English | Telugu
బ్యానర్:హోంబలే ఫిల్మ్స్
Rating:2.75
విడుదలయిన తేది:Oct 2, 2025
తారాగణం: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్
ప్రొడక్షన్ డిజైనర్: బంగ్లాన్
ఎడిటర్: సురేష్ మల్లయ్య
రచన, దర్శకత్వం: రిషబ్ శెట్టి
నిర్మాత: విజయ్ కిరగందూర్
బ్యానర్: హోంబలే ఫిలింస్
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2025
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం 2022లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. తెలుగులోనూ భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు 'కాంతార'కి ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. (Kantara Chapter 1 Review)
కథ:
ఇది కాంతార ప్రాంతానికి సంబంధించిన కథ. అడవి మధ్యలో ఉండే కాంతార ప్రాంతంలో ఒక తెగ నివసిస్తూ ఉంటుంది. వారు ఈశ్వరుడిని పూజిస్తారు. ఆ ఈశ్వరుని గణాలే తమని, తమ ప్రాంతాన్ని కాపాడతాయి అనేది వారి నమ్మకం. కాంతార ప్రాంతంలో ఎంతో విలువైన ప్రకృతి సంపద ఉంటుంది. ఆ సంపదనను కొల్లగొట్టాలని ఆశపడిన బాంగ్రా రాజ్యానికి చెందిన రాజు అక్కడే ప్రాణాలు కోల్పోతాడు. అప్పటి నుంచి కాంతారకు, బాంగ్రాకు మధ్య రాకపోకలు ఉండవు. తన కళ్ళ ముందే తన తండ్రి కాంతారకు బలి కావడంతో.. ఎప్పటికైనా ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో బాంగ్రా తదుపరి రాజు విజయేంద్ర(జయరాం) ఉంటాడు. కానీ, కాంతారకు వెళ్లే ప్రయత్నం చేయకుండానే.. తన కుమారుడు కులశేఖర(గుల్షన్ దేవయ్య)కు పట్టాభిషేకం చేస్తాడు. ఎప్పుడూ మద్యం సేవిస్తూ, కొంచెం కూడా బాధ్యత కూడా లేకుండా ఉండే కులశేఖర.. ఒకసారి సరదాగా వేటకు అంటూ తన సైన్యాన్ని తీసుకొని కాంతారకు వెళ్తాడు. అలా కాంతారలో అడుగుపెట్టిన కులశేఖర మరియు అతని బృందానికి.. బర్మీ(రిషబ్ శెట్టి) తన స్నేహితులతో కలిసి బుద్ధి చెప్పి, ప్రాణభయంతో పారిపోయేలా చేస్తాడు. అంతేకాదు, ఆ తర్వాత తన వర్గాన్ని తీసుకొని బర్మీ.. బాంగ్రా రాజ్యంలో అడుగుపెట్టి, అక్కడి రాజులకు సవాల్ చేస్తాడు. వారికి వ్యతిరేకంగా బందరు కేంద్రంగా వ్యాపారం కూడా మొదలుపెడతాడు. దీంతో కాంతారను నాశనం చేయాలని బాంగ్రా రాజ్యం నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు బర్మీ(రిషబ్ శెట్టి) ఎవరు? బావిలో దొరికిన అతనికి, ఈశ్వరుడిని సంబంధం ఏంటి? బాంగ్రా రాజ్యం నుండి కాంతారను కాపాడగలిగాడా? బాంగ్రా యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్)తో బర్మీ ప్రేమ కథ ఏమైంది? ఈశ్వర పూతోట అంటే ఏంటి? దానిపై ఎవరి కన్నుపడింది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
2022లో వచ్చిన కాంతారను పాన్ ఇండియా సినిమాగా తీయలేదు. ప్రాంతీయ సినిమాగానే తీశారు. కానీ, అది పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. కాంతార అనేది ఒక ప్రాంత మట్టి కథ. కథాకథనాలు, సన్నివేశాలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. భూత కోలా ఆచారం మిగతా ప్రాంతాల వారికి కొత్తగా అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించింది. అందుకే కాంతార అంతటి విజయం సాధించింది. అయితే 'కాంతార చాప్టర్ 1'లో సహజత్వం కంటే అడుగడుగునా భారీతనం ఉట్టిపడింది.
శివ తన తండ్రి(రిషబ్ శెట్టి) మాయమైన చోటు గురించి తెలుసుకుంటూ ఆ ప్రాంతంలోని పెద్దవారిని కథ అడుగుతాడు. అలా 'కాంతార చాప్టర్ 1' కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాంగ్రా రాజు కన్ను కాంతార ప్రాంతంపై పడి అతను చనిపోవడం.. దాంతో అతని కుమారుడు, ఈశ్వర పూతోటను నాశనం చేయాలనుకునే దుష్టులతో చేతులు కలపడం వంటి సన్నివేశాలలతో సినిమా ఆసక్తికరంగా నడిచింది. ముఖ్యంగా కులశేఖర కాంతారకు రాగా, అతనిని బర్మీ తరిమికొట్టడం ఆకట్టుకుంది. అయితే బాంగ్రా రాజ్యంలోకి బర్మీ అడుగుపెట్టిన తర్వాత కథనం నెమ్మదించింది. కొన్ని సన్నివేశాలు నిడివి ఎక్కువగా ఉంటే, మరికొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. ఇంటర్వెల్ కి ముందు మాత్రం సినిమా ఊపందుకుంది. ఇంటర్వెల్ బ్లాక్ ని డిజైన్ చేసిన తీరు బాగుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా కాంతారను నాశనం చేయాలనుకుని వచ్చిన కులశేఖరకు, అతని సైన్యాన్ని.. బర్మీకి ఒంటిపై దేవుడు పూని రుద్రరూపం చూపించే ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. అలాగే పతాక సన్నివేశాలు కూడా మెప్పించాయి. డివోషనల్ టచ్ తో భారీ యాక్షన్ సన్నివేశంతో సినిమాని ముగించిన తీరు కట్టిపడేసింది.
కాంతారలో క్లైమాక్స్ హైలైట్ గా నిలిచింది. 'కాంతార చాప్టర్ 1'లో అలాంటి ఎపిసోడ్ లు మూడు నాలుగు ఉన్నాయి. ఆ ఎపిసోడ్ లు కూడా అద్భుతంగా పండాయి. అయితే వాటిని కలుపుతూ రాసుకున్న కథనం నెమ్మదిగా సాగింది. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకుంటే.. సినిమా ఇంకా మెరుగా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రిషబ్ శెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కాంతారలోనే తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు అందుకున్నాడు. 'కాంతార చాప్టర్ 1'లో మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా రౌద్ర రసం పండించిన తీరు అమోఘం. కనకావతిగా రుక్మిణి వసంత్ కి మంచి పాత్ర లభించింది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే విజయేంద్ర రాజుగా జయరాం, బాధ్యత లేని యువరాజు కులశేఖర పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకున్నారు.
నటుడిగా, దర్శకుడిగా నూటికి నూరు శాతం సినిమాకి న్యాయం చేసిన రిషబ్ శెట్టి.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. టెక్నికల్ గా ఈ మూవీ బ్రిలియంట్ గా ఉంది. అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా వర్క్ టాప్ క్లాస్ లో ఉంది. ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ పనితనం ప్రేక్షకులను కాంతార ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కాంతార స్థాయిలో లేకపోయినా, ఎఫెక్టివ్ గానే ఉంది. కొన్ని సన్నివేశాల్లో తనదైన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలను కుదించాల్సింది. యాక్షన్ సన్నివేశాలను బాగా డిజైన్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథనం నెమ్మదిగా సాగినప్పటికీ.. సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ కోసం, రిషబ్ శెట్టి నటన కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు.