Read more!

English | Telugu

సినిమా పేరు:జిన్నా
బ్యానర్:అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
Rating:2.50
విడుదలయిన తేది:Oct 21, 2022

సినిమా పేరు: జిన్నా
తారాగణం: విష్ణు మంచు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణ, రఘు బాబు, నరేష్, సత్యం రాజేష్, సద్దాం, నరేష్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
నిర్మాత: మంచు విష్ణు
రచన: కోన వెంకట్
దర్శకత్వం: సూర్య 
బ్యానర్స్: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ 
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022


మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన మంచు విష్ణు హీరోగా ఇప్పటిదాకా 20కి పైగా సినిమాల్లో నటించాడు. కానీ అందులో ఐదు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. విష్ణు కెరీర్ లో 'ఢీ' సినిమానే పెద్ద హిట్. ఆ తర్వాత 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి సినిమాలతో అడపాదడపా విజయాలను అందుకున్నాడు. అయితే విష్ణు కెరీర్ లో హిట్ అయిన సినిమాలన్నీ యాక్షన్ కామెడీ సినిమాలే కావడం విశేషం. మధ్యలో విభిన్న జోనర్స్ ప్రయత్నించినా అవేవీ తనకి విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే తనకు అచ్చొచ్చిన యాక్షన్ కామెడీనే నమ్ముకుతున్నాడు విష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం 'జిన్నా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విష్ణు కెరీర్ లో మరో 'ఢీ' అవుతుంది అని మూవీ బలంగా నమ్ముతుంది. మరి వారి నమ్మకం నిజమై విష్ణు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
జి.నాగేశ్వరరావు అలియాస్ జిన్నా(విష్ణు) అప్పు చేసి మరీ ఊరిలో టెంట్ హౌస్ బిజినెస్ పెడతాడు. ఓ వైపు చేసిన అప్పుకి వడ్డీ పెరుగుతుంటే.. మరోవైపు టెంట్ హౌస్ బిజినెస్ మాత్రం అంతంతమాత్రంగా నడుస్తుంటుంది. అతను ఏదైనా పెళ్లికి టెంట్ వేస్తే ఆ పెళ్లే ఆగిపోతుంది. దీంతో ఊళ్ళో వాళ్ళు అసలు అతన్ని శుభకార్యాలకు పిలవకూడదని నిర్ణయించుకుంటారు. దీనికితోడు అతని తండ్రి బతికున్నప్పుడు 15 ఏళ్ళ పాటు ఆ ఊరికి సర్పంచ్ గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో తాను కూడా ఒక్కసారైనా ఆ ఊరికి సర్పంచ్ కావాలి అనుకున్నాడు జిన్నా. కానీ ఆ ఊరి సర్పంచ్ అయిన అతని బాబాయ్(రఘుబాబు) జిన్నాని తప్పించి మళ్ళీ తానే సర్పంచ్ కావాలని కుట్రలు చేస్తుంటాడు. అప్పులు తీరిపోయి తన జీవితం సాఫీగా సాగిపోవాలన్నా, డబ్బులు పంచి సర్పంచ్ గా గెలవాలన్నా తనకి కనీసం కోటి రూపాయలు కావాలి. అంత డబ్బు ఎలా సంపాదించాలని ఆందోళన పడుతున్న సమయంలో.. తన చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్) జిన్నాని పెళ్లి చేసుకోవడం కోసం అమెరికా నుంచి వస్తుంది. దీంతో తన కష్టాలు తీర్చే లక్ష్మీదేవి రేణుకనే అని భావిస్తాడు జిన్నా. అసలు తాను ప్రేమించిన స్వాతి(పాయల్ రాజ్ పుత్)ని కాదని రేణుకతో జిన్నా ఎందుకు పెళ్లి సిద్ధమయ్యాడు? జిన్నాని పెళ్లి చేసుకోవడం కోసం రేణుక అంతదూరం నుంచి వెతుక్కుంటూ రావడానికి కారణమేంటి? రేణుక రాకతో తన కష్టాలు తీరిపోతున్నాయి అనుకున్న జిన్నాకు వచ్చిన ఊహించని కష్టాలేంటి? చివరికి తాను అనుకున్నది సాధించగలిగాడా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

జిన్నా సినిమా కథా కథనాల్లో కొత్తదనం ఏం కనిపించదు. కథ పాతదే, కథనం కూడా మన ఊహకి అందేలాగే సాగుతుంది. చాలా వరకు సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే నడుస్తుంది. హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా ఫస్టాఫ్ ప్రారంభమవుతుంది. అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు కొంతమేర నవ్విస్తాయి.. కానీ ఫస్టాఫ్ లో ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. ఇక ముందు నుంచి మూవీ టీమ్ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి షాక్ అవుతారు, షేక్ అవుతారు అని చెప్పింది. ఆ ట్విస్ట్ బాగానే ఉంటుంది కానీ.. మరీ ఊహించనిది, ఓ రేంజ్ లో సర్ ప్రైజ్ అయ్యే అంత ట్విస్ట్ అయితే కాదు. నిజానికి ఆ ట్విస్ట్ కోసమే ఫస్టాఫ్ అంతా నడిపించినట్టు ఉంటుంది.

ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ కాస్త మెరుగ్గా ఉంటుంది. సెకండాఫ్ లో కామెడీ డోస్ కాస్త పెరుగుతుంది. ముఖ్యంగా సన్నీ లియోన్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని కొన్ని సన్నివేశాల్లో చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ ల కామెడీ బాగానే వర్కౌట్ అయింది. కానీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాలంటే ఇది సరిపోదు. ప్రస్తుతం ఈ ఓటీటీ యుగంలో ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన కంటెంట్ ఇంట్లోనే చూసే వీలు ఉంది. పైగా షోలు, సిరీస్ లతో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇలాంటి సమయంలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాలంటే కంటెంట్ అయినా కొత్తగా ఉండాలి లేదా కామెడీ అయినా ఓ రేంజ్ లో ఉండాలి. 'జిన్నా' కామెడీ పరంగా పాస్ మార్కులు వేయించుకున్నప్పటికీ.. కంటెంట్ పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో మాస్ ని అలరించే అంశాలు బాగానే ఉన్నాయి. కామెడీతో పాటు ఫైట్స్ ఉన్నాయి. దానికితోడు సన్నీలియోన్ అందాల విందు ప్రత్యేక ఆకర్షణ. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకి కొంత ఆదరణ లభించే అవకాశముంది.

దర్శకుడిగా ఇది సూర్యకి మొదటి సినిమా అయినప్పటికీ బడా టెక్నీషియన్స్ తోడవ్వడంతో ఇది అతని మొదటి సినిమా అనే భావన మనకి కలగదు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరావు మూల కథ అందించగా, కోన వెంకట్ స్క్రిప్ట్ డెవలప్ చేశారు. మూల కథ ఎలా ఉన్నా ఆసక్తికరమైన కథనం, సన్నివేశాలతో సినిమాని అంతో ఇంతో ఆకట్టుకునేలా మలచవచ్చు. కానీ ఆ విషయంలో కోన వెంకట్ సీనియారిటీ అంతగా పని చేయలేదు. ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కోన స్క్రిప్ట్ ని ఆసక్తిగా మలచలేకపోయారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం కూడా పెద్దగా ప్లస్ అవ్వలేదు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నప్పటికీ, పాటలు అలరించేలా లేవు. పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నాయన్న ఫీలింగ్ కలుగుతుంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆయన కెమెరా పనితనం బాగా కనిపిస్తుంది.

నటీనటుల పనితీరు:

జిన్నా పాత్రలో మంచు విష్ణు తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డ్యాన్స్ లు, ఫైట్స్ తో అదరగొట్టాడు. తన కష్టం మనకు తెర మీద కనిపిస్తుంది. అయితే 'ఢీ', 'దేనికైనా రెడీ' స్థాయిలో తన కామెడీ టైమింగ్ ని పూర్తిస్థాయిలో బయటపెట్టే అవకాశం ఈ సినిమాలో రాలేదనే చెప్పాలి. ఈ సినిమాలో సన్నీలియోన్ ఓ సర్ ప్రైజ్ అనుకోవాలి. నిజానికి ఈ సినిమాలో ఆమెదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే, మరోవైపు అభినయంతో ఆకట్టుకుంది. మూగ, చెవిటి పాత్రలో తన హావభావాలు బాగున్నాయి. అదే సమయంలో తన పాత్రలోని మరో కోణాన్ని చక్కగా ప్రదర్శించింది. ఇందులో పాయల్ రాజ్ పుత్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. పాట, కొన్ని సన్నివేశాలతో సరిపెట్టుకుంది. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఉన్నంతలో బాగానే నవ్వించారు. సెకండాఫ్ లో వాళ్ళ కామెడీనే బిగ్ రిలీఫ్. అన్నపూర్ణ, రఘు బాబు, నరేష్, సత్యం రాజేష్, సద్దామ్ పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'ఢీ', 'దేనికైనా రెడీ' స్థాయిలో కామెడీ ఉంటుందని ఆశించి 'జిన్నా'కి వెళ్తే నిరాశచెందక తప్పదు. అక్కడక్కడా నవ్వించే ఈ చిత్రాన్ని సరదాగా ఒక్కసారి చూసేయొచ్చు. 

 

-గంగసాని