Read more!

English | Telugu

సినిమా పేరు:హలో మీరా
బ్యానర్:లూమియర్ సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:Apr 21, 2023

సినిమా పేరు: హలో.. మీరా..!
తారాగణం: గార్గేయి ఎల్లాప్రగడ (సింగిల్ యాక్టర్) 
డైలాగ్స్: హిరణ్మయి కల్యాణ్
లిరిక్స్: శ్రీ సాయికిరణ్
మ్యూజిక్: ఎస్. చిన్నా
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి
ఎడిటింగ్: రాంబాబు మేడికొండ
నిర్మాతలు: డాక్టర్ లక్ష్మణ్ రావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
స్టొరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసు కాకర్ల
బ్యానర్: లూమియర్ సినిమా
విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023 

హాలీవుడ్‌లో ఒకే ఒక యాక్టర్ నటించిన సినిమాలు కొన్ని వచ్చాయి. సునీల్ దత్  నటించగా 1964లో వచ్చిన 'యాదే' సినిమా భారతదేశపు మొట్టమొదటి సింగిల్ యాక్టర్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇన్నాళ్ల తర్వాత తెలుగు నుంచి మరో సింగిల్ యాక్టర్ మూవీ మన ముందుకు వచ్చింది. అది కూడా ఒక ఫిమేల్ యాక్టర్ నటించిన సినిమా. ఆ నటి పేరు గార్గేయి ఎల్లాప్రగడ కాగా, ఆ మూవీ పేరు 'హలో మీరా'. ఒకే ఒక ఫిమేల్ క్యారెక్టర్‌తో తీసిన ప్రపంచంలోనే తొలి సినిమాగా మేకర్స్ దీన్ని ప్రొమోట్ చేస్తున్నారు. బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల రూపొందించిన ఈ ప్రయోగం ఎలా ఉందంటే...

 

కథ
కల్యాణ్ అనే కొలీగ్‌తో ప్రేమలో పడి, మరో రెండు రోజుల్లో అతనిని పెళ్లాడబోతున్న మీరా అనే యువతి కథ ఈ సినిమా. కథ మొత్తం రోడ్డు మీద, మీరా కారు నడుపుతుండగా ఒక సాయంత్రం వేళ జరుగుతుంది. విజయవాడలో టైలర్ దగ్గర నుంచి పెళ్లి బట్టలు తీసుకొని కారులో ఇంటికి బయలుదేరిన మీరాకు వరుసగా వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా కథ నడుస్తుంది. వాటిలో ఒక ఫోన్ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్సై నుంచి వచ్చి మీరాను తీవ్రంగా కలవరపెడుతుంది. ఆమె మునుపటి బాయ్‌ఫ్రెండ్ సుధీర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడనీ, సూసైడ్ నోట్‌లో ఆమె పేరే అతను రాశాడనీ చెప్పిన ఎస్సై.. ఎంక్వైరీ కోసం వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు రమ్మనమని చెప్పడంతో హతాశురాలవుతుంది మీరా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె రాయదుర్గం వెళ్లిందా? సుధీర్ సూసైడ్ అటెంప్ట్ వెనుక ఉన్న నిజం ఏమిటి? మీరా పెళ్లాడబోతున్న కల్యాణ్‌కు ఆమె గతం తెలిసి ఏం చేశాడనే అంశాలను మిగతా సినిమాలో చూస్తాం.


ఎనాలసిస్ :

ఒకే ఒక పాత్రతో సినిమా నడిపించడం కత్తి మీద సాము ప్రయోగం. తెరమీద ఎప్పుడూ ఒకే ముఖం కనిపిస్తుంటే ప్రేక్షకులకు మొహం మొత్తే అవకాశాలు చాలా ఎక్కువ. వేగవంతమైన కథనమో, ఊహాతీతమైన మలుపులో ఉంటే తప్ప అంతసేపు ఒక ముఖాన్నే చూస్తూ సినిమాని ఆస్వాదించడం కష్టం. ఈ విషయం తెలుసుకాబట్టే డైరెక్టర్ శ్రీనివాసు ట్విస్టులతో సినిమాని ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మలచడానికి తీవ్రంగా కృషి చేశాడు. మీరాకు వచ్చే ఫోన్ కాల్స్ కథని నడిపిస్తాయి కాబట్టి, ఏ టైంలో ఏ కాల్ రావాలో శ్రద్ధగా ప్లాన్ చేసి, ఉత్కంఠను కలిగించే ప్రయత్నం చేశాడు. మీరా స్నేహితులు సాక్షి, కిరణ్, వరుడు కల్యాణ్, కాబోతే అత్త, మీరా తల్లితండ్రులు, తమ్ముడు రాహుల్, రాయదుర్గం ఎస్సై, లేడీ కానిస్టేబుల్, తైలర్, మీరా తండ్రికి తెలిసిన ఏసీపీ, సుధీర్ తండ్రి నర్సింగ్ యాదవ్, మీరా మరో స్నేహితురాలు పూజ.. ఇలా వీళ్ల దగ్గర్నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందర్భానుసారం మీరా వాళ్లలో కొంతమందికి చేసే ఫోన్లు, వాళ్లతో మాట్లాడుతూ మీరా పొందే భావోద్వేగాలు ఈ సినిమాలో కీలకం. చాలావరకు మీరా ఎమోషన్స్‌తో మనం కనెక్టవుతాం. ఆమె ఉద్వేగాలు, ఉద్రేకాలతో సహానుభూతి చెందుతాం. 

రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న అమ్మాయి ఒంటరిగా రాత్రివేళ హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్లాల్సి రావడంతో ఆమె స్థితికి జాలిపడతాం. ఇన్‌స్టాగ్రాం పోస్టుతో మీరాను ఇరుకున పెట్టిన సుధీర్‌పై ఆగ్రహంతో రగిలిపోతాం. తనకంటే ముందు సుధీర్ అనే యువకుడితో మీరా రిలేషన్‌షిప్‌లో ఉందని తెలిసి, సగటు మగవాడిలా ప్రవర్తించిన (మాట్లాడిన) కల్యాణ్‌ను కోపగించుకుంటాం. కాబోయే అత్త, ఆడపడుచు మీరాను మాటలతో వేధించడం చూసి ఆమెపై సానుభూతి కురిపిస్తాం. చివరలో అంతా సవ్యంగా జరిగి, మీరా ముఖంలో నవ్వు వెల్లివిరియడం చూసి మనమూ సంతోషిస్తాం. 

అయితే.. ఒక విషయం చాలా ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది. ఆడవాళ్లను ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది కారు డ్రైవ్ చేస్తున్న ఒక ఒంటరి అమ్మాయిని రాత్రివేళ విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు రమ్మనమని ఒక ఎస్సై ఫోర్స్ చెయ్యడం ఏమాత్రం సబబుగా తోచదు. సుధీర్ విషయం తెలిసి మీరాతో ఆమె మనసు గాయపడినట్లు మాట్లాడిన కల్యాణ్.. ఆ తర్వాత కొద్దిసేపటికే తనంత తాను రియలైజ్ అయ్యి, పాజిటివ్‌గా మారడమూ కృతకంగా తోస్తుంది. 

ఇలాంటి రెండు మూడు విషయాలను పక్కనపెడితే, మనకు ఇంతదాకా పరిచయంలేని ఒక కొత్తనటితో 100 నిమిషాలకు పైగా నిడివి ఉన్న సినిమా తియ్యడం, ఎంతో కొంత ఉత్కంఠతో కథను నడపడం చిన్న విషయమేమీ కాదు. అందుకు దర్శకుడిని అభినందించి తీరాలి. ఆయనకు టెక్నీషియన్స్ బాగా అండగా నిలిచారు. హిరణ్మయి కల్యాణ్ రాసిన ఫోన్ సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. ఎస్. చిన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మీరా మూడ్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ప్రశాంత్ కొప్పినీడి కెమెరా మీరా హావభావాలను బాగా క్యాప్చర్ చేసింది. రాంబాబు మేడికొండ ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. అవకాశం లభిస్తే మంచి థ్రిల్లర్స్ అందించగలడని డైరెక్టర్ టేకింగ్ తెలియజేసింది.

 

హీరోయిన్ అభినయం
తెరమీద మనకు కనిపించే ఒకే ఒక నటి గార్గేయి ఎల్లాప్రగడ తన హావభావాలతో కథకు కావాల్సిన టెంపోను ఉన్నత స్థాయిలో అందించింది. ఇదివరకు 'ఎవ్వరికీ చెప్పొద్దు' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన తను.. బిగ్గరగా నవ్వాల్సి వచ్చినప్పుడు, పెద్దగా ఏడ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే కాస్త ఇబ్బందిపడతాం. మిగతా సందర్భాల్లో.. ఆమె ఆశ్చర్యాలు, దిగ్భ్రాంతులు, ఆమె ఆందోళనలు, కంగారులు, ఆమె నిర్వేదాలు, నిర్లిప్తతలు, ఆమె బాధలు, కష్టాలు, ఆమె సంతోషాలు, నవ్వులు మనవవుతాయి. గార్గేయి మనల్ని కట్టిపడేసే సౌందర్యవతి కాదు, మన పక్కింటమ్మాయిలా అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పలికించగల చక్కని నటి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఒకే ఒక తార నటించిన సినిమా అని తేలిగ్గా తీసేయకుండా, మీరాకు ఎదురైన అనుభవాన్ని కడదాకా వీక్షిద్దాం అని నిర్ణయించుకొని కూర్చుంటే, ఒక కొత్త అనుభవాన్నీ, అనుభూతినీ సొంతం చేసుకోగలిగే సినిమా 'హలో మీరా'. అంటే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినీగోయర్స్ కోసం ఉద్దేశించిన సినిమా కాదనేది నిస్సందేహం. అలాంటివాళ్లు సినిమాకు వస్తే కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. అభిరుచి కలిగిన సీరియస్ సినీ లవర్స్ 'హలో మీరా'ను నిరభ్యంతరంగా చూసేయొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి