Read more!

English | Telugu

సినిమా పేరు:ఝుమ్మంది నాదం
బ్యానర్:శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 1, 2010
చాలా సింపుల్ కథ.భద్రాచలంలో తాను గొప్పగాయకుడు అయిన తర్వాతే ఊరికి వస్తానని బాలు (మనోజ్ కుమార్)అనే కుర్రాడు శ్రీ రాముడి మీద, తన తండ్రి మీద ఒట్టు పెట్టి హైదరాబాద్ కి వస్తాడు.అక్కడ కెప్టెన్ రావు (డాక్టర్ మంచు మోహన్ బాబు)ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటూంటాడు బాలు.వీళ్ళిద్దరికీ క్షణం పడదు.బాలూకి జెమిని మ్యూజిక్ లో జరిగే పోటీలో పాల్గోనే అవకాశం లభిస్తుంది.ఆ సమయంలో రావు ఇంటికి విదేశాల నుండి అతని స్నేహితుడి(సుమన్)కుమార్తె శ్రావ్య (తాప్సి)అనే అమ్మాయి వస్తుంది.ఆమె మన సాంప్రదాయ సంగీతం మీద ఒక డాక్యుమెంటరీని తయారుచేయాలనుకుంటుంది.అందుకు మన సంగీతం బాగా తెలిసిన ఒక గైడ్ కావాలని చూస్తుండగా,రావుకి ఇష్టం లేకపోయినా,బాలూకి సంగీతం బాగా తెలుసునని అతన్నే తన గైడ్ గా పెట్టుకుంటుంది శ్రావ్య.అందుకు బాలూకి అతను సంగీత సాధనాలు కొనేటందుకు ధనసాయం చేస్తుందామె.బాలూ, శ్రావ్య ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది.కానీ ఈ విషయం తెలిసి సెలెక్టర్లలో ఒకడైన రావు,బాలూ ఆ పోటీలో పాల్గొనాలంటే శ్రావ్యను మరచిపోవాలని అంటాడు.దానికి సరేనంటాడు బాలు.బాలూ తన ఊరిలో ఎందుకు శపథం చేయాల్సి వచ్చింది...?బాలూ, శ్రావ్యల ప్రేమ సఫలం అయ్యిందా...? వాళ్ళ ప్రేమను రావు అంగీకరించాడా...? చివరికి బాలూ ఆ పోటీలో గెలిచి తాను గొప్ప గాయకుణ్ణని నిరూపించుకున్నాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎనాలసిస్ :
ఈ సినిమా ఈ చిత్ర నిర్మాత లక్ష్మీప్రసన్న బాలూ అనే కుర్రాడి గురించి చెప్పటంతో మొదలవుతుంది. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ గురించి ఎవరికీ సందేహం అక్కర్లేదు కదా...? ఈ చిత్రంలో మనం మరచిపోతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడటానికి,పునరుద్ధరించాలి అని మనకు తెలియజెప్పాలి అని ఆయన చేసిన ప్రయత్నం హర్షణీయం.కాకపోతే బాలూని గాయకుడవకుండా ఉండాలని బుల్లెబ్బాయ్ (ఆహుతి ప్రసాద్)అంత తీవ్రంగా ప్రయత్నించటం సమంజసంగా లేదు.అలాగే మోహన్ బాబు పాత్రను సుమన్ నిందించటంలో చిత్రంలో ఆ సన్నివేశంలో ఇంకా ఏదో లోపించినట్లనిపిస్తుంది.ఎందుకంటే మోహన్ బాబు కొడుకు ఇంటి నుండి పారిపోయాడు అని మాత్రమే మనకు తెలుస్తుంది.అది ఎందుకు...? దాని వెనుకనున్న సంగతి ఏమిటి అనేది మిస్టరీగా ఉంటుంది...? ఇక తాప్సీ నేటి యువతకు నిద్రలేకుండా చేస్తుంది.ఆమెను రాఘవేంద్రరావు చూపించిన విధానం అలాంటిది.ఆమె కూడా తన అందాలను ఎంత గ్లామరస్ గా ఆరబోయాలో అంతగానూ ఆరబోసింది.మొత్తానికి దర్శకుడు తన పాత పంథాలోనే ఈ చిత్రాన్ని నడిపించటం, పూలూ, పళ్ళు బదులు ఈ సారి కొబ్బరి చిప్పల్ని ఒక పాటలో వాడటం ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది.పాటల్లో ముఖ్యంగా"సక్కగున్నావ్ రో నా సొట్ట సెంపలోడ" అనే పాట,"కొరికేసేలా చూస్తుంటే...నిగ్రహం"అనే పాటలు కన్నల పండుగ్గా ఉంటాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.కానీ ఇది ఆయన స్థాయికి సరిపోయే పాత్ర కాదని గట్టిగా చెప్పవచ్చు.అయినా తన సొంత చిత్రం కాబట్టి ఈ పాత్ర చేయటానికి ఆయనీ పాత్రలో నటించటానికి అంగీకరించి ఉంటారు.మనోజ్ నటన ఈ చిత్రంలో బాగా మెరుగుపడింది.అతనికి సహజంగా అతని తండ్రికున్న గళం రావటం గొప్పవరం.అయితే దాన్ని ఇంకా సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే డైలాగ్ మాడ్యులేషన్ లో భవిష్యత్తులో తన తండ్రిని మించే అవకాశాలున్నాయి.ఈ చిత్రంలో హావభావాలను సందర్భోచితంగా మార్చటంలో మనోజ్ కాస్త పరిణితి సాధించాడని చెప్పవచ్చు.ఇక డ్యాన్సులూ,ఫైటులూ అతను నేటి యువతరానికి అవసరమైన మేరకు చేశాడు.తాప్సి గురించి చెప్పాలంటే ఈ సినిమా విడుదల కాకుండానే ఆమె మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూందంటే ఆమె అందమ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కష్టపడితే ఈమె భవిష్యత్తులో సినీ పరిశ్రమను మహారాణిలా ఏలుతుందని చెప్పవచ్చు.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయంచేశారని చెప్పొచ్చు. సంగీతం - నేటి తరం సంగీత దర్శకులలో కాస్త సాహిత్యం వినపడేలా సంగీతం అందించే ఘనుడు కీరవాణి అనే చెప్పాలి.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయ్యింది.అన్ని పాటలూ బాగున్నా ముఖ్యంగా"సరిగమపదని సప్తస్వర సంగీత సుధ", "సక్కగున్నావ్ రో నా సొట్ట సెంపలోడ"అనే పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. రీ-రికార్డింగ్ లో మనోజ్ పోటీలో పాల్గొనేందుకు అనుమతి కోరటానికి మోహన్ బాబుని కలవటానికి మేడపైకి పరిగెత్తెటప్పుడు జంట స్వరాలను వాడటం చాలా బాగుంది...సందర్భోచితంగా ఉంది.రీ-రికార్డింగ్ లో ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కెమెరా - సీనియర్ కెమెరామేన్ యస్.గోపాల్‍ రెడ్డి ఈ చిత్రానికి చక్కని ఫొటోగ్రఫీని అందించారు. మాటలు - అద్భుతంగా లేకపోయినా అక్కడక్కడ ద్వందర్థాలు వచ్చేలా వ్రాసినా మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రంలోని మాటలున్నాయి."అబలతో తబలా", "నిగ్రహించుకోటానికి బాత్ రూంలోకెళ్ళి గంట సేపున్నా" ఎందుకూ అంటే "షవర్ కింద స్నానం చేస్తూ","పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్" ఇలాంటి మాటలు బాగానే ఉన్నాయి. పాటలు - సాహిత్య పరంగా ఈ చిత్రంలోని తొలి పాట "సరిగమపదని సప్తస్వర సంగీత సుధ", లాలి పాట, పెళ్ళి పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ - బాగుంది. కొరియోగ్రఫీ - ఈ చిత్రంలో ఒక పాటలో హీరో, హీరోయిన్లను ఇద్దరినీ గాల్లోకి లేపటం అనే కాన్సెప్ట్ బాగుంది. మిగిలిన పాటల్లో కూడా కొరియోగ్రఫీ బాగుంది. ఫైట్స్ - బాగున్నాయి. సంస్కృతీ, సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుంది.ఈ చిత్రాన్ని సకుటుంబంగా ఒకసారి హ్యాపిగా చూడవచ్చు