Read more!

English | Telugu

సినిమా పేరు:దోచేయ్ మూవీ
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Apr 24, 2015

అతిగా ఆవేశ‌ప‌డే ఆడ‌ది, అతిగా ఆశ‌ప‌డే ఆడ‌ది బాగుప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు... అని ర‌జ‌నీకాంత్ చెప్పినా... మ‌నం అతిగా అంచ‌నాలేసుకొని థియేట‌ర్ కి వెళ్తాం. అది మ‌నదే త‌ప్పు. అది తెలిసినా... అంచ‌నాలు ఊరుకోవు. స్వామి రారా చూసి.. సుధీర్ వ‌ర్మ కేక‌.. సూప‌రో సూప‌ర్ అనుకొన్నాం. ఆ త‌రువాత సినిమా కూడా ఇర‌గ‌దీస్తాడ‌ని ఆశ‌ప‌డ్డం త‌ప్పేం కాదు. అందుకే దోచేయ్ సినిమాపై కొన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ దాన్ని నిల‌బెట్టుకొనేందుకు సుధీర్ వ‌ర్మ హోం వ‌ర్క్ చేయాల్సింది. కానీ.. అవేం చేయ‌కుండానే రంగంలోకి దిగిపోయాడు. ఓ స్టార్ కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో, ఎంత కావాలంటే అంత పెట్టుబ‌డి పెట్టే నిర్మాత చేతిలో ఉన్నార‌న్న ధీమాతో రెండో సినిమా మొద‌లెట్టేశాడు. అక్క‌డే సుధీర్ వ‌ర్మ `క్రైమ్‌`లో కాలేశాడు. స్వామి రారాకి చేసిన హోం వ‌ర్క్‌, హార్డ్ వ‌ర్క్ దోచేయ్‌లో మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. దాంతో... ప్రేక్ష‌కుల టైమ్‌, వాళ్ల టికెట్టు డ‌బ్బులు దోచేయ్ డానికి త‌ప్ప.. ఆ టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ దొర‌క‌లేదు. ఇంకాస్త డిటైల్స్‌లోకి వెళ్లాలంటే క‌థేంటో తెలుసుకోవాల్సిందే.

క‌థ‌:

చేయ‌ని నేరానికి సీతారామ్ (రావు ర‌మేష్‌) జైలుపాలై యావ‌జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటాడు. సీతారామ్ కొడుకు... చందు(నాగ చైతన్య).   "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు అనే మాట న‌మ్ముతాడు. అందుకే.. చెల్లాయిని మెడిసెస్ చ‌దివించ‌డం కోసం మోస‌గాడిగా మార‌తాడు.  చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. మాణిక్యం (పోసాని) త‌న ముఠాతో బ్యాంకుల్ని లూఠీ చేయిస్తుంటాడు. ఓ బ్యాంక్‌లో రెండు కోట్లు ఎత్తేసిన ముఠా స‌భ్యులు ఒక‌రిని కాల్చుకొని మ‌రొక‌రు చ‌నిపోతారు. ఆ డ‌బ్బు అనూహ్యంగా చందుకి దొరుకుతుంది. ఆ డ‌బ్బుతో త‌న తండ్రిని జైలు నుంచి విడిపించుకొందామ‌నుకొంటాడు చందు. అయితే ఈ డ‌బ్బు కో్సం మాణిక్యం, ఆ ఏరియా సీఐ రిచ‌ర్డ్ (ర‌విబాబు) వెంట‌ప‌డ‌తారు. ఆ డ‌బ్బుని చందూ ఎలా కాపాడుకొన్నాడు. త‌న తండ్రిని జైలు నుంచి ఎలా విడిపించుకొన్నాడు?  అస‌లు సీతారామ్ జైలులో ఉండ‌డానికి కార‌ణం ఏమిటి?  అనేదే చిత్ర క‌థ‌.


ఎనాలసిస్ :

క్రైమ్ కామెడీ జోన‌ర్లో వ‌చ్చిన ఏ నాలుగు సినిమాలు చూసినా... అందులో మూడు క‌థ‌లు అచ్చం ఇలానే ఉంటాయ్‌. అలాంటి రొటీన్ క‌థ‌నే మొహ‌మాటం లేకుండా మ‌ళ్లీ రాసుకొన్నాడు సుధీర్ వ‌ర్మ‌. అనుకోకుండా హీరోకి నిధి లాంటిది దొర‌క‌డం... ఆ డ‌బ్బు కోస‌మే ఓ ముఠా ప్ర‌యత్నిస్తుండ‌డం, వాళ్ల బారీ నుంచి కాపాడుకోవ‌డం - క్ష‌ణం క్ష‌ణం నుంచీ ఇదే ఫార్ములా. ఈ సినిమాలోనూ అంతే. ఫ‌స్ట్ సీన్‌లోనే బ్యాంకు దోపిడీకి గురైన రెండు కోట్లు ఏదో విధంగా హీరోకి చేర‌తాయ‌ని తెలిసిపోతుంది. అదెలా అనేదాన్ని చూపించ‌డానికి ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ లొక్కొచ్చారు. ఈ రెండు సీన్ల‌తోనే సినిమా న‌డ‌వ‌దు కాబ‌ట్టి.. హీరోయిన్‌కి లాక్కొచ్చారు. ఆమెతో హీరో జ‌రిపే ల‌వ్ ట్ర‌క్‌... న‌భూతో న భ‌విష్య‌తే అన్నంత అరాచకంగా సాగుతుంది. పొట్టి హీరో, పొడుగు హీరోయిన్‌ల కెమిస్ట్రీ చూళ్లేక చ‌చ్చారు జ‌నాలు. కృతికి త‌మ్ముడ‌లా కాదు.. చిన త‌మ్ముడిలా క‌నిపించాడు నాగ‌చైత‌న్య‌. ఇంత కంటే ఈ కెమిస్ట్రీ గురించి వ‌ర్ణించ‌డం మా వ‌ల్ల కాదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఇంట్రవెల్ త‌ర‌వాత క‌థ‌, క‌థ‌నాలు మ‌రింత నాశిర‌కంగా క‌నిపిస్తాయి. బుల్లెట్ బాబు (బ్ర‌హ్మానందం) అనే ఓ అన‌వ‌స‌ర పాత్రని ఇరికించి... అందులోంచి పుట్టిన వినోదంతో ప్రేక్ష‌కుల్ని సంతృఫ్తిప‌ర‌చి ఇళ్ల‌కు పంపిద్దామ‌నుకొన్నారు. అందుకు సినిమా పూర్త‌యిపోయాక కూడా మ‌రో 10 నిమిషాలు కామెడీ ట్రాక్ న‌డిపించారు. స్వామిరారాతో సుధీర్ వ‌ర్మ‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ న‌మ్మ‌కం క‌లిగింది. అయితే ఈ సినిమాతో పూర్తిగా దాన్ని పోగొట్టుకొన్నాడు. టేకింగ్ ప‌రంగా.. అత‌నికి మార్కులు వేయొచ్చుగానీ, క‌థ - క‌థ‌నాల దృష్ట్యా అయితే బాగా నిరుత్సాహ‌ప‌రుస్తాడు. క్రైమ్ కామెడీని ఎలా న‌డిపించాలో స్వామి రారాతో ఓ పాఠంగా చెప్పిన సుధీర్‌.. ఎలా తీయ‌కూడ‌దో ఈ సినిమాతో మ‌ళ్లీ తానే చూపించాడ‌నిపించింది.

నాగ‌చైత‌న్య ఎప్ప‌ట్లా న‌టించేశాడు. ఆటోన‌గ‌ర్ సూర్య‌కీ, మ‌నంకీ, దోచేయ్‌కి న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ చూపించ‌లేక‌పోయాడు. ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాల్సిన సీన్స్‌లో నీర‌సంగా ఎలా న‌టించ‌గ‌లుగుతున్నాడో, ఆ సీక్రెట్ ఏంటో చైతూనే చెప్పాలి. కృతి.. ఓ మ‌గ‌రాయుడిలా క‌నిపించింది త‌ప్ప‌.. హీరోయిన్ ల‌క్ష‌ణాలేం లేవు. బ్ర‌హ్మానందం ఈ సినిమాని మాత్రం కాపాడ‌లేక‌పోయాడు. పోసాని, ర‌విబాబు... వీళ్లున్నా లాభం లేక‌పోయింది.

సన్నీ పాట‌లు బాగున్నా, అన్నీ ఒకేలా ఉన్నాయి. రిచ‌ర్డ్ ఛాయాగ్ర‌హ‌ణం సూప‌ర్బ్‌. త‌క్కువ బ‌డ్జెట్‌లో నాణ్య‌మైన సినిమా చూపించాడు. కాక‌పోతే... ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఇలా రెండు విభాగాలూ నిర్వ‌ర్తించిన సుధీర్ వ‌ర్మ మాత్రం తేలిపోయాడు. స్వామి రారా డైరెక్ట‌ర్స్ సినిమా.. ఇదీ అంతే అనుకొంటే ఈ ప‌రాజ‌యానికి త‌నే బాధ్యుడు.

క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగిన సినిమా ఇది. క్రైమ్‌లో థ్రిల్ లేదు. కామెడీలో న‌వ్వు లేదు. అంత కంటే ఈ సినిమా గురించి ఏం చెప్పాలి??