్రమంలో మీరాకి ఓ ఆలోచన వస్తుంది. తనకు కాబోయే అత్తగారి గురించి తెలుసుకోవడం కోసం.. రెండు కుటుంబాలు కలిసి ట్రిప్ కి వెళదామని అంటుంది. అలా ఇరు కుటుంబాలు కూర్గ్ ట్రిప్ కి వెళ్తాయి. ఆ ట్రిప్ ఎలా సాగింది? ట్రిప్ కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? కాబోయే అత్తాకోడళ్ళు ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారా? వారి మధ్యలో గౌతమ్ ఎలా నలిగిపోయాడు? చివరికి గౌతమ్-మీరా పెళ్లికి రూట్ క్లియర్ అయిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ఒకే ఇంట్లో అత్తగారితో కలిసి జీవితాంతం ఉండాల్సి వచ్చినప్పుడు.. పెళ్లికి ముందే ఆ అత్తగారి గురించి తెలుసుకోవాలని కాబోయే కోడలు భావిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. నిజానికి ఇది మంచి కాన్సెప్ట్. కాబోయే అత్తాకోడళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కలిసి ప్రయాణం చేయడం, వారి మధ్య అబ్బాయి నలిగిపోయే సరదా సన్నివేశాలతో సినిమాని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలచవచ్చు. అయితే ఆ విషయంలో దర్శకుడు ర‌మేష్ త‌మిళమ‌ణి పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు.

గౌతమ్-మీరా ప్రేమ సన్నివేశాలతో ప్రారంభమై.. అక్కడక్కడా కాస్త నవ్విస్తూ ప్రథమార్థం సాగింది. ఆఫీస్ లో గౌతమ్ ఫ్రెండ్స్ కామెడీ, బస్సు జర్నీలో యోగిబాబు కామెడీ పరవాలేదు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే ఉంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ట్రాక్ తప్పాడు. పలు సన్నివేశాలు కథకి తగ్గట్లుగా రాసుకున్న దానికంటే, నిడివి కోసం రాసుకున్నట్లుగానే అనిపించాయి. అత్తాకోడళ్లు ఒకరికొకరు దగ్గరవడానికి కావాల్సిన బలమైన సన్నివేశాలు పడలేదు. సినిమా అంతా నవ్వించి, పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించే స్కోప్ ఉన్నా.. రచనలో ఎక్కడా ఆ బలం కనిపించలేదు. పతాక సన్నివేశాల్లో యోగిబాబు కామెడీ మాత్రం కొంతవరకు కాపాడింది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగున్నా.. నెమ్మదిగా సాగే కథనం, బలమైన సన్నివేశాలు కొరవడటం, ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడంతో సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది.

ఈ సినిమాకి సంగీతం కూడా ర‌మేష్ త‌మిళమ‌ణి నే అందించారు. ఆయన సంగీతంతో కూడా పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. విశ్వజిత్ ఒడుక్కతిల్ కెమెరా పనితనం బాగానే ఉంది. కథనమే నెమ్మదిగా సాగడంతో ఎడిటర్ ప్రదీప్ E. రాఘవ్ కూడా చేతులెత్తేశారు. అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసుంటే, ల్యాగ్ అనే భావన కొంతవరకు తగ్గి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:

ఇది ప్రధానంగా కాబోయే అత్తాకోడళ్ళ మధ్య నడిచే కథ. ఇందులో అత్తగా నదియా, కోడలుగా ఇవానా వారి వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. అనుభవంగల నటి నదియా అవలీలగా తన పాత్రను చేయగా, ఇవానా కూడా మరోసారి తన మార్క్ చూపించారు. ఇక ప్రేమించిన అమ్మాయి, ప్రేమగా పెంచిన తల్లి మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో హరీష్ క‌ళ్యాణ్‌ మెప్పించారు. బస్ డ్రైవర్ గా యోగిబాబు తనదైన శైలిలో నవ్వించి అంతోఇంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. నెమ్మదిగా సాగే కథనం, బలమైన సన్నివేశాలు కొరవడటం, ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడంతో సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కథనం, అత్తాకోడళ్ళ సన్నివేశాల మీద మరింత దృష్టి పెట్టి.. కామెడీ డోస్ పెంచినట్లయితే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యుండేది. కానీ ఇప్పుడు ఓటీటీలో కూడా చూడొచ్చా అనుకునేలా నిరాశపరిచి, నిర్మాతగా ధోనిని మొదటి బంతికే ఔట్ చేసింది.

-గంగసాని