English | Telugu
బ్యానర్:శివరాజ్ ఫిలిమ్స్
Rating:2.25
విడుదలయిన తేది:Nov 25, 2016
హాస్య నటులు... హీరోలుగా ప్రమోషన్లు తెచ్చుకోవడం తెలుగు చిత్రసీమలో అతి సాధారణమైన విషయం. ''హీరోగా స్టేటస్ ఎలా ఉంటుందో ఓ సారి రుచి చూసేస్తే పోలా'' అనుకొని రంగంలోకి దిగిపోతుంటారు. కమెడియన్ హీరో అనేసరికి ఆ సినిమాకి ఓ స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చేస్తుంది కూడా. కానీ.. హీరోగానూ నవ్వులు పంచి, అక్కడా తమదైన ముద్ర వేసిన వాళ్లు చాలా తక్కువ మంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో. మరి ఈ హాస్యనటుడికి ఎలాంటి రిజల్ట్ దక్కబోతోంది? ఈ సినిమా ఎలా ఉంది? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
మంగళం సర్వేష్ కుమార్ (శ్రీనివాసరెడ్డి) కరీంనగర్ కుర్రాడు. బాగా చదువుకున్నాడు. కాకపోతే ఆత్మనూన్యతా భావం ఎక్కువ. దానికి తోడు జాతకాల పిచ్చి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యం. ఓ బాబా (జీవా) చెప్పినట్టల్లా చేస్తుంటాడు. చివరికి తన పేరు సర్వ మంగళంగా మార్చుకొంటాడు. ఎట్టకేలకు తన కోరిక ఫలించి కాకినాడలో ప్రభుత్వో ద్యోగం వస్తుంది. కానీ ఇంటినీ, ఆ ఊరినీ, ముఖ్యంగా కన్నతల్లినీ వదిలి వెళ్లాలంటే బెంగ. కాకినాడ వెళ్లినా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని, సొంత ఊరు వచ్చేస్తా అన్న ధీమాతో కాకినాడలో అడుగుపెడతాడు. అక్కడ రాణి (పూర్ణ)ని చూసి ఇష్టపడతాడు. తన మనసులో ఉన్న మాటను చెప్పేలోగా.. జేసీ (రవివర్మ) అనే మరో అబ్బాయికి దగ్గరవుతుంటుంది రాణి. జేసీ మంచోడు కాదు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకొన్నాడు? మూఢ నమ్మకాల పిచ్చి ఎలా పోయింది? ఆత్మనూన్యతా భావం వదిలేసి, ఆత్మవిశ్వాసం ఎలా సాధించాడు? అనేది సెకండాఫ్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎనాలసిస్ :
* విశ్లేషణ
దేశవాళీ వినోదం అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన సినిమా ఇది. ఆ శీర్షిక ఎందుకు పెట్టారో సినిమా నడిచేకొద్దీ అర్థమవుతుంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రా.. మనకు పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. మామూలు మాటలే.. కానీ ప్రత్యేక సందర్భంలో వాడిన వల్ల.. ఆ మాట నుంచి కూడా వినోదం వస్తుంది. సోది చెప్పకుండా దర్శకుడు నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. కథానాయకుడి అలవాట్లు, తన ప్లస్సులు, మైనస్సులూ ముందే చెప్పేశాడు. కథ కరీం నగర్ నుంచి కాకినాడకు షిప్ట్ అయ్యేంత వరకూ కాస్త నిదానంగానే నడుస్తుంది. ఆ తరవాత ఒక్కో పాత్ర ప్రవేశించే కొద్దీ.. వినోదం పండుతుంటుంది. తొలిభాగం కాస్త సీరియస్ సినిమానేచూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. `శ్రీనివాసరెడ్డి సినిమా కొస్తే.. కామెడీ లేదేంటి` అనే అనుమానం కలుగుతుంది. అయితే శ్రీనివాసరెడ్డి తప్ప ఆ చుట్టూ ఉన్న పాత్రలు నవ్వించే ప్రయత్నం చేస్తుంటాయి. ద్వితీయార్థంలో శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగుతాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తాడు. ఆత్మవిశ్వాసం పెంచుకొన్న వ్యక్తిగా.. శ్రీనివాసరెడ్డి నటన, తనను ఆట పట్టించినవాళ్లని ఆడుకొన్న విధానం బాగున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే... ఈ సినిమాకి ఆయువు పట్టు సెకండాఫ్‌లోనే ఉంది. అక్కడక్కడ సుతిమెత్తని సన్నివేశాలు, నవ్వించే సీన్.. ఎమోషనల్ కంటెంట్.. ఇలా అన్నీ ఉండేలా చూసుకొన్నాడు దర్శకుడు.
ఒక విధంగా చెప్పాలంటే ఇది పర్మనాలిటీ డవలెప్‌మెంట్‌కి సంబంధించిన కథ. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని చూపించారు. దేశవాళీ వినోదం మేళవించి. అయితే సెకండాఫ్‌లో కథకు సంబంధం లేని కొన్ని కొన్ని విషయాలు వచ్చిపడిపోతుంటాయి. దాని వల్ల కథకు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ. కామెడీ వర్కవుట్ అవ్వడం వల్ల చూసేస్తుంటాం. సినిమాకి కావల్సింది బలమైన థ్రెట్. అది ఈ సినిమాలో చాలా సాదా సీదాగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల దర్శకుడి అనుభవ రాహిత్యం, అన్ మెచ్యూరిటీ కనిపిస్తాయి. హీరో అయ్యాం కదా అని శ్రీనివాసరెడ్డి పాత్రతో ఎగస్ట్రాలు చేయించే సాహసం చేయకపోవడం, తన పాత్రని వీలైనంత అండర్ ప్లే చేయడం ఆకట్టుకొంటాయి.
* నటీనటుల ప్రతిభ
ఈ కథకు, సినిమాకి మూలస్థంభం.. శ్రీనివాసరెడ్డి. తానేదో హీరో అయిపోయాడని ఎగస్ట్రా వేషాలేం వేయలేదు. తన పాత్ర ఎంత వరకూ చేయాలో అంత వరకే నటించాడు. శ్రీనివాసరెడ్డి అనగానే అలవాటైపోయిన కామెడీ టైమింగ్, అల్లరి అస్సలు కనిపించవు. దాంతో ఓ కొత్త శ్రీనివాసరెడ్డిని చూసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథల్ని ఎంచుకోగలిగితే... శ్రీనివాసరెడ్డిని హీరోగా(?) ఇంకొన్ని సినిమాల్లో చూడగలం. ఉన్నంతో పూర్ణ పద్దతిగా కనిపించింది. జీవా, పోసాని, ప్రవీణ్ వీళ్లంతా నవ్వించారు. `మంగళవారం` అనే డైలాగ్ ఎప్పుడు విన్నా నవ్వొస్తుంది. దాని వెనుక కాస్త `బూతు` ఉన్నా.. వినబుద్దిగా ఉంటుంది. అదంతా కృష్ణభగవాన్ కామెడీ టైమింగ్ చలవ.
* సాంకేతికంగా...
పాపం పసివాడే.. ఈ సినిమాలో మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. దాన్ని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. ఆర్.ఆర్ బలహీనంగా, సన్నివేశాల్లో డెప్త్ తగ్గించేలా ఉంది. కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. కాకినాడ అందాల్ని బాగా చూపించారు. డైలాగులు అక్కడక్కడ నవ్విస్తాయి. అయితే అందులో కాస్త బూతు వాటా ఉంది. దేశవాళీ వినోదం అని చెప్పి.. అలాంటి డైలాగులు లేకుండా ఉంటే బాగుండేది. ద్వితీయార్థంతో పోలిస్తే ప్రధమార్థం బోరింగ్ గా ఉంటుంది. వినోదానికి అక్కడ స్కోప్ లేదు. కథ మామూలుగా ఉండడం.. కథనం కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దడం మైనస్ పాయింట్లు. వినోదం, శ్రీనివాసరెడ్డి, నిజాయతీగా చేసిన ప్రయత్నం మాత్రం... ఈ సినిమాని నిలబెడతాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చివరగా : యావరేజ్ నిశ్చయమ్మురా