Read more!

English | Telugu

సినిమా పేరు:కందిరీగ
బ్యానర్:శ్రీ సాయి గణేష్
Rating:3.00
విడుదలయిన తేది:Aug 12, 2011

అనకాపల్లిలో శీను (రామ్) అనే చురుకైన తెలివైన కుర్రాడు తనకు డిగ్రీ లేదని, తన మావ కూతురు పెళ్ళి చేసుకోననటంతో హైదరాబాద్ కొచ్చి కాలెజీలో చేరతాడు. అక్కడ కనిపించిన శృతి ( హన్సిక మోత్వాని) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ శృతిని భవానీ ( సోనూ సూద్ ) ప్రేమిస్తూంటాడు. ఆమెను కాలెజీలో ఎవరైనా ప్రేమించినట్టు తెలిస్తే వాళ్ళ కాళ్ళూ చేతులూ విరిచేస్తాడు. ఆ భవానీకి మస్కా కొట్టి శృతిని పెళ్ళిలోంచి లేపుకుపోతుంటే రాజన్న మనుషులు శృతిని కిడ్నాప్ చేస్తారు... శృతికి రాజన్న మనుషులకు సంబంధం ఏమిటంటే శీను అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చే సమయంలో రైల్లో అమ్మాయిలను ఏడిపిస్తున్న వాళ్ళని కొట్టటం చూసిన రాజన్న కూతురు సంధ్య (అక్ష) శీనుని ప్రేమిస్తుంది. శీనుని చేసుకుంటానని తన తండ్రి రాజన్నతో సంధ్య చెప్పటంతో శీనుని వరంగల్ రప్పించటానికి శృతిని కిడ్నాప్ చేయిస్తాడు రాజన్న. మరి సంధ్య నుండి శీను ఎలా తప్పించుకుని శృతిని దక్కించుకున్నాడన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఈ సినిమా కథలో రెడీ షేడ్స్ కనిపించినా, కెమెరా మేన్ నుంచి దర్శకుడిగా మారిన నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చక్కని స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించిన తీరు బాగుంది. కథలో స్పాన్ తక్కువైనా కూడా ఉన్నంతలో ఎంటర్ టైన్ మెంట్ కి ప్రాథాన్యతనిచ్చిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా, పాటలు సినిమాకి అడ్డంకిగా లేకుండా, పైగా అవి ప్లస్ అయ్యేలా సినిమా తీసిన సంతోష్ అభినందనీయుడు. అనుమానం లేకుండా సంతోష్ శ్రీనివాస్ రూపంలో తెలుగు తెరకు ఒక చక్కని కమర్షియల్ దర్శకుడు లభించాడని చెప్పొచ్చు.    

నటన - ఆకలిగొన్న చిరుత పులికి వేట దొరికినప్పుడుండే కసి మనకి రామ్ లో కనపడుతుందీ సినిమాలో. రామ్ తనకు తగిన పాత్ర దొరికితే ఎలా రెచ్చిపోయి సినిమా చేస్తాడో చెప్పటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రామ్ డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని చెప్పటం చర్విత చర్వణమే అవుతుంది. పక్కా మాస్ భాషలో చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో నటన ఇరగదీశాడని చెప్పొచ్చు. ఇక హన్సిక మోత్వానీ నటన పరంగా బాగానే నటించినా శరీరాన్ని గనక అదుపు చేసుకోకపోతే హీరోయిన్ గా ఆమె భవిష్యత్తు అనుమానమేననిపిస్తుంది. అక్ష రాజన్న కూతురుగా, తెలంగాణా అమ్మాయిగా బాగానే నటించింది. ఇక భవానీ పాత్రలో సోనూ సూద్, రాజన్నగా జయప్రకాష్ రెడ్డిలకు ఆ పాత్రలు కొట్టిన పిండి. సినిమాలో కామెడి బాగానే ఉన్నా బ్రహ్మానందం కామెడి మాత్రం పండలేదు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - తమన్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పాలి. పాటలన్నీ మాంచి ఊపుతో ఉన్నాయి..వాటికి రామ్ ఎనర్జీ తోడవటంతో ఈ సినిమాలోని పాటలు, వినటానికీ, చూడటానికీ కూడా బాగున్నాయి. రీ-రికార్డింగ్ బాగుంది.
సినిమాటోగ్రఫీ - స్వతహాగా కెమెరామేన్ అయిన దర్శకుడు కావటంతో ఈ సినిమాలో కెమెరా పనితనం బాగానే ఉంది.
మాటలు - సంతోష్ శ్రీనివాస్ మాటలు కొత్తగా లేకపోయినా సందర్భోచితంగా ఉండి బాగున్నాయి.
పాటలు - పాటలు కూడా సాహిత్యపరంగా బాగున్నాయి...
ఎడిటింగ్ - సినిమా ఎప్పుడయ్యిందో తెలియనంత నీట్ గా ఎడిటింగ్ ఉంది.
ఆర్ట్ - ఈ సినిమాలోని సెట్స్ బాగున్నాయి...
కొరియోగ్రఫీ - కొరియోగ్రఫీ ఈ సినిమాలో కొరియోగ్రఫీ హీరో రామ్ ని దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేసినట్లున్నారు. చాలా బాగుంది.
యాక్షన్ - బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ధైర్యంగా, హ్యాపీగా సకుటుంబంగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.