Read more!

English | Telugu

సినిమా పేరు:కావ్యాస్ డైరి
బ్యానర్:ఇందిరా ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 5, 2009
ఇదొక విభిన్నమైన కథతో తయారుచేయబడిన చిత్రం. రాజ్‍ (ఇంద్రజిత్), పూజ (మంజుల) ఇద్దరు భార్యాభర్తలు. వారెంతో అన్యోన్యంగా జివిస్తుంటారు. వీరికి ఒక మాటలు రాని బాబు, ఒక చిన్ని పాప ఉంటారు. వీరి ఇంటికి కావ్య (ఛార్మి) అనే అమ్మాయి ఒక ఆయాలా వస్తుంది. కానీ రాజ్‍, పూజ దంపతులు ఆమెను ఆయాలా కాక ఒక స్నేహితురాల్లా చూస్తారు. రాజ్‍, పూజల అభిమానం సంపాదించటంతో పాటు, పిల్లలకు కూడా బాగా దగ్గరవుతుంది కావ్య. పిల్లాడికి తనపాలే పడుతుంది. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చే ముందే భర్త చనిపోవటంతో పాటు అనుకోకుండా కావ్యకి అబార్షన్ కూడా అవుతుంది. రాజ్‍ తమ్ముడు (శశాంక్) దీపావళి పండక్కి రాజ్‍ ఇంటికి వస్తాడు. అతను కావ్యని చూసీ చుడగానే ప్రేమిస్తాడు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో అతను మరణిస్తాడు. ఆ కారు ప్రమాదం అతనికి అనుకోకుండా జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అన్నది అర్థం కాదు. అసలు ఈ కావ్య ఎవరు అని ఒక్క సారి ఆలోచిస్తే ఈ సినిమా కథ మనకర్థమవుతుంది. కావ్య ఒక గైనకాలజిస్ట్ భార్య. అంటే ఆమె భర్త ఒక డాక్టరన్నమాట. కానీ అతను తన వద్దకు వచ్చే ఆడ పేషెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. పూజ కూడా తన కూతురు కడుపులో ఉన్నప్పుడు ఈ గైనకాలజిస్ట్ వద్దకు ట్రీట్‍మెంట్‍ కోసం వస్తుంది. కానీ అందమైన ఆడవాళ్లని చూడగానే పెడదారి బట్టే తన బుద్ధిని కావ్య భర్త అదుపుచేసుకోలేక పూజ ముందు దొరికిపోతాడు. దాంతో ఆమె అతన్ని అల్లరి పెట్టేసరికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయానికి అతని భార్య కావ్యకు అబార్షన్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఆమె గర్భసంచిని తీసివేయాల్సి వస్తుంది. అంటే కావ్యకు ఇక పిల్లలుపుట్టే అవకాశం కూడా లేదన్నమాట. కావ్య నిజానికి తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోటానికే పూజ ఇంట్లో ఆయాగా పనికి చేరుతుంది.కావ్య మనసులో ఏమనుకుంటుందంటే పూజని చంపేసి, పూజ స్థానంలోకి రాజు భార్యగా చేరి, ఇద్దరు పిల్లలతో, భర్తతో హ్యాపీగా జీవితం గడిపేయాలని ప్లాన్ చేస్తుంది. చివరికి కావ్య ప్లాన్ ఫలించిందా....? కావ్య చేతిలో పూజ చనిపోయిందా...? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి. ఇలాంటి కథతో సినిమా తీయటమంటే కొంచెం సాహసమనే చెప్పాలి. ఇది నిజానికి ఆఫ్ బిట్‍ చిత్రమని చెప్పవచ్చు. ఇది"ది హ్యాండ్ దట్‍ రాక్స్ ది క్రెడిల్" అనే ఆంగ్ల చిత్రానికి ఫ్రీమేక్. అంటే ఒక విధంగా ఆ చిత్రాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్టు చెప్పవచ్చు. ఈ ఆంగ్ల చిత్రం 1922లో వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాగానే హ్యాండిల్‍ చేసినా సినిమా తొలి సగం మాత్రం ఇంటర్వెల్‍ వరకూ సినిమా నత్త నడక నడుస్తూంది. సెకండ్‌ హాఫ్ మాత్రం మనకి బాగున్నట్టనిపిస్తుంది.ఇక నటన విషయానికొస్తే ఛార్మి పైకి తీయగా మాట్లాడుతూ, అభిమానాన్ని కనబరుస్తూ, లోలోపల పగతో రగిలిపోయే ఆడదానిగా అద్భుతమైన నటన కనబరిచింది.
ఎనాలసిస్ :
ఛార్మికి ఒక నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. ఆ పాత్రను ఆమె సమర్థవంతంగా పోషించింది. మంజుల తన పాత్రకు తాను పూర్తి న్యాయం చేసింది. ఛార్మి, మంజుల మధ్య జరిగే కొన్ని సీన్లు చాలా బాగా వచ్చాయి.ఈ చిత్రానికి కేమెరా పనితనం చాలా బాగుంది. ప్రతి ఫ్రేం చాలా అందంగా చూపించేలా శ్యామ్ దత్ ఫొటోగ్రఫీ కృషిచేసిందని చెప్పాలి. అలాగే ఈ చిత్రానికి సంగీతం కూడా ప్లస్సయిందని చెప్పాలి. సంగీతం ఈ చిత్రంలో గొప్పగా లేకపోయినా నీచంగా మాత్రం లేదు. అలాగే ఎడిటింగ్ కూడా.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కుటుంబకథా చిత్రంలో క్రైమ్ కలిపి, సస్పెన్స్ జోడిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. మీకు గనక అలాంటి సినిమా చూడాలనిపిస్తే, ఈ చిత్రం చూడండి.