Read more!

English | Telugu

సినిమా పేరు:జవాన్
బ్యానర్:రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
Rating:2.75
విడుదలయిన తేది:Sep 7, 2023

సినిమా పేరు: జవాన్
తారాగణం: షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ధి డోగ్రా, సంజీత భట్టాచార్య, ప్రత్యేక పాత్రలో దీపికా పదుకొణె, అతిథి పాత్రలో సంజయ్ దత్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్: జి.కె.విష్ణు
ప్రొడక్షన్ డిజైనర్: టి. ముత్తురాజ్
ఎడిటర్: రూబెన్
రచన, దర్శకత్వం: అట్లీ
నిర్మాత: గౌరీ ఖాన్
బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2023 

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఆయన తాజా చిత్రం జవాన్ కూడా ఆ స్థాయి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉంది? షారూఖ్ కి మళ్ళీ పఠాన్ స్థాయి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఆజాద్(షారూఖ్ ఖాన్) విక్రమ్ రాథోర్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతాడు. మెట్రో ట్రైన్ హైజాక్, కేంద్ర మంత్రి కిడ్నాప్ వంటి చర్యలతో ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తాడు. ఆజాద్ ముఖ్యంగా బడా బిజినెస్ మ్యాన్ కాళీ(విజయ్ సేతుపతి)ని టార్గెట్ చేసి, అతని నుంచి వేల కోట్లను దోచి ప్రజలకు పంచి పెడతాడు. ఆజాద్ కాళీనే టార్గెట్ చేయడానికి కారణమేంటి? దానికోసం విక్రమ్ రాథోర్ పేరుని ఎందుకు వాడుకుంటున్నాడు? అసలు విక్రమ్ రాథోర్ ఎవరు? అతనికి, కాళీకి మధ్య శతృత్వం ఏంటి? ఆజాద్ ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన నర్మద(నయనతార) తర్వాత అతనికే మద్దతుగా ఎందుకు నిలిచింది? చివరికి ఆజాద్ తాను అనుకున్నది సాధించగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

సందేశాన్ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పి.. ఆలోచనను రేకెత్తించడంతో పాటు, వినోదాన్ని పంచడం దర్శకుడు శంకర్ శైలి. జవాన్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ ఇదే శైలిలో మలిచాడు. తనదైన కమర్షియల్ రూట్ లో వెళ్తూనే, ఆలోచన కలిగేలా పలు సందేశాలను ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాడు. రైతులు తీసుకున్న వేల రూపాయల లోన్ కోసం పీడించే బ్యాంకులు.. వ్యాపారవేత్తలు వేల కోట్లు ఎగ్గొట్టినా ఎలా వదిలేస్తున్నాయో ప్రశ్నించాడు. తమకి ఏదైనా జరిగితే కార్పొరేట్ హాస్పిటల్స్ కి పరుగెత్తే రాజకీయ నాయకులు.. పేదవాళ్ళు వెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో నిలదీశాడు. ఆఖరికి దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే జవాన్లకు సప్లై చేసే ఆయుధాల విషయంలో జరిగే నిర్లక్ష్యాన్ని  కూడా వేలెత్తి చూపాడు. అలాగే ఓటు విలువని తెలుపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అట్లీ టచ్ చేసిన పాయింట్లు కొత్తవి కాదు. వీటిలో చాలా వరకు మనం చూసినవే. ముఖ్యంగా సౌత్ లో ఇలాంటి పాయింట్స్ మీద పలు సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ అట్లీ తన మార్క్ కమర్షియల్ టచ్ ఇస్తూ.. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంది.

మొదటి సన్నివేశం నుంచే విజిల్స్ పడేలా చేయగలిగాడు అట్లీ. చావు బ్రతుకుల్లో ఉన్న షారూఖ్ ఖాన్(విక్రమ్ రాథోర్)ని ఆదివాసీలు కాపాడటం.. ఆ తర్వాత వారికి ఆపద వచ్చిన సమయంలో షారుఖ్ వారికి అండగా నిలబడటం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. షారుఖ్ ఇంట్రడక్షన్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అనంతరం '30 సంవత్సరాల తర్వాత' అంటూ మరో షారుఖ్ పాత్ర ఆజాద్ ని పరిచయం చేస్తూ అదే టెంపో మైంటైన్ చేశాడు దర్శకుడు. మెట్రో ట్రైన్ హైజాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంది. కాస్త ఫన్, కాస్త ఎమోషన్, కాస్త యాక్షన్ కలగలసిన ఆ ఎపిసోడ్ కట్టిపడేసింది. తీసుకున్న అప్పు కట్టలేక.. వేధింపులు, అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే రైతు సన్నివేశాలు కూడా హత్తుకునేలా ఉన్నాయి. ఆరోగ్య మంత్రిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుని ప్రశ్నించిన తీరు మెప్పించింది. ఇక ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది. మొత్తానికి ఫస్టాఫ్ అట్లీ మార్క్ కమర్షియల్ టెంప్లేట్ లో సాగుతూనే.. అక్కడక్కడా హత్తుకునే సన్నివేశాలతో ఆలోచింపచేసేలా ఉంది.

కంటెంట్ పరంగా ఫస్టాఫ్ ఇచ్చిన హై తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తగ్గినట్లు అనిపించినా.. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలతో ఆ లోటు తెలియకుండా చేయగలిగాడు అట్లీ. ఎమోషనల్ గా సాగిన దీపిక ఎపిసోడ్ ఆకట్టుకుంది. అలాగే షారూఖ్ ఖాన్(విక్రమ్ రాథోర్), కాళీ(విజయ్ సేతుపతి) మొదటిసారి మీట్ అయ్యే సన్నివేశం కట్టిపడేసింది. ఆజాద్-విక్రమ్ మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా తన పాత టీంతో కలిసి ఆజాద్ కి తోడుగా విక్రమ్ చేసే పనులు థ్రిల్ చేస్తాయి. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. యాక్షన్ ప్రియులకు కిక్ ఇస్తాయి. గెస్ట్ రోల్ లో కనిపించిన సంజయ్ దత్ సన్నివేశాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమాని ముగించిన తీరు కూడా బాగుంది. జైలు నేపథ్యంలో వచ్చే పతాక సన్నివేశాలు వావ్ అనేలా ఉన్నాయి. అయితే విజయ్ సేతుపతి పాత్రని మరింత పవర్ ఫుల్ గా మలిచి ఉంటే బాగుండేది. షారుఖ్ హీరోయిజం మరింత ఎలివేట్ అయ్యేది.

అనిరుధ్ రవిచందర్ ఎప్పటిలాగే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. పాటలు పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించాడు. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఆజాద్, విక్రమ్ రాథోర్ పాత్రల్లో షారూఖ్ ఖాన్ చక్కగా ఒదిగిపోయారు. వయసుకి తగ్గట్లుగా ఆ పాత్రల్లో ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా ప్రదర్శిస్తూ తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేశారు. ఇక ఆఫీసర్ నర్మదగా నయనతార చక్కగా రాణించింది. ఇక కాళీ పాత్రలో విజయ్ సేతుపతి విలనిజాన్ని చక్కగా ప్రదర్శించాడు. ప్రత్యేక పాత్రలో దీపికా పదుకొణె, అతిథి పాత్రలో సంజయ్ దత్ ఉన్నంతసేపు మ్యాజిక్ చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

గొప్ప కథ కాకపోవడం, ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అవ్వడం, కొన్ని సౌత్ సినిమాల ఛాయలు కనిపించడం వంటి విషయాలను పక్కన పెట్టి ఒక కమర్షియల్ సినిమాగా చూస్తే మాత్రం.. షారుఖ్ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే స్టఫ్ ఇచ్చాడు అట్లీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లో సౌత్ ఇండియన్ థాలీ టేస్ట్ చేసినట్లు ఉంటుంది. మొత్తానికి పఠాన్ స్థాయిలో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

-గంగసాని