English | Telugu

సినిమా పేరు:జ‌న‌తా గ్యారేజ్‌
బ్యానర్:మైత్రీ మూవీస్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 1, 2016

 

చిన్న సినిమాలు కంటెంట్‌ని న‌మ్ముకొని వ‌స్తున్నాయి.
పెద్ద సినిమాలు స్టార్ బ‌లాన్ని న‌మ్ముకొని త‌యార‌వుతున్నాయి.
స్టార్లు.. క‌థ‌ల్నీ కంటెంట్‌నీ న‌మ్ముకొంటే ఎలా ఉంటుందో శ్రీ‌మంతుడు రుచి చూపించింది. శ్రీ‌మంతుడు గొప్ప కథేం కాదు. కానీ.. అందులో  విలువైన కంటెంట్ ఉంది. ఊరు ఉంది. మ‌నవైన విలువ‌లున్నాయి. ఓ మంచి మాట ఉంది. జ‌న‌తా గ్యారేజ్ క‌థ‌నీ అదే సూత్రంతో అల్లుకొని ఉంటాడు కొర‌టాల శివ‌. ఇద్ద‌రు మంచి మ‌నుషులు.. ఒక‌రికి మొక్క‌లంటే ప్రాణం, ఇంకొక‌రికి మ‌నుషులంటే ప్రాణం. ఇద్ద‌రూ క‌లిస్తే ఎంత బాగుంటుందో చూపిద్దామ‌నుకొని ఉంటాడు. అందుకే.. జన‌తా గ్యారేజ్ అనే సినిమా తీశారు. ఎన్టీఆర్ హీరో అవ్వ‌డం.. శ్రీ‌మంతుడు తర‌వాత కొర‌టాల టేక‌ప్ చేసిన సినిమా కావ‌డంతో.. జ‌న‌త‌పై అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి.. దాన్ని అందుకొందా, లేదా?  ఎన్టీఆర్ హ్యాట్రిక్‌కొట్టాడా, కొర‌టాల వ‌రుస‌గా మూడో విజ‌యం సాధించాడా?  

* క‌థ‌

హైద‌రాబాద్‌లో స‌త్యం (మోహ‌న్‌లాల్‌) జ‌న‌తా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్డుని న‌డుపుతుంటాడు. త‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా స‌మ‌స్యంటూ వ‌స్తే... త‌న సైన్యంతో వెళ్లి ప‌రిష్క‌రిస్తాడు. దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు. స‌త్యం త‌మ్ముడు (రెహ‌మాన్‌)ని శ‌త్రువులు చంపేస్తారు. త‌మ్ముడి వార‌సుడు ఆనంద్ (ఎన్టీఆర్‌)ని ముంబై పంపించేస్తాడు స‌త్యం. హైద‌రాబాద్‌లో పెద‌నాన్న ఉన్నార‌ని, త‌న‌కో కుటుంబం ఉంద‌ని కూడా తెలియ‌కుండానే ముంబైలో పెరిగి పెద్ద‌వాడ‌వుతాడు ఆనంద్‌. త‌న‌కి మొక్క‌లంటే ప్రాణం. ప‌ర్యావ‌ర‌ణాన్నికాపాడుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతుంటాడు. మ‌ర‌ద‌లు బుజ్జి (స‌మంత‌) అంటే చాలా ఇష్టం. ఇద్ద‌రూ ప్రేమించుకొంటారు. మేన‌మామ (సురేష్‌) కూడా ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌నుకొంటాడు. త‌న ప్రాజెక్ట్ ప‌ని నిమిత్తం హైద‌రాబాద్ వ‌స్తాడు ఆనంద్‌. ఇక్క‌డ చిన్నా (ఉన్నిముకుంద‌న్‌)తో గొడ‌వ పెట్టుకొంటాడు. చిన్నా ఎవ‌రో కాదు.... స‌త్యం త‌న‌యుడే.  అప్పుడేమైంది?   స‌త్యం, ఆనంద్ ఎప్పుడు క‌లుసుకొన్నారు?  జ‌న‌తా గ్యారేజ్ ని ఆనంద్ ముందుండి ఎలా న‌డిపించాడు?  అనేదే మిగిలిన క‌థ‌.


ఎనాలసిస్ :

* విశ్లేష‌ణ‌

మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాల్లోనూ గొప్ప క‌థ‌లుండ‌వు. కానీ ఎమోష‌న్‌పై న‌డిచిపోయాయి. అయితే ఈ సినిమాలో క‌థా లేదు. ఎమోష‌న్ కూడా లేదు. ఓ మంచోడు.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. అది.. కొంత‌మంది పెద్ద‌ల‌కు న‌చ్చ‌దు. దాంతో.. ఆ పెద్ద‌లు, ఈ మంచోడు మ‌ధ్య పోరాటం జ‌రుగుతుంది. చివ‌రికి మంచోడే గెలుస్తాడు.. ఇదీ స్థూలంగా జ‌న‌తా గ్యారేజ్‌క‌థ‌. ఇక్క‌డ మంచోడు అంటే.. జ‌న‌తా గ్యారేజ్ అని అర్థం. ఈ గ్యారేజ్‌లో ఏడుగురు ఉంటారు. దానికి లీడ‌ర్ హీరో అనుకోవాలి. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా హీరో పాత్ర‌ని డిజైన్ చేశారు. మొక్క‌ల్ని సంరక్షించ‌డం ఓ గొప్ప బాధ్య‌త‌గా గుర్తించాల్సిన ఈ త‌రుణంలో క‌థానాయ‌కుడి పాత్ర‌ని ఇలా డిజైన్ చేసినందుకు ద‌ర్శ‌కుడ్ని అభినందించాల్సిందే. కాక‌పోతే... ఆ మొక్క‌ల‌కూ ఈ గ్యారేజ్ క‌థ‌కూ సంబంధం ఉండదు. హీరో మొక్క‌ల్ని, ప‌ర్యావ‌ర‌ణాన్నీసంర‌క్షించేవాడే కాన‌క్క‌ర్లెద్దు ఈ క‌థ‌లో. శ్రీ‌మంతుడు సినిమా ఊరి ద‌త్త‌త నేప‌థ్యంలోనే న‌డుస్తుంది. ఆ క‌థ‌కు ప్రాణం అదే. ఇక్క‌డ మాత్రం ప‌ర్యావ‌ర‌ణం అనే కాన్సెప్ట్ హీరో పాత్ర చిత్ర‌ణ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు.

ఏ క‌థ‌కైనా ఎమోష‌న్ పండ‌డం చాలా ముఖ్యం. స‌న్నివేశాల్ని న‌డిపించేది ఆ ఎమోష‌నే. కానీజ‌న‌తాలో అంత‌గా ఎమోష‌న్‌పండించే స‌న్నివేశాలేం లేవు. మోహ‌న్‌లాల్ వ‌చ్చి ఎన్టీఆర్‌ని జ‌న‌తా గ్యారేజ్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తాడు.. ఎన్టీఆర్ వెళ్లిపోతాడు. కానీ అలా ఆహ్వానించ‌డానికి బ‌ల‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటే బాగుండేది. కథేంటన్నది తొలి ప‌ది నిమిషాల్లోనే తేలిపోతుంది. ఆ త‌ర‌వాత ఏం జ‌రుగుతుందనేది ప్రేక్ష‌కుడు ఊహ‌కు అంద‌ని అద్భుత‌మేమీ కాదు,  ఏమీ లేని చోట ద‌ర్శ‌కుడు ఏదేదో చేద్దామ‌ని సీన్‌ని లాగి లాగి లాగ్ చేశాడు. నిజంగా ఏదైనా చూపిస్తాడేమో అన్న‌చోట తుస్ మ‌నిపించాడు. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులో ఉద్యోగి (రాజీవ్ క‌న‌కాల‌) కోసం చేసే ఫైటు, అక్క‌డ ప‌లికిన సంభాష‌ణ‌లే కాస్త బాగున్న‌ట్టు అనిపిస్తాయి. అలాంటి స‌న్నివేశాలు క‌నీసం అర‌డ‌జ‌ను అయినా ప‌డుండాల్సిందే. ఫ‌స్టాఫ్‌లో మోహ‌న్ లాల్ హీరో. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ హీరో. సెకండాఫ్‌లోనూ మోహ‌న్ లాల్‌కి కొన్ని సీన్లు ప‌డుంటే ఎన్టీఆర్ సైడ్ అయిపోయిన‌ట్టు అనిపిస్తుంద‌నుకొన్నారేమో, సెకండాఫ్‌లో మోహ‌న్‌లాల్‌నే సైడ్ చేసేశారు. హీరోయిన్లు ఇద్ద‌రున్నా.. దాదాపుగా ఇద్ద‌రివీ గెస్ట్ రోల్సే. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర‌మ వీక్‌. సినిమా అంతా సీరియ‌స్ గా సాగుతుంది. వినోదం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌.


* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఎన్టీఆర్ ఎప్ప‌ట్లా... క‌ష్ట‌ప‌డ్డాడు. డాన్సుల్లో, ఫైటుల్లో త‌న టాలెంట్ అంతా చూపించాడు. ఎమోష‌న్ సీన్ల ద‌గ్గ‌ర ఫుల్లుగా మార్కులు ప‌డ‌తాయి. స‌మంత‌కి దూర‌మ‌య్యేట‌ప్పుడు త‌న న‌ట‌న బాగుంది. మోహ‌న్‌లాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేమంది? ఆయ‌న త‌న పాత్ర ప‌రిధి మేర‌కు అద్భుతంగా న‌టించారు. స‌మంత‌, నిత్య‌ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ఇద్ద‌రివీ గెస్ట్ రోల్సే అనుకోవాలి. సాయికుమార్‌, బ్ర‌హ్మాజీ, అజ‌య్‌... రాణించారు. ముకుంద్ పాత్ర అంతంత మాత్ర‌మే. విల‌న్ వీక్ అయిపోవ‌డం ఈ సినిమాకి పెద్ద మైన‌స్‌.

* సాంకేతికంగా..

దేవిశ్రీ బాణీలు రొటీన్‌గానే సాగాయి. టైటిల్ సాంగ్ ఒక‌టి హుషారుగా ఉంది. పక్కా లోక‌ల్ మాస్‌కి న‌చ్చే బాణీనే. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా బాగా గ్రాండ్‌గా ఉంది. జ‌న‌తా గ్యారేజ్ సెట్ కోసం రూ.5 కోట్లు ఖ‌ర్చు పెట్టాం అన్నారు. కానీ.. అంతెందుకు అనిపించేలా ఉంది ఆ సెట్టు. కొర‌టాల శివ ర‌చ‌యిత‌గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే డైలాగుల్లో త‌న ఛ‌మ‌క్ క‌నిపించ‌లేదు. ఆ ప్ర‌భావం డైరెక్ట‌ర్ మీదా ప‌డుంటుంది. దాంతో.. ఈసారి ట్రాక్ త‌ప్పాడు.


ఎన్టీఆర్ అభిమాని అయ్యిండి.. శ్రీ‌మంతుడు హ్యాంగోవ‌ర్‌లో ఉండుండే... జ‌న‌తా గ్యారేజ్ చూడాల్సిందే. కానీ.. భారీ అంచ‌నాల‌తో వెళ్తే మాత్రం నిరాశ ప‌డ‌తారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పంచ్ లైన్‌:  జ‌న‌తా గ్యారేజ్ - ఈ క‌థ‌కే రిపేర్లు అవ‌స‌రం

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00