Read more!

English | Telugu

సినిమా పేరు:దూకుడు
బ్యానర్:14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్
Rating:3.00
విడుదలయిన తేది:Sep 23, 2011

కథ - శంకరనారాయణ (ప్రకాష్ రాజ్) ప్రజల మనిషి. అతను మల్లేశ్ గౌడ్ (కోట శ్రీనివాసరావు) చేసే అరాచకాలను ఆపాలని వార్నింగ్ ఇస్తాడు. అందుకని ముంబాయిలో ఉన్న మాఫియా డాన్ నాయక్ (సోనూ సూద్) తో కలసి శంకరనారాయణ మీద హత్యాయత్నం చేస్తాడు మల్లేశ్ గౌడ్. కానీ ఆ హత్యాప్రయత్నంలో శంకరనారాయణ చావడు. కోమాలోకి వెళతాడు. ఆ శంకరనారాయణ కొడుకు అజయ్ కుమార్ (మహేష్ బాబు) ఐ.పి.యస్.అవుతాడు. అతని క్రిమినల్స్ వేటలో నాయక్ తమ్ముడు ఎదురవుతాడు. కోమాలో ఉన్న శంకరనారాయణ కోమానుంచి బయటకొస్తాడు. అప్పుడు తన తండ్రికి తెలియకుండానే తన తండ్రి కోమాలోకి వెళ్ళటానికి కారణమైన వారందర్నీ అజయ్ ఎలా తన తండ్రితో చంపించాడనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - దర్శకుడిగా శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అతనెలాంటి దర్శకుడో అతని గత చిత్రాలే చెపుతాయి. ఇక ప్రిన్స్ మహేష్ బాబుని అతనీ చిత్రంలో ఎలా డీల్ చేశాడన్నది ముఖ్యం. ఆ విషయంలో కూడా శ్రీను వైట్ల విజయం సాధించాడని చెప్పాలి. మహేష్ బాబుని ఈ సినిమాలో శ్రీనువైట్ల చూపించిన తీరు బాగుంది. అలాగే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, యాక్షన్, లైట్ గా ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ సినిమాలో చూపించిన తీరు బాగుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాగుండటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. పైగా వాట్ నెక్స్ట్ అనిపిస్తుంటుంది. మహేష్ బాబుకి తగిన విధంగా కథని గోపీ మోహన్ మలచిన తీరు బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఈ సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి పైసా కూడా స్క్రీన్ మీద కనపడుతుంది.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

నటన - ఒక టి.వి.ఇంటర్ వ్యూలో రామ్ చరణ్ అన్నట్లు హీరో మహేష్ బాబు ఏం తింటాడో కానీ ఈ సినిమాలో గతంలో కంటే మరింత గ్లామర్ గా కనిపిస్తాడు. ఇక మహేష్ బాబు నటనలో మరింత పరిణితి కనిపిస్తుంది. తండ్రితో సెంటిమెంట్ సీన్లలో మహేష్ బాబు నటన మరింత ఆకట్టుకుంటుంది. యాక్షన్, కామెడీ సీన్లలో కూడా మహేష్ బాబు చాలా బాగా నటించాడని చెప్పటం చర్విత చర్వణమే అవుతుంది. హీరోయిన్ సమంత నటన బాగుంది. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, కాట్రాజు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది బ్రహ్మానందం, యమ్.యస్.నారాయణల కామెడీ గురించి. బ్రహ్మానందంతో మహేష్ బాబు రియాలిటీ షో ఎపిసోడ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే హీరో కావటానికి యమ్.యస్.నారాయణ తాపత్రయం కూడా మనకు చక్కని హాస్యాన్ని అందిస్తుంది.

సంగీతం - ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగానే ఉన్నా..."చుళ్ బుళి", "గురువారం", పెళ్ళి పాటలు జనానికి బాగా గుర్తుండి పోతాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.

కెమెరా - గుహన్ కెమెరా వర్క్ బాగుంది. ఈ సినిమాలో ఏది గ్రీన్ మ్యాట్ షాటో, ఏది ఒరిజినల్ షాటో చెప్పటం కాస్త కష్టమవుతుంది. సినిమాని నయనానందకరంగా మలచిన కెమెరా మేన్ గుహన్ని అభినందించాలి.

పాటలు - ఈ చిత్రంలో పాటల్లో సాహిత్యం అత్యద్భుతంగా లేకపోయినా, అంక ఛండాలంగా మాత్రం లేదు..అంటే పాటల్లో ద్వందర్థాలు, అశ్లీల పదాలు లేవు.

మాటలు - కోన వెంకట్ మాటలు బాగున్నాయి. "కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు", "మైండ్ లో కమిటయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా", "భయమంటే తెలియని బ్లడ్ రా నాది" వంటి డైలాగులు మహేష్ బాబు అభిమానులను అలరిస్తాయి. ఈ సినిమాలోని మాటలు "పోకిరి" చిత్రంలోని డైలాగులను తలపిస్తాయి.

ఎడిటింగ్ - యమ్.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమాలోని ఏ ఒక్క ఫ్రేమ్ కూడా అనవసరమైంది లేకుండా జాగ్రత్తపడ్డాడు.

ఆర్ట్ - పాటల్లో, సెట్స్ వేయటంలో ఆర్ట్ పనితనం బాగుంది.

కొరియోగ్రఫీ - మహేష్ బాబుతో ఈ చిత్రంలో కొత్తరకం స్టెప్స్ వేయించారు. మొత్తానికి అన్ని పాటల్లోనూ వేరియేషన్ ఉండేలా బాగా కొరియోగ్రఫీ చేశారు.

యాక్షన్ - ఫైట్ మాస్టర్లు విజయ్, పీటర్ హెయిన్స్ ఈ చిత్రంలో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఏ హాలీవుడ్ చిత్రానికీ తీసిపోకుండా ఉన్నాయి.

మీకు సకుటుంబ సమేతంగా హాయిగా, మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఓ పదహారు రీళ్ళ సినిమా ఓ రెండున్నర గంటలపాటు చూసి ఆనందించాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.