Read more!

English | Telugu

సినిమా పేరు:ఫస్ట్ డే ఫస్ట్ షో
బ్యానర్:శ్రీజ ఎంటర్టైన్మెంట్, మిత్ర వింద మూవీస్
Rating:2.00
విడుదలయిన తేది:Sep 2, 2022

సినిమా పేరు: ఫస్ట్ డే ఫస్ట్ షో
తారాగ‌ణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట, వంశీధర్ తదితరులు
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్ర‌ఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్: గుళ్ళపల్లి మాధవ్
నిర్మాత: శ్రీజ ఏడిద
రచన: కేవీ అనుదీప్ 
ద‌ర్శ‌క‌త్వం: వంశీధర్, లక్ష్మీనారాయణ
బ్యాన‌ర్స్: శ్రీజ ఎంటర్టైన్మెంట్, మిత్ర వింద మూవీస్
విడుద‌ల తేదీ: సెప్టెంబర్ 2, 2022


'జాతి రత్నాలు'తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ కేవీ అనుదీప్ స్టోరీ అందించిన సినిమా కావడంతో కామెడీ ప్రియుల్లో 'ఫస్ట్ డే ఫస్ట్ షో'పై ఆసక్తి ఏర్పడింది. పైగా అప్పట్లో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'స్వాతిముత్యం', 'సాగర సంగమం', 'శంకరాభరణం' వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రంతో నిర్మాతగా మారడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ క్లాసిక్ హిట్ 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల గురించి కావడం అదనపు ఆకర్షణగా నిలిచింది. మరి ఇన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
అప్పట్లో 1998-2001 ప్రాంతంలో యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయేవాళ్లు. నారాయణఖేడ్ కి చెందిన స్కూల్ హెడ్ మాస్టర్ ధర్మరాజు(తనికెళ్ళ భరణి) కొడుకు శ్రీను(శ్రీకాంత్ రెడ్డి) కూడా పవన్ కి వీరాభిమాని. పవన్ సినిమా వస్తే చాలు ఎలాగోలాగ టికెట్ సాధించి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాడు. అలాగే 'ఖుషి' సినిమా విడుదలకి వారం, పది రోజుల ముందు నుంచే టికెట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. అయితే రిలీజ్ కి ఇంకా రెండు రోజులే ఉందన్న టైంలో అతను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడుతున్న లయ(సంచిత బసు) తనని కూడా 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్లమని అడుగుతుంది. దీంతో టికెట్స్ ఎలాగైనా సాధించి, ఆమెకు తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు శ్రీను. కానీ టికెట్స్ ఎంత ప్రయత్నించినా దొరకవు. చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతుంటాయి. 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం శ్రీను ఏమేం చేశాడు? అతనికి టికెట్స్ దొరికాయా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

ఈ సినిమా స్టోరీ లైన్ చాలా చిన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లేని సమయంలో ఒక యువకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ సాధించడానికి ఏం చేశాడు అనేదే కథ. ఈ చిన్న పాయింట్ తో రెండు గంటల పాటు సినిమా నడిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. నిజానికి 'జాతి రత్నాలు'లో కూడా కథేం లేదు. కానీ తనదైన కామెడీతో లాగించి హిట్ కొట్టాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. ఈ మూవీకి అనుదీప్ డైరెక్టర్ కాకపోయినప్పటికీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే అందించడంతో మరోసారి తన కామెడీతో మ్యాజిక్ చేస్తాడేమో అని భావించారంతా. కానీ ఈసారి ఆయన కామెడీ మిస్ ఫైర్ అయింది.

కేవలం 'జాతి రత్నాలు' హిట్ అయిందని బ్లైండ్ గా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. కథనం, సన్నివేశాలు, సంభాషణల విషయంలో ఏ మాత్రం శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించదు. 'జాతి రత్నాలు'లో కామెడీ ఆ టైంలో కాస్త కొత్తగా అనిపించి ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. అయితే ప్రతిసారి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందనే భ్రమలో ఉంటే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' లాంటి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. దాదాపు రెండు గంటల నిడివి గల ఈ సినిమాలో ఏదో ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా పెద్దగా నవ్వురాదు. పైగా పలు సన్నివేశాల్లో నవ్వాల్సింది పోయి ఇది కామెడీనా అనే అసహనం కలుగుతుంది.

ఎన్నో ఆల్ టైం క్లాసిక్ హిట్స్ ని అందించిన పూర్ణోదయ వంటి సంస్థ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. రధన్ సంగీతం పర్వాలేదు. సాంగ్స్ వింటున్నప్పుడు బానే ఉన్నాయి కానీ గుర్తు పెట్టుకునేలా లేవు. సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి పెద్దగా పని కల్పించలేదు. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్ర‌ఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా థియేటర్ సన్నివేశాలు చక్కగా కాప్చర్ చేశాడు. కథనం, సన్నివేశాల్లో బలం లేకపోవడం, నిడివి కూడా తక్కువే కావడంతో గుళ్ళపల్లి మాధవ్ కూడా కూర్పుతో పెద్దగా మ్యాజిక్ చేయలేని పరిస్థితి.

నటీనటుల పనితీరు:
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీను పాత్రలో శ్రీకాంత్ రెడ్డి బాగానే రాణించాడు. సినిమా అంతా ఎక్కువగా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మూవీ టికెట్లు చేతికి చిక్కినట్లు చిక్కి మిస్ అయ్యే టైంలో అతని ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంచిత బసు పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసింది. ఈమధ్య కాలంలో వచ్చిన పాత్రలతో పోల్చితే వెన్నెల కిషోర్ ఇందులో కాస్త కొత్త పాత్రలో కనిపించాడు. ఉన్నంతలో అంతో ఇంతో నవ్వించాడు. తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట, వంశీధర్ తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'జాతిరత్నాలు' చూసి కడుపుబ్బా నవ్వుకున్నాం. ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ అందించిన స్క్రిప్ట్ కాబట్టి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసి కూడా ఆ స్థాయిలోనే నవ్వుకుంటాం అనే అంచనాలతో వెళ్తే దారుణంగా నిరాశ చెందక తప్పదు.

-గంగసాని