Read more!

English | Telugu

సినిమా పేరు:కృష్ణ వ్రింద విహారి
బ్యానర్:ఐరా క్రియేషన్స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Sep 23, 2022

సినిమా పేరు: కృష్ణ వ్రింద విహారి
తారాగణం: నాగ శౌర్య, షెర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ
సంగీతం: మహతి స్వర సాగర్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: ఉషా మూల్పూరి
రచన, దర్శకత్వం: అనీష్‌ ఆర్‌. కృష్ణ
బ్యానర్: ఐరా క్రియేషన్స్‌
విడుదల తేదీ: 23 సెప్టెంబర్ 2022

 

2018లో వచ్చిన 'ఛలో'తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య ఆ తర్వాత ఆ స్థాయి విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ గ్యాప్ లో అతను హీరోగా నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవేవీ సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'కృష్ణ వ్రింద విహారి'. మొదటి సినిమా 'అలా ఎలా'(2014)తో దర్శకుడిగా మెప్పించిన అనీష్ ఆర్.కృష్ణ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు 'లవర్', 'గాలి సంపత్'తో నిరాశపరిచాడు. ఇది అతని దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా. మరి ఈ చిత్రం హీరోగా నాగ శౌర్యకి, డైరెక్టర్ గా అనీష్ కి విజయాన్ని అందించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

 

కథ:

తల్లి చాటు బిడ్డలా పద్ధతి, విలువలతో పెరిగిన బ్రాహ్మణ యువకుడు కృష్ణ చారి(నాగ శౌర్య) జాబ్ చేయడం కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ తన ఆఫీస్ లో టీమ్ లీడ్ అయిన వ్రింద(షెర్లీ సెటియా)తో ప్రేమలో పడతాడు. తనకి పూర్తి విరుద్ధమైన అలవాట్లు ఆమెకి ఉన్నాయని తెలిసినా, ఆమెకి పిల్లలు పుట్టరని తెలిసినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. పైగా కృష్ణ తల్లి అమృతవల్లి(రాధిక) చనిపోయిన తన తల్లి తనకు మనవరాలిగా పుడుతుందని ఆశ పడుతుంది. ఈ క్రమంలో వ్రిందని పెళ్లి చేసుకోవడం కోసం కృష్ణ ఏం చేశాడు? అతను చెప్పిన ఒక అబద్దం కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరికి కృష్ణ, వ్రింద పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారా? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

టాలీవుడ్ లో ఒకే ఏడాది ఒకే కథాంశంతో రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు 'కృష్ణ వ్రింద విహారి' విషయంలోనూ అదే జరిగింది. ఈ ఏడాది జూన్ లో విడుదలైన 'అంటే సుందరానికీ' చిత్రానికి, దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు సినిమాల మెయిన్ ప్లాట్ ఒకటే. 'అంటే సుందరానికీ' చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తుంటే పదే పదే ఆ సినిమానే గుర్తుకొస్తుంది.

ఫస్ట్ హాఫ్ లవ్, కామెడీ సీన్స్ తో అలా అలా సాగిపోయింది. అయితే వ్రిందని కృష్ణ అంతలా ప్రేమించడం, ఆమె కోసం అతను తపన పడటం అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఎందుకంటే ఆమెని తొలిచూపులోనే ఇష్టపడ్డాడు అనుకోవడానికి కూడా లేదు. ఆమెని చూడటానికి పది నిమిషాల ముందే మరో అమ్మాయిని ఇష్టపడి ఫ్లవర్ ఇస్తాడు. విలేజ్ లో పేరెంట్స్ దగ్గర ఉండి, అమ్మాయి ప్రేమకు నోచుకోక.. సిటీకి రాగానే ఎలాగైనా ఒకమ్మాయికి ప్రేమించాలన్న ఆత్రుతే తప్ప.. అనుకోకుండా వ్రిందని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడి, ఆమే సర్వస్వము అనుకున్నాడు అనే ఫీలింగ్ కలగదు. అయితే కొన్ని కొన్ని మంచి సన్నివేశాలు, చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ పర్లేదు అనుకునేలా నడిచింది.

సెకండాఫ్ లో కృష్ణ చెప్పే ఒక అబద్దంతో సినిమా మలుపు తిడుతుంది. ఆ అబద్దం కారణంగానే ఏర్పడే పరిణామాలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా కృష్ణ, వ్రింద, కృష్ణ తల్లి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కథనం, సన్నివేశాలు 'అంటే సుందరానికీ' చిత్రాన్ని పోలి ఉండటం, ఊహించని మలుపులు లేకవపోవడం, వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల ఊహనికి అందేలా ఉండటం వంటివి సినిమాపై ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయి. ఇందులో వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ ఇలా ఎందరో కమెడియన్స్ ఉన్నారు. కానీ వారిని దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. ఆ పాత్రలతో కామెడీ ట్రాక్స్ ని డిజైన్ చేసుకున్న తీరు బాగున్నప్పటికీ, ఆ పాత్రల స్వభావానికి కామెడీ డోస్ సరిపోలేదు. కామెడీ డోస్ పెంచుంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యుండేది. 'అంటే సుందరానికీ' ఆలోచనల నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చి నవ్వుకొని సినిమాని ఎంజాయ్ చేసేవారు.

'ఛలో', 'భీష్మ' వంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహతి స్వర సాగర్‌ సినిమా సినిమాకి తన మార్క్ తగ్గించుకుంటున్నాడు. ఈ చిత్రంలో సాంగ్స్ పర్లేదు అనుకునేలా ఉన్నాయి గాని పదే పదే పాడుకునేలా మాత్రం లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాలకు తగ్గట్టు ఇచ్చాడు. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి తగ్గట్లుగా కలర్ ఫుల్ గా ఉంది. తమ్మిరాజు కూర్పు బాగానే ఉంది, అక్కడక్కడా కోత పెడితే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ ఖర్చు కనిపిస్తుంది.

నటీనటుల పనితీరు:
ప్రస్తుతం ఒక సాధారణ బ్రాహ్మణ యువకుడు ఎలా ఉంటాడో అలా పాత్రకు తగ్గట్లు చక్కగా ఒదిగిపోయాడు నాగ శౌర్య. ఎక్కడా మోతాదుకు మించి నటించకుండా ఆ పాత్రకు ఎంత అవసరమే అంతే చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. పైకి మోడ్రెన్ గా ఉంటూ, మనసులో బాధను మోసే యువతి పాత్రలో షెర్లీ సెటియా బాగానే రాణించింది. ఇక నాగ శౌర్య తల్లి అమృతవల్లి పాత్రలో రాధిక తన అనుభవంతో అవలీలగా నటించారు. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, అన్నపూర్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'అంటే సుందరానికీ' చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తుంటే పదే పదే ఆ సినిమా గుర్తుకొచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి 'అంటే కృష్ణకీ' అనే టైటిల్ కూడా పెట్టాలనిపిస్తుంది. ఆ సినిమా చూడని వాళ్లకి మాత్రం 'కృష్ణ వ్రింద విహారి' పర్లేదు అనిపిస్తుంది. పెద్దగా అంచనాల్లేకుండా కుటుంబమంతా కలిసి కాసేపు కాలక్షేపానికి చూద్దామనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు.

 

-గంగసాని