Read more!

English | Telugu

సినిమా పేరు:కలవరమాయే మదిలో
బ్యానర్:మోహన్ మీడియా క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 17, 2009
శ్రియ (స్వాతి) ఔత్సాహిక గాయని. ఆమెకు తండ్రి ఉండడు.ఆమె కన్నతల్లే అన్నీ తానే పెంచి పెద్ద చేస్తుంది. ఆమెకు ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఒక పాటైనా పాడాలని ఉంటుంది. కానీ ఆమె తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)కి ఎందుకోగానీ సంగీతం అంటే కోపం. తల్లికి తెలియకుండా ఒక హోటల్లో శ్రియ పాటలు పాడుతూ ఉంటుంది. శ్రియ తల్లికి ఆమెను ఒక ఛార్టెడ్ ఎకౌంటెంట్‍గా చూడాలని కోరిక.తల్లి కోసం పగలంతా ఒక ఆఫీసులో సి.ఎ.చేస్తుంటుంది. శ్రియ వాళ్ళ ఆపార్ట్ మెంటులో పెట్‍ హౌస్‌కి శ్రీను (కమల్‍ కామరాజ్‍)అనే కుర్రాడు లండన్ నుండి వస్తాడు. అతనంటే శ్రియకు ఎందుకనో అభిమానం.అతను శ్రియ పాట వింటాడు.. కానీ అందరిలా చప్పట్లు కొట్టడు. ఒకసారి శ్రియ పాడే హోటల్ కి రావు (విక్రమ్ గోఖలే) అనే శస్త్రీయ గాయకుణ్ణి పిలిపిస్తారు. అతను బాగా తాగి శ్రియ పాటను విమర్శిస్తాడు. దాంతో శ్రియ మనసు బాధపడుతుంది. దాంతో శ్రియను రావు గారి వద్దే సంగీతం నేర్చుకోమని సలహా ఇస్తాడు శ్రీను. శ్రియను శిష్యురాలిగా రావు ముందు అంగీకరించడు. ఒక పక్క తన తల్లికి సంగీతం అంటే ఇష్టం లేకపోవటం, మరో పక్క తనకు సంగీతం ప్రాణంగా ఉండటంతో ఎటు తేల్చుకోలేని శ్రియకు శ్రీను దిశా నిర్దేశం చేస్తాడు. రావు ఇంట్లో పనిమనిషిగా చేరి అతని అభిమానం సంపాదించి, ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటుంది శ్రియ. రావు గారు థ్రోట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు ఉంటారు. చివరికి ఎ.ఆర్‌‍.రెహమాన్ వద్ద ఆడిషన్ కి శ్రియకు పిలుపొస్తుంది. రావు గారు శ్రియను అక్కడికి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తారు. అప్పుడు శ్రియకు తన గురువే తన తండ్రి అన్న నిజం తెలుస్తుంది. కానీ శ్రియ అక్కడికి వెళ్ళకుండా వాయిస్ ఆఫ్ ఎ.పి.కాంపిటిషన్ లో పాల్గొంటుంది. శ్రియ అలా ఎందుకు చేసింది...? తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని శ్రియ ఎందుకు వదులుకుంది...? శ్రియ కల నెరవేరిందా...? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ఎనాలసిస్ :
ఇదొక ఫీల్‍ గుడ్ మూవీ. ఇందులో అసభ్య సంభాషణలు కానీ, అసభ్య దృశ్యాలు కానీ, అర్థం పర్థం లేని యాక్షన్ సీన్లు కానీ లేవు. అలాగే కౄరమైన విలన్లు కూడా లేరు. చక్కని స్క్రీన్‌ప్లేతో, రెండు గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే చిత్రమే ఈ "కలవరమాయే మదిలో". దర్శకుడు సతీష్ కాశెట్టి తన గత చిత్రం "హోప్ "కి జాతీయ అవార్డు సంపాదించుకున్నారు. ఈ కథ చాలా సింపుల్ కథ. ఈ కథలో మనకు చాలా షేడ్లు కనిపిస్తాయి. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం వంటి సినిమాలు ఈ చిత్రంలో ఎక్కడైనా మనకు గుర్తుకొస్తే అది దర్శకుడి తప్పుకాదు. తాను ముందే విశ్వనాథ్ గారికి ఏకలవ్య శిష్యుణ్ణని చెప్పాడు. దర్శకత్వం చాలా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. అంతకన్నా ముందు నిర్మాత అభిరుచిని మెచ్చుకోవాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: ఈ సినిమాని మొత్తంగా తన భుజాల మీదే మోసింది స్వాతి. ఆమె వరకు నటనలో చాలా పరిణితి చూపించింది. తనదంటూ ఒక ముద్రను నటనలో చూపించింది. అయితే ఆమెను సావిత్రితో పోల్చటం ఒక్కటే కాస్త ఎక్కువనిపించింది. అయినా నిజానికి స్వాతి ఈ చిత్రంలో చాలా బాగా నటించింది. ఇంతవరకూ చెప్పొచ్చు. భవిష్యత్తులో ఆమెకు ఇంకా ఎంతో నట జీవితం ఉంది. ఆమె నటనలో ఇంకా చాలా కృషి చేయాల్సింది కూడా ఎంతో ఉంది. నటీ, నటుడు తమలోని నటనను కాలంతో పాటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాల్సిన ఒక నిత్య నూతన పరిణామ క్రమం. ఇక హీరో కమల్‍ కామరాజ్‍ నటన కూడా బాగా మెరుగైంది. కారణం దర్శకుడి ప్రతిభ కావచ్చు. ఆవకాయ్ బిర్యానీ కన్నా ఈ చిత్రంలో అతని నటన బాగుంది. డీసెంట్‍గా, డిగ్ని ఫైడ్‌గా ఉంది. విక్రమ్ గోఖలే కూడా భాష రాకున్నా అతను చక్కగా నటించాడు. అలాగే ఢిల్లీ రాజేశ్వరి తన పాత్రలో చక్కగా నటించింది. తన భర్తతో విడిపోయే సీన్లో ఆమె నటన చాలా బాగుంది. ఇక తనికెళ్ళ భరణి నటన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. సంగీతం-: ఈ చిత్రంలోని సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గత రెండు వందల సంవత్సరాలుగా సంగీతంతో సంబంధం ఉన్న కుటుంబం నుండి వచ్చారు శరత్ వాసుదేవన్. మంగళం పల్లి బాలమురళీ కృష్ణకు తొలి శిష్యుడు ఈ శరత్ వాసుదేవన్. మళయాళంలో అనేక చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన శరత్ ఈ చిత్రానికి చక్కని సంగీతాన్నందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు వినుల విందుగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాట మరింత బాగుంది. రీ-రికార్డింగ్ బాగుంది. కెమెరా -: చాలా చక్కగా ఉంది. పాటల్లో కనివిందు చేసింది ఈ చిత్రంలోని ఫొటోగ్రఫీ. ఎడిటింగ్ -: నీట్‍ గా ఉంది. మాటలు -: వర్థమాన రచయిత లక్ష్మీ భూపాల్‌ మాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లలో మనసుకు హత్తుకునేలా దీపక్ మాటలు వ్రాశారు. పాటలు -: సాహిత్య పరంగా కూడా ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయి. కొరియోగ్రఫీ -: డీసెంట్‍గా ఉంది. ఈ చిత్రం తల్లీ, చెల్లి, కూతురు, భార్య, అన్నదమ్ములూ అందరూ కలసి సకుటుంబంగా ఈ సినిమాని చూడొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో ఎటువంటి అసభ్యత లేదు గనక. ఇది ఫీల్‍ గుడ్ మూవీ.