Read more!

English | Telugu

సినిమా పేరు:కాంతార‌
బ్యానర్:హోంబ‌ళే ఫిలిమ్స్‌
Rating:4.00
విడుదలయిన తేది:Oct 15, 2022

సినిమా పేరు: కాంతార‌
తారాగ‌ణం: రిష‌బ్ శెట్టి, కిశోర్, స‌ప్త‌మి గౌడ‌, అచ్యుత్ కుమార్‌, ప్ర‌మోద్ శెట్టి, ప్ర‌కాశ్ తుమినాడు, మాన‌సి సుధీర్‌, న‌వీన్ డి. పాటిల్‌, స్వ‌రాజ్ శెట్టి, ష‌నీల్ గురు, దీప‌క్ రాయ్ ప‌నాజే 

మాట‌లు: హ‌నుమాన్ చౌద‌రి
మ్యూజిక్: అజ‌నీశ్ లోక్‌నాథ్‌
సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ ఎస్‌. క‌శ్య‌ప్‌
ఎడిటింగ్: ప్ర‌తీక్ శెట్టి, కె.ఎం. ప్ర‌కాశ్‌
యాక్ష‌న్: విక్ర‌మ్ మోరే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: ధ‌ర‌ణి గాంగే పుత్ర‌
నిర్మాత: విజ‌య్ కిరంగ‌దూర్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రిష‌బ్ శెట్టి
బ్యాన‌ర్: హోంబ‌ళే ఫిలిమ్స్‌
విడుద‌ల తేదీ: 15 అక్టోబ‌ర్ 2022

రెండు వారాల క్రితం విడుద‌లైన క‌న్న‌డ చిత్రం 'కాంతార' సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీని తీసిన హోంబ‌ళే ఫిలిమ్స్ నిర్మించ‌డం ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. క‌న్న‌డంలో న‌టునిగా, ద‌ర్శ‌కునిగా త‌న‌దైన ముద్ర‌వేసిన రిష‌బ్ శెట్టి న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఉన్న‌త స్థాయిలో ఉన్నాయ‌నే పేరు వ‌చ్చింది. ఒరిజిన‌ల్ రిలీజైన రెండు వారాల త‌ర్వాత తెలుగులో దాన్ని గీతా డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా రిలీజ్ చేయాల‌ని అల్లు అర‌వింద్ సంక‌ల్పించారు. అలా వ‌చ్చిన 'కాంతార' తెలుగు వెర్ష‌న్ ఎలా ఉందంటే...

క‌థ‌
1847లో క‌ర్ణాట‌క ప‌శ్చిమ క‌నుమ‌ల్లో ఉన్న త‌న అట‌వీ భూమిని స్థానిక గిరిజ‌నుల‌కు దానం చేస్తాడు ఆ ప్రాంత రాజు. దాని వ‌ల్ల అత‌నికి అంత‌దాకా ఉండ‌ని మ‌న‌శ్శాంతి ల‌భిస్తుంది. కాలం గ‌డుస్తుంది. 1970లో అత‌ని వంశానికి చెందిన వార‌సుడు ఆ భూమిని తిరిగి త‌మ‌కు ఇచ్చెయ్యాల‌ని గిరిజ‌నుల‌ను వారికి అత్యంత ప్ర‌ధాన‌మైన భూత‌కోల పండ‌గ స‌మ‌యంలో అడుగుతాడు. కానీ దైవాగ్ర‌హానికి గురై మ‌ర‌ణిస్తాడు. 1990కి వ‌చ్చేస‌రికి కంబాల ఆట (కాడెద్దుల ప‌రుగు పందెం)లో మొన‌గాడిగా ఆ అడ‌విలో పేరు తెచ్చుకుంటాడు శివ (రిష‌బ్ శెట్టి). ఫారెస్ట్ ఆఫీస‌ర్ ముర‌ళీధ‌ర్ (కిశోర్‌) ఆ ప్రాంతాన్ని అట‌వీశాఖ‌కు స్వాధీనం చేసి, దాన్ని రిజ‌ర్వ్ ఫారెస్ట్ చెయ్యాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఈ విష‌యంలో శివ‌, ముర‌ళీధ‌ర్ మ‌ధ్య గొడ‌వ పెరిగి పెద్ద‌ద‌వుతుంది. శివ ప్రేమించే లీల (స‌ప్త‌మి గౌడ‌) అక్క‌డే ఫారెస్ట్ గార్డ‌వుతుంది. ఆమె డ్యూటీలో చేరిన రోజే, త‌న మ‌న‌సుకు విరుద్ధంగా త‌న ప్రాంతంలోనే కంచె వేసే ప‌నులు ప్రారంభించాల్సి వ‌స్తుంది. 

మ‌రోవైపు శివ‌తో త‌న‌కు కావాల్సిన ప‌నుల్ని చేయించుకుంటూ వ‌స్తుంటాడు దొర దేవేంద్ర‌ (అచ్యుత్ కుమార్‌). ఒక‌సారి శివ ఓ పెద్ద చెట్టును రంపంతో కోస్తుంటే.. అది ప్ర‌మాద‌వ‌శాత్తూ అప్పుడే అటువైపు వ‌స్తున్న ముర‌ళీధ‌ర్ జీపుపై ప‌డుతుంది. అంద‌రూ చ‌నిపోయి ఉంటార‌నే భ‌యంతో శివ‌, అత‌ని స‌హ‌చ‌రులు పారిపోతారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?  త‌న పూర్వీకులు దానం చేసిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల‌నుకొనే దేవేంద్ర ఏం చేశాడు? ఫారెస్ట్ ఆఫీస‌ర్ ముర‌ళీధ‌ర్ ప‌ట్టిన పంతం నెగ్గిందా? శివ‌, లీల ఒక్క‌ట‌య్యారా? తండ్రి బాట‌లో శివ కూడా కోల ఆడ‌తాడా? అనే విష‌యాలను మిగ‌తా క‌థ‌లో చూస్తాం.


ఎనాలసిస్ :

ఇర‌వై, ముప్పై ఏళ్ల క్రితం 'కాంతార' సినిమా వ‌స్తే.. ఆర్ట్ ఫిలిమ్‌గా ముద్ర‌వేసేవాళ్లే. ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పు, కాలానుగుణమైన ఎదుగుద‌ల కార‌ణంగా అప్ప‌టి ఆర్ట్ ఫిల్మ్ క‌థ‌లు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ క‌థ‌లుగా మారుతున్నాయి. (కొద్ది కాలం క్రితం తెలుగులో వ‌చ్చిన 'ప‌లాస 1978' సినిమా ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.) హోంబ‌ళే ఫిలిమ్స్ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టికి బ‌డ్జెట్ గురించి బెంగ లేక‌పోయింది. అత‌నికి కావాల్సిన వ‌న‌రుల్ని నిర్మాత‌లు అత్యంత నాణ్య‌త‌తో స‌మ‌కూర్చి పెట్ట‌డంతో, త‌ను అనుకున్న దానిని అనుకున్న‌ట్లు ఉన్న‌త స్థాయిలో చిత్రీక‌రించ గ‌లిగాడు. అడ‌వికీ, మ‌నిషికీ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ వ‌ల్ల ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయ‌నేది ఇందులోని ప్ర‌ధానాంశం.

మ‌న‌ది సుసంప‌న్న‌మైన గిరిజ‌న సంస్కృతి క‌లిగిన దేశం. అడ‌వి బిడ్డ‌ల‌కు అడ‌వే అన్నంపెట్టే త‌ల్లి. వాళ్ల సంస్కృతిలోని, వాళ్ల పండ‌గల్లోని విలువ‌ల్నీ, న‌మ్మ‌కాల్నీ, సౌంద‌ర్యాన్నీ చూడాలంటే అంద‌మైన మ‌న‌సుండాలి. అలాంటి హృద‌యంతోటే రిష‌బ్ శెట్టి 'కాంతార‌'ను రూపొందించాడ‌ని చెప్ప‌డానికి సంశ‌యించాల్సిన ప‌నిలేదు. చ‌క్క‌ని క‌థ‌, బిగువైన క‌థ‌నం, ఉత్కంఠ‌భ‌రిత‌మైన సన్నివేశాలు, రోమాలు నిక్క‌బొడుచుకొనేలా చేసే యాక్ష‌న్ ఎపిసోడ్లు, ముచ్చ‌ట‌గొల్పే అమాయ‌క (మొర‌టు) ప్రేమ స‌న్నివేశాలు.. వెర‌సి 'కాంతార‌'ను ఒక బ్రిలియంట్ ఫిల్మ్‌గా త‌యారుచేశాయి. మ‌న మ‌ట్టికి సంబంధించిన క‌థ‌ను ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తీయాలనే దానికి ఉదాహ‌ర‌ణ‌గా కూడా 'కాంతార' నిలుస్తుంది.

రిష‌బ్ శెట్టి ప‌నిత‌నం గురించి ఎంత చెప్పినా త‌నివి తీర‌దు. ఈ సినిమాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, క‌థానాయ‌కుడు.. అత‌నే. త్రిమూర్తిలాగా అత‌ను చెల‌రేగిపోయాడు. 'కాంతార‌'తో దేశంలోని గొప్ప సిల్వ‌ర్ స్క్రీన్ స్టోరీ టెల్ల‌ర్స్‌లో ఒక‌డిగా అత‌ను నిలిచాడు. కొన్ని స‌న్నివేశాల్ని అత‌ను చిత్రీక‌రించిన తీరుకు అబ్బురప‌డ‌తాం, పుల‌క‌రించిపోతాం. క్లైమాక్స్ అయితే ఇటీవ‌లి కాలంలో మ‌నం చూసిన ది బెస్ట్ క్లైమాక్స్ ఇదే అని చెప్పేయొచ్చు. 

రిష‌బ్‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌నీష్ లోక్‌నాథ్ గొప్ప అండ‌గా నిలిచాడు. అత‌ని బీజీఎంతో అనేక సీన్లు థ్రిల్లింగ్ క‌లిగించాయి. అలాగే ఎక్క‌డ నిశ్శ‌బ్దం అవ‌స‌ర‌మో, దాన్ని గొప్పగా ఊహించి చేశాడు. అర‌వింద్ ఎస్‌. క‌శ్య‌ప్ సినిమాటోగ్ర‌ఫీ వేరే లెవ‌ల్లో ఉంది. అత‌ను ఉప‌యోగించిన లైటింగ్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. భూత‌కోల ఆడేట‌ప్పుడు అత‌ని కెమెరా ఆడిన విధానాన్ని ఎంత మెచ్చుకున్నా త‌క్కువే. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ విక్ర‌మ్ మోరే డిజైన్ చేసిన యాక్ష‌న్ సీన్లు 'కాంతార‌'ను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా మార్చేశాయి. ధ‌ర‌ణి గాంగే పుత్ర ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌ను ఏమాత్రం త‌క్కువ చేయ‌లేం. వెర‌సి.. టెక్నిక‌ల్‌గా ఇదొక సూప‌ర్లేటివ్ మూవీ కూడా.

న‌టీన‌టుల ప‌నితీరు
సినిమాలో తెలుగువాళ్ల‌కు తెలిసిన న‌టులు ఒక‌రిద్ద‌రు కంటే లేరు. కొన్ని సినిమాలు తెలుగులో చేసి ఉండ‌టం వ‌ల్ల కిశోర్ మ‌న‌కు బాగా ప‌రిచ‌య‌స్తుడే. 'ఛ‌లో' సినిమా చూసిన వాళ్లు అచ్యుత్ కుమార్‌ను గుర్తుప‌డ‌తారు. మిగ‌తావాళ్లెవ‌రూ మ‌న‌కు తెలిసిన‌వాళ్లు కాదు. అయినా ఈ సినిమాతో వారు బాగా ప‌రిచ‌య‌స్తుల‌వుతార‌ని ఊహించ‌వ‌చ్చు. శివ‌గా రిష‌బ్ శెట్టిది బ్రిలియంట్ ప‌ర్ఫార్మెన్స్‌. ఆద్యంతం అత‌ను త‌న న‌ట‌న‌తో మ‌న‌ల్ని స‌మ్మోహితుల్ని చేశాడు. అత‌ని నవ్వు, అత‌ని కోపం, అత‌ని ప్రేమ‌, చివ‌ర‌లో అత‌ని ధ‌ర్మాగ్ర‌హం.. వారెవ్వా! ఏం అభిన‌యం!! క్లైమాక్స్‌లో అత‌ని హావ‌భావాలు ఒంటిని జ‌ల‌ద‌రింప‌జేస్తాయి. అత‌ని "వ్వా.." అనే అరుపుకు గగుర్పాటు కల‌గ‌కుండా ఉండ‌దు. ఈ ఏడాది మ‌నం తెర‌పై చూసిన గొప్ప అభిన‌యాల్లో శివ‌గా రిష‌బ్ న‌ట‌న ఒక‌ట‌నేది నిస్సందేహం. ఫారెస్ట్ ఆఫీస‌ర్ ముర‌ళీధ‌ర్‌గా కిశోర్ ఎప్ప‌ట్లా చ‌క్క‌ని న‌ట‌న చూపాడు. దొర పాత్ర‌లో అచ్యుత్ కుమార్ ఒదిగిపోయాడు. లీల‌గా స‌ప్త‌మి గౌడ గ్లామ‌ర‌స్‌గా లేక‌పోయినా, ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లు అందంగా న‌టించింది. దేవేంద్ర అనుచ‌రుడు సుధాక‌ర్‌గా ప్రమోద్ శెట్టి, శివ త‌ల్లి క‌మ‌ల‌గా మాన‌సీ సుధీర్‌, లాయ‌ర్‌గా న‌వీన్ డి. పాటిల్‌, శివ క‌జిన్ గుర‌వాగా స్వ‌రాజ్ శెట్టి త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

క‌థా క‌థ‌నాల ప‌రంగా, అభిన‌యం ప‌రంగా, దృశ్య‌ప‌రంగా 'కాంతార' ఒక అసాధార‌ణ చిత్రం. రిష‌బ్ శెట్టి అనే ఒక నట ద‌ర్శ‌కుడు అంతా తానై చెల‌రేగిపోయి చేసిన ఒక నాట్య విలాసం. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా మిస్ చేసుకోకూడ‌ని ఒక మ్యాజిక్ ఫిల్మ్‌.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి