Read more!

English | Telugu

సినిమా పేరు:గోపి గోపిక గోదావరి
బ్యానర్:మహర్షి సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:Jul 10, 2009
గోపిక(కమలినీ ముఖర్జీ)"ఫార్ కార్నర్స్"అనే మొబైల్‍ బోట్‍ హాస్పిటల్లో సేవాదృక్పధంతో పనిచేస్తున్న ఒక డాక్టర్‌‍‍. హైదరాబాద్‌లో ఉన్న ఆమె స్నేహితురాలు ఉమ మొబైల్ ఫోన్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తదు. కారణం ఆమే ఆ ఫోన్‌ని ఒక యస్.టి.డి.బూత్‌లో మరచిపోతుంది. అనుకోకుండా గోపి అనే గాయకుడు అనుకోకుండా ఆ ఫోన్‌ని ఎత్తుతాడు. గోపిక అది తన స్నేహితురాలేననుకుని తిడుతుంది. కాదని తెలుసుకుని గోపికి సారీ చెపుతుంది. గోపిక స్నేహితురాలికి ఆమె ఫోన్ తిరిగివ్వటానికి గోపీ ఆమె ఇంటికి వెళతాడు. కానీ అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అది తెలుసుకున్న గోపి అక్కడే దగ్గరుండి ఆమెకు జరుగవలసిన కార్యక్రమాలన్నీ ఆమె తండ్రి(ధమ్)చేత జరిపించి వెళతాడు. అక్కణ్ణించీ గోపీకి, గోపికకూ ఫోన్‌లో స్నేహం బలపడుతుంది. ఎంతగా అంటే ఒరేయ్ రేలంగీ అని గోపిక అంటే ఒసేయ్ సూర్యాకాంతం అని గోపీ పిలిచే వరకూ. ఇద్దరూ కలుద్దామనుకుంటే అనుకోకుండా మిస్సవుతారు. అయినా ఒకరికి ఒకరు కొరియర్‌లో బహుమతులు పంపుకుంటూ ఉంటారు.. కానీ గోపిక గోపిని ప్రేమిస్తుంటూంది. హైదరాబాద్‌లో గోపీ ఆర్కెస్ట్రా మేనేజర్ రమణ(కృష్ణ భగవాన్)కి ఆస్తి రావాలంటే ఆడపిల్లను కనాలని క్లాజుంటుంది. దానికోసం అతను అబద్దాల వ్రతం చేస్తుంటాడు. ఒకసారి గోపిక ఫోన్ చేస్తే దాన్ని ఎత్తిన రమణ "గోపీకి పెళ్ళయిందనీ, అతనికి పిల్లలు కూడా ఉన్నారనీ" తన నోటికి వచ్చిన అబద్ధాలన్నీ గోపికతో చెపుతాడు. అవన్నీ నిజమని నమ్మిన గోపిక గోపితో మాట్లాడదు. అతను ఫోన్ చేస్తే కట్ చేస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న గోపి తల్లి (గీతాంజలి) గోపీ ఎలాంటివాడో గోపికకు చెపుతుంది. దాంతో మళ్ళీ వీళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుంది. గోపికకు ఒక పెద్ద మనిషి(జీవా)ఒక డాక్టర్ సంబంధం తెస్తాడు. ఆ సంబంధం చేయాలని గోపిక తల్లి(జయలలిత)కి ఉంటుంది. కానీ గోపిక గోపీని ప్రేమిస్తుందని తెలియటంతో ముందు వొప్పుకోకపోయినా, కూతురి మాటలకు కరిగి తాను గోపీని చూసి మాట్లాడాలంటుంది. గోపీ కూడా గోపిక వాళ్ళింటికి బయలుదేరతాడు. కానీ కొందరు దుండగులు ఎవరినో చంపబోతుంటే అడ్డుపడటం వల్ల వాళ్ళు గోపిని కొట్టి గోదావరిలో పడేస్తారు. అతన్ని గోపిక కాపాడి తన మోబైల్‍ హాస్పిటల్లోనే చికిత్సచేస్తుంది. తన తలపై బలమైన దెబ్బ తగలటం వల్ల గోపీ తానెవరో మర్చిపోతాడు. అతనికి ప్రభు అని పేరు పెట్టి అక్కడే ఉంచి ట్రీట్‍మెంట్ చేస్తుంటుంది గోపిక. ఇంతలో గోపీ చనిపోయాడన్న సమాచారం గోపికకు తెలుస్తుంది. దాంతో ప్రభుగా ఉన్న గోపీ బలవంతం మీద గోపిక డాక్టర్ని పెళ్ళిచేసుకోటానికి అంగీకరిస్తుంది. ఆ పెళ్ళి తన చేతుల మీదుగానే చేయిస్తున్న ప్రభు ఉరఫ్ ‍గోపీకి మళ్ళీ తల మీద దెబ్బ తగలటంతో పూర్వ స్మృతి వస్తుంది. స్ఫూ ర్తిగా ప్రేమించిన గోపిక పెళ్ళి తనే చేస్తూండటం తెలుసుకున్న గోపీ ఏం చేశాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకుడిగా వంశీ గురించి ఈ రోజున కొత్తగా చెప్పాల్సింది ఏముంది...? ఆయన గత చిత్రాలే ఆయనేంటో ఆయన దర్శకత్వ పటిమ ఏంటో ప్రేక్షకులకు చెప్పాయి. కథలో కొద్దిగా పాత వాసనలు కనిపించినా, వంశీ బ్రాండ్ వల్ల అవి మనల్ని పెద్దగా ఇబ్బందిపెట్టవు. ఆయన గోదావరి సమీపంలో తీసిన ఈ చిత్రంలోని బ్లాకులూ, ఫ్రేమ్ లూ ఈ సినిమాని ఒక దృశ్యకావ్యంలా మలచాయి. కాకపోతే క్లైమాక్స్ బాగుండి ఉంటే ఈ చిత్రం ఇంకొంచెం బాగుండేదేమోననిపించింది. నటన -: వేణు తన పాత్రలో యధాశక్తి తన శక్తివంచన లేకుండా నటించాడు. కమలినీ ముఖర్జీ ముఖంలో గ్లామర్ బాగా దెబ్బతింది. ఎడుపు సీన్లలో అయితే ఆమె ముఖం మరి చూడలేని విధంగా ఉంది. అయినా ఆమె బాగానే నటించింది. కృష్ణ భగవాన్, కొండవలసల కామెడి బాగుంది. కృష్ణేశ్వరరావు కామెడి కూడా బాగానే పండింది. జయలలిత, సన ఈ చిత్రంలో లేకున్నా కూడా మనకు పెద్ద తేడా కనిపించదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం -: ఈ చిత్రం సంగీతంలో వంశీ ప్రేరణ వల్ల ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడేమోననిపిస్తుంది. మాములుగా చక్రి అందించే సంగీతానికీ, ఈ చిత్రంలో చక్రి అందించిన సంగీతానికి సహస్రం తేడా ఉంది. చక్రి ఈ చిత్రానికి చాలా చక్కని సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా బాగున్నా కూడా ముఖ్యంగా "నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల" అనే పాట, "గోగో గోగో రైరై గోదావరిపై" అనే పాటలు చాలా బాగున్నాయి. ఈ పాటలు ప్రేక్షకుల నోళ్ళల్లో నానతాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంది. పాటలు -: అన్ని పాటలూ సాహిత్య పరంగా చాలా బాగున్నాయి. మాటలు -: ఈ చిత్రంలోని మాటల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసే పంచ్ డైలాగులు చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలోని మాటలు బాగున్నాయి. కెమెరా -: మామూలుగా వంశీగారి సినిమాల్లో కెమెరా కూడా ఒక పాత్ర పోషిస్తుందనే మాట ఈ చిత్రంలో కూడా నిరూపించబడింది. కెమెరా వర్క్ ఈ చిత్రంలో బాగుంది. గోదావరి అందాలు కనువిందుచేశాయి. ఎడిటింగ్ -: బాగుంది ఆర్ట్ -: గోపిక ఇంటి సెట్టూ, బోట్ హాస్పిటల్ సెట్టూ బాగున్నాయి. ఈ చిత్రాన్ని పెద్ద పెద్ద అంచనాలు లేకుండా,వంశీ మార్క్ సినిమాలా చూడాలనుకుంటే సకుటుంబంగా సంతోషంగా చూడండి.