Read more!

English | Telugu

సినిమా పేరు:హ్యాపీ బ‌ర్త్‌డే
బ్యానర్:క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మైత్రి మూవీ మేక‌ర్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Jul 8, 2022

సినిమా పేరు: హ్యాపీ బ‌ర్త్‌డే
తారాగ‌ణం: లావ‌ణ్యా త్రిపాఠి (ద్విపాత్రాభిన‌యం), వెన్నెల కిశోర్‌, న‌రేశ్ అగ‌స్త్య‌, స‌త్యా, గుండు సుద‌ర్శ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వైవా హ‌ర్ష‌, విద్యుల్లేఖా రామ‌న్‌, గెట‌ప్ శ్రీ‌ను
సాహిత్యం: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌
సంగీతం:  కాల‌భైర‌వ‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేశ్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీ‌నివాస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: నార్ని శ్రీ‌నివాస్‌
ఫైట్స్: శంక‌ర్ ఉయ్యాల‌
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమ‌ల‌తా పెద‌మాళ్లు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రితేశ్ రాణా
బ్యాన‌ర్: క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మైత్రి మూవీ మేక‌ర్స్‌
విడుద‌ల తేదీ: 8 జూలై 2022 (థియేట‌ర్ల‌లో)

రితేశ్ రాణా డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన 'మ‌త్తు వ‌ద‌ల‌రా' మూవీ ఆడియెన్స్‌కు థ్రిల్ క‌లిగించింది. అత‌నికి న్యూ ఏజ్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు కూడా వ‌చ్చింది. ఆ ఊపుతో ఇప్పుడు రెండో సినిమా 'హ్యాపీ బ‌ర్త్‌డే'తో మ‌న ముందుకొచ్చాడు. కొంత కాలంగా కెరీర్ ప‌రంగా అస్తిత్వ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న లావ‌ణ్యా త్రిపాఠి లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు మైత్రి మూవీ మేక‌ర్స్ లాంటి బ‌డా ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స‌పోర్ట్ ల‌భించింది. ట్రైల‌ర్‌తో ఒకింత ఆస‌క్తి రేకెత్తించిన 'హ్యాపీ బ‌ర్త్‌డే' ఎలా ఉందంటే...

క‌థ‌:- ఇది అచ్చుగుద్దిన‌ట్లు ఒకేలా ఉండే క‌వ‌ల పిల్ల‌లైన హ్యాపీ (లావ‌ణ్య‌), బేబీ (లావ‌ణ్య‌) క‌థ‌. కేంద్ర మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిశోర్‌) పార్ల‌మెంట్‌లో గ‌న్ బిల్ పాస్ చేయిస్తాడు. దాంతో గ‌ల్లీ గ‌ల్లీకి గ‌న్ షాపులు వెలియ‌డంలో జ‌న‌మంతా గ‌న్‌లు కొనేసుకొని తిరుగుతుంటారు. గ‌న్ ఆకారంలో ఉండే ఓ హోట‌ల్‌లో హ్యాపీ (లావ‌ణ్య‌) బ‌ర్త్‌డేని ఏర్పాటు చేయిస్తారు బంధువులు. అక్క‌డ క‌నిపించిన ఓ సెక్యూరిటీ హెడ్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది హ్యాపీ. ఆమె మీద క‌న్నేసిన బార్ బాయ్‌.. హ్యాపీకి మ‌త్తుమందు క‌లిపిన మ‌ద్యం ఇస్తాడు. అది తాగి ప‌డిపోయిన హ్యాపీని తీసుకొని కారులో వెళ్లిపోవాల‌నుకుంటాడు. మ‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డిన హ్యాపీ, డ్రైవింగ్ సీట్లో కూర్చొని వున్న వ్య‌క్తి క‌ళ్ల‌ల్లో పెప్ప‌ర్ స్ప్రే కొడుతుంది. చూస్తే.. అత‌ను మ‌నం అదివ‌ర‌కు చూసిన బార్ బాయ్ కాదు. అదే హోట‌ల్‌లో క్లీన‌ర్‌గా చేసే ల‌క్కీ (న‌రేశ్ అగ‌స్త్య‌). బార్ బాయ్ స్థానంలో అత‌నెలా వ‌చ్చాడు? హ్యాపీ త‌న‌కెదురైన ఆప‌ద నుంచి త‌ప్పించుకుందా? రిత్విక్ సోధితో ఓ ప్రాజెక్ట్ విష‌యంలో గొడ‌వ‌ప‌డిన బేబీ జైలుకెందుకు వెళ్లింది? ట్విన్ సిస్ట‌ర్స్ ఎలా క‌లిశారు? వాళ్ల ఆప‌రేష‌న్ ఏంటి? అనే విష‌యాల‌ను మిగ‌తా క‌థ‌లో తెలుసుకుంటాం.


ఎనాలసిస్ :

'హ్యాపీ బ‌ర్త్‌డే' ఒక గ‌జిబిజి బిజిగ‌జి గంద‌ర‌గోళం సినిమా. స‌ర్రియ‌ల్ కామెడీ మూవీగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ చెప్పాడు. ఆ స‌ర్రియ‌ల్ కామెడీని ఆహ్లాద‌క‌రంగా చెబితే, చూపిస్తే.. ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. వాళ్ల‌కు ఏ విష‌య‌మైనా అర‌టిపండు ఒలిచి చెప్పిన‌ట్లు ఉంటేనే క‌థ‌లో లీన‌మ‌వుతారు. పాత్ర‌ల‌తో ప్ర‌యాణం చేసి, స‌హానుభూతి పొందుతారు. అలా కాకుండా, ఒక ప్ర‌ధాన‌ పాత్ర‌కు సంబంధించిన క‌థ‌ను న‌డిపించి, ఇంకో పాత్ర ప‌రిచ‌య‌మ‌య్యాక‌, మొద‌టి పాత్ర క‌థ‌ను వ‌దిలి, రెండో పాత్ర క‌థ‌ను చెప్పి, మూడో పాత్ర ప‌రిచ‌య‌మ‌య్యాక‌, ఆ పాత్ర క‌థేమిటో చెప్పి, నాలుగో పాత్ర వ‌చ్చాక‌, దాని క‌థ చెప్పి.. అబ్బ‌బ్బా.. ఏంటీ గోల అనుకుంటున్నారా? అలాగే ఉంది 'హ్యాపీ బ‌ర్త్‌డే' గోల‌. 

ఈ సినిమాలో ఆరు అధ్యాయాలున్నాయి. ఒక్కో అధ్యాయం ఒక్కో క్యారెక్ట‌ర్ క‌థ చెప్తుంది. అధ్యాయానికీ, అధ్యాయానికీ మ‌ధ్య అనుసంధానం ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ మ‌నం తెర‌మీద ఏం జ‌రుగుతుందో అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ, తిప్ప‌లు ప‌డుతుండ‌గానే, స‌న్నివేశాలు మారిపోతూ, కొత్త పాత్ర‌లు వ‌స్తూ, పాత పాత్ర‌ల‌తో గొడ‌వ‌లు ప‌డుతూ.. చిట్ట‌చివ‌ర‌కు తల‌బొప్పి క‌ట్టింద‌ని అర్థం చేసుకుంటాం. కొన్ని కొన్ని సీన్లు న‌వ్వు తెప్పిస్తాయి. వెన్నెల కిశోర్‌, స‌త్యా, మ‌రో రష్య‌న్ క్యారెక్ట‌ర్ మ‌ధ్య ఐదు నిమిషాల సేపు న‌డిచే సీన్ క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. దాదాపుగా స‌త్యా క‌నిపించిన‌ప్పుడ‌ల్లా మ‌నం న‌వ్వుకుంటాం. నిజానికి వెన్నెల కిశోర్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు మ‌ధ్య న‌డిచే ఓపెనింగ్ డైలాగ్ సీన్ కూడా న‌వ్విస్తుంది. 

అయితే సినిమా క‌థ‌కు నాయ‌కురాళ్ల‌యిన హ్యాపీ, బేబీ క్యారెక్ట‌ర్లే మ‌న‌కు చికాకు తెప్పించాయి. వాళ్లిద్ద‌రూ మీట్ అయ్యే సీన్ త‌ల‌నొప్పి క‌లిగించింది. హోట‌ల్ క్లీన‌ర్ ల‌క్కీ త‌న చెల్లెళ్లతో మొద‌టి సారి వీడియో కాల్ మాట్లాడిన‌ప్పుడు ఎంజాయ్ చేస్తాం. రెండోసారి మాట్లాడిన‌ప్పుడు స‌రేలే అనుకుంటాం.. ఇక ఆ త‌ర్వాత వాళ్ల మ‌ధ్య న‌డిచే వీడియో కాల్స్ సీన్లు చూసి, ఏందిరా మీ గోల అనుకుంటాం. ల‌క్కీ, గూండా (రాహుల్ రామ‌కృష్ణ‌) సీన్ల‌ను ఎంజాయ్ చేసే విధంగా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. వైవా హ‌ర్ష ఎపిసోడ్‌కూ, క‌థ‌కూ ఏమీ సంబంధం లేదు. ఆ ఎపిసోడ్‌ను తీసేస్తే, ప్రాణం కొంత హాయిగా ఉండేది. అంకుల్ ఫిక్సిట్ (గుండు సుద‌ర్శ‌న్‌), మాక్స్ పెయిన్ (స‌త్యా) మ‌ధ్య వ‌చ్చే సీన్లు అల‌రిస్తే, రిత్విక్ సోధి, ఫిక్సిట్ మ‌ధ్య వ‌చ్చే సీన్లలో రిత్విక్ ఎంత‌గా ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గుర‌వుతాడో, మ‌న‌మూ అంతే ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గుర‌వుతాం. 

సినిమా తొలి గంట ఓ మోస్త‌రుగా ఉంటే, త‌ర్వాత సినిమా అంతా ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంది. చివ‌ర‌లో వెన్నెల కిశోర్‌తో స‌త్యా సీన్ లేక‌పోతే.. ఆ కాసిన్ని న‌వ్వులూ మ‌న ముఖాల మీద నుంచి దూర‌మ‌వుతాయి. ఇలాంటి స‌ర్రియ‌ల్ కామెడీని ఎంజాయ్ చేసే స్థితికి తెలుగు ప్రేక్ష‌కులు ఇంకా ఎద‌గ‌లేదు. ఈ విష‌యాన్ని గ్ర‌హిస్తే.. ఎంతో టాలెంటెడ్ అయిన రితేశ్ రాణా నుంచి భ‌విష్య‌త్తులో ఆస్వాదించ‌ద‌గ్గ సినిమాల‌ను ఆశించ‌వ‌చ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సీన్ల‌కు ఎలివేష‌న్ ఇవ్వ‌డానికి కాల‌భైర‌వ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. పాష్ ప‌బ్‌లో లావ‌ణ్య‌పై తీసిన పార్టీ సాంగ్ అల‌రించ‌లేదు. సురేశ్ సారంగం సినిమాటోగ్ర‌ఫీ అయితే బాగుంది. కార్తీక శ్రీ‌నివాస్ ఎడిటింగ్ ఇంప్రెసివ్‌గా లేదు. అనేక స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తున్నాయ‌ని తెలుస్తున్నా వాటిపై క‌త్తెర వేయ‌లేదు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు:-

హ్యాపీ, బేబీ క్యారెక్ట‌ర్స్‌లో లావ‌ణ్యా త్రిపాఠి న‌ట‌న‌కు వంక పెట్టాల్సిన ప‌నిలేదు కానీ, బేబీ క్యారెక్ట‌ర్‌కు ఆమె చెప్పిన డ‌బ్బింగ్ బాగోలేదు. వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడిన‌ట్లుగా ఆమె డిక్ష‌న్ ఉంది. గ్లామ‌ర్ విష‌యంలో ఢోకా లేదు. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రిత్విక్ సోధిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో వెన్నెల కిశోర్ చెల‌రేగిపోయాడు. ఆయ‌న డైలాగ్ డిక్ష‌న్‌కు తిరుగులేద‌ని తెలిసిందే క‌దా. కానీ ఆయ‌న పాత్ర‌ను మ‌లిచిన తీరు కార‌ణంగా చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి దాన్ని ఆస్వాదించ‌లేం. ల‌క్కీ క్యారెక్ట‌ర్‌లో న‌రేశ్ అగ‌స్త్య మెప్పించాడు. మౌన‌వ్ర‌తం పాటించేట‌ప్పుడు అత‌ని హావ‌భావాలు మెచ్యూర్డ్‌గా ఉన్నాయి. స‌త్యా అద‌ర‌గొట్టేశాడు. ఈ సినిమాలో మ‌న‌ల్ని అల‌రించేది అత‌ను చేసిన మాక్స్ పెయిన్ క్యారెక్ట‌రే. గుండు సుద‌ర్శ‌న్‌కు చాలా కాలం త‌ర్వాత అంకుల్ ఫిక్సిట్ రూపంలో ఒక కీల‌క పాత్ర ల‌భించింది. త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయాడు. రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, గెట‌ప్ శ్రీ‌ను, రాహుల్ రామ‌కృష్ణ‌, వైవా హ‌ర్ష త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల ప‌రిధిలో న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అక్క‌డ‌క్క‌డా కొన్ని న‌వ్వులు, కొన్ని చ‌మ‌క్క‌లు మిన‌హాయిస్తే.. ఎక్కువ భాగం మ‌న‌కు చికాకు క‌లిగిచే సినిమా 'హ్యాపీ బ‌ర్త్‌డే'. ఈ స‌ర్రియ‌ల్ కామెడీని రియ‌ల్‌గా ఎంజాయ్ చేయ‌డం క‌ష్టం. గంద‌ర‌గోళంగా ఉండే క‌థ‌నం కార‌ణంగా రెండున్న‌ర గంట‌ల సినిమాని అర్థం చేసుకోవ‌డానికి మ‌న టైమ్ స‌రిపోతుంది.. ఇక ఎంజాయ్ చేసేదెప్పుడు?!

- బుధ్ది య‌జ్ఞ‌మూర్తి