Read more!

English | Telugu

సినిమా పేరు:డిక్టేటర్
బ్యానర్:ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jan 14, 2016

కొత్త‌గా ఆలోచించకుండా... రొటీన్ ఫార్మెటే శ్రీ‌రామ‌ర‌క్ష అని కొంత‌మంది ద‌ర్శ‌కులు ఫిక్స‌యిపోతుంటారు. పొర‌పాటున కూడా కొత్త క‌థ ముట్టుకోరు. అవే సీన్లు. అవే యాక్ష‌న్‌, అవే పాత పులిహోర క‌థ‌, అవే డైలాగులు.. క‌నీసం ట్విస్టు కూడా మార్చ‌రు. దాంతో పాత సినిమాకి కొత్త పోస్ట‌ర్ వ‌చ్చిన ఫీలింగ్ క‌లుగుతుంటుంది. డిక్టేట‌ర్ కూడా అలాంటి సినిమానే. మొత్తం 60 స‌న్నివేశాల్లో ఒక్క‌దాంట్లోనూ `అరె.. ద‌ర్శ‌కుడు భ‌లేగా ఆలోచించాడు` అనే ఫీలింగ్ రాదు. ఏదో వాళ్లు చూపిస్తున్నారు.. మ‌నం చూస్తున్నాం.. అనిపిస్తుందంతే! కాక‌పోతే.. తెర‌పై బాల‌కృష్ణ‌ని చూసి, త‌న డైలాగులు విని, పంచ్‌ల‌తో క‌డుపునింపుకొంటే చాలు.. అనుకొంటే డిక్టేట‌ర్‌... ఓకే అనిపిస్తుంది. మ‌రింత‌కీ ఈ క‌థేంటంటే..

చందు (బాల‌కృష్ణ‌) ఓ సూప‌ర్ మార్కెట్ లో ప‌నిచేస్తుంటాడు. త‌న గొడ‌వ త‌న‌దే. ఎవ‌రి విష‌యాల్లోనూ జోక్యం చేసుకోడు. భార్య‌  కాత్యాయని ( అంజలి) ఉద్యోగం రీత్యా మ‌రో ఊర్లో ఉంటుంది. చందు మాత్రం మామ (నాజ‌ర్‌) ఇంట్లో ఉంటూ త‌న కుటుంబాన్ని కంటికి రెప్ప‌లా చూసుకొంటుంటాడు.  ఇందు (సోనాల్ చౌహాన్) చందుని చూసి ఆక‌ర్ష‌ణ‌లో ప‌డుతుంది.  ఇందు అన్న‌య్య (రాజీవ్ క‌న‌కాల‌) ఓ మ‌ర్డ‌ర్ కేసులో ప్ర‌త్య‌క్ష సాక్షి. అందువ‌ల్ల విక్కీ గ్యాంగ్ అత‌న్ని వెంబ‌డిస్తుంటుంది.  ఇందుని కాపాడే ప్ర‌య‌త్నంలో చందులో ఉన్న డిక్టేట‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తాడు. చందుని టీవీలో చూసిన ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ( సుమన్)... చందులోని అస‌లు మ‌నిషికి లోకానికి ప‌రిచ‌యం చేస్తాడు. ఇంత‌కీ చందు ఎవ‌రు? ఎందుకు అలా అనామ‌కుడిగా ఉండిపోయాడు? అత‌ని ఫ్లాష్  బ్యాక్ ఏంటి? అన్న‌దే డిక్టేట‌ర్ స్టోరీ.


ఎనాలసిస్ :

కొత్త‌ద‌నం జోలికి వెళ్ల‌ని క‌థ ఇది. క‌థ‌నం కూడా అలానే ఉంటుంది. స‌మ‌ర సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, ఇంద్ర‌, బాషా... క‌థ‌ల ప్ర‌భావం నుంచి మ‌నోళ్లు ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు.. అనడానికి ఈసినిమా మ‌రో నిద‌ర్శ‌నం. బాల‌కృష్ణ 99వ సినిమా ఇది. బాల‌య్య‌ని తెర‌పై ఎలా చూపిస్తే అభిమానుల‌కు న‌చ్చుతుందో .. స‌రిగ్గా అలానే చందు పాత్ర‌ని డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఆ పాత్ర చుట్టూనే మిగిలిన పాత్ర‌ల్ని కూడా సృష్టించి... కేవ‌లం బాల‌య్య‌ని ఎలివేట్ చేసేందుకే రెండున్న‌ర గంట‌లు క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచే రెండో సీన్ ఇది.. క్లైమాక్స్ ఇదీ.. అంటూ ప్రేక్ష‌కుడికి తెలిసిపోతూ ఉంటుంది. అంత దారుణంగా ఉంది స్ర్కీన్ ప్లే. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ.. క‌థ న‌త్త‌న‌డ‌క న‌డుస్తూ ఉంటుంది. కామెడీ సెట్ చేసినా.. న‌వ్వులు పండ‌వు. కేవ‌లం బాల‌య్య‌ని చూస్తూ టైమ్ పాస్ చేయాలి. ఇంట్ర‌వెల్ ముందు ఊహించిన ట్విస్టే ఎదుర‌వుతుంది. దాంతో థ్రిల్ ఉండ‌దు. కాక‌పోతే ఈ ఫార్ములా స‌న్నివేశాలనే భారీగా, స్టైలీష్ గా, బాల‌య్యే సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అయ్యేలా తీసిన విధానం మాత్రం బాగుంది. ఇంట్ర‌వెల్ త‌ర‌ువాత‌.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ బాల‌య్య న‌ట విశ్వ‌రూపం క‌నిపిస్తుంది. బాల‌య్య‌ని ఇది వర‌కు ఎవ్వ‌రూ చూపించ‌నంత స్టైలీష్ గా చూపించాడు. డైలాగులు బాగానే పేలాయి. కానీ 99 సినిమాల చ‌రిత్ర ఉన్న బాల‌య్య మ‌రీ ఇంత రొటీన్ క‌థ ఎంచుకోవ‌డం అనేదే స‌గ‌టు సినీ అభిమానికి మింగుడు ప‌డ‌దు. బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం.. ఈ సినిమాలోని ప్ర‌తీ ఇంచు ఎంజాయ్ చేస్తారు.

కోన అండ్ కో ఉండ‌గా కామెడీకి లోటు రాద‌నుకొంటారు. కానీ ఈ సినిమాలో అదే పెద్ద లోటుగా క‌నిపించింది. తొలి భాగంలో కొంత కామెడీ ప్ర‌య‌త్నించారు. అది వ‌ర్క‌వుట్ కాలేదు. సెకండాఫ్‌లో అదీ... లేదు. ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ రొటీన్ గా సాగుతాయి. మొత్తానికి పాత సినిమాల పులిహోర‌లా ఈ సినిమా క‌నిపిస్తుంది. అందులో జీడిపప్పు ఐటెమ్ మాత్రం బాల‌య్యే. అస‌లు ఈసినిమాలో బాల‌య్య కాకుండా వేరే హీరో క‌నిపిస్తే... ఇంట్ర‌వెల్ కే స‌గం థియేట‌ర్లు ఖాళీ అయిపోదును.. బాల‌య్య ఎన‌ర్జీ ఈసినిమాలోనూ క‌నిపించింది. డాన్సులు హుషారుగా చేశాడు. కాస్త స్లిమ్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. అంజ‌లి కూడా ఓకే. సోనాల్ కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప‌రిమిత‌మైంది. బ‌ల‌మైన విల‌నీ లేకపోవ‌డం ఈసినిమాకి ప్ర‌ధాన‌మైన మైన‌స్. కెమెరా బాల‌య్య‌పైనే ఫోక‌స్ పెట్ట‌డంతో మిగిలిన‌వాళ్లు ఎలివేట్ అవ్వ‌లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సాంకేతికంగా ఈరోస్ స్థాయిలోనే సినిమా ఉంది. త‌మ‌న్ పాట‌ల‌న్నీ రొడ్డ‌కొట్టుడే. మెలోడీ ఒక్క‌టే బాగుంది. ఆర్‌.ఆర్ బాధ్య‌త చిన్నా మోశాడు. త‌న అనుభ‌వాన్నంత రంగ‌రించి.. సీన్ల‌లో ఎమోష‌న్ క్యారీ చేశాడు. శ్రీ‌వాస్ రొటీన్ క‌థ‌ని అభిమానుల‌కు న‌చ్చేలా తీశాడు. డైలాగులూ ఆక‌ట్టుకొంటాయి. మొత్తానికి ఇది బాల‌య్య అభిమానుల కోస‌మే తీసిన సినిమా.. అంత‌కు మించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు.