Read more!

English | Telugu

సినిమా పేరు:డెవిల్
బ్యానర్:అభిషేక్‌ నామా
Rating:2.50
విడుదలయిన తేది:Dec 29, 2023

సినిమా పేరు: డెవిల్
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, అజయ్, మహేష్ ఆచంట, షఫీ
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్.ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: తమ్మిరాజు
రచన: శ్రీకాంత్ విస్సా
దర్శకత్వం: అభిషేక్‌ నామా
నిర్మాత: అభిషేక్‌ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023 

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. గతేడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన, ఈ ఏడాది 'అమిగోస్'తో నిరాశపరిచాడు. ఇప్పుడు 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అంటూ 'డెవిల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై మొదటినుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు పెరిగాయి. దానికితోడు దర్శకుడి పేరు మార్పు వివాదంతో ఈ చిత్రం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ కి 'బింబిసార'లా బ్లాక్ బస్టర్ అందించేలా ఉందా? లేక 'అమిగోస్'లా మరో షాకిచ్చేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:-
1945లో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో రాసపాడు అనే ప్రాంతంలో జమీందారు కుమార్తె విజయ హత్యకు గురవుతుంది. ఈ కేసులో సరైన విచారణ జరపకుండానే జమీందారే తన కూతురిని హత్య చేశాడని స్థానిక పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ హత్య కేసు విచారణ కోసం బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ 'డెవిల్'(కళ్యాణ్ రామ్) అనే ఏజెంట్ ని రంగంలోకి దింపుతుంది. ఈ విచారణ సమయంలో కొన్ని ఊహించని విషయాలు తెలుస్తుంటాయి. అసలు ఒక సాధారణ హత్య కేసు విచారణ కోసం బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ 'డెవిల్'ని రంగంలోకి దింపడానికి కారణమేంటి?.. బ్రిటిష్ వారు తెలుసుకోవాలి అనుకుంటున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ అంశానికి, ఈ హత్యకి సంబంధం ఏంటి?.. డెవిల్, బ్రిటిష్ ఏజెన్సీ సహా అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్న త్రివర్ణ ఎవరు?.. అసలు డెవిల్ లక్ష్యం ఏంటి? చివరికి అతను అనుకున్నది సాధించగలిగాడా? అనే మిగిలిన కథ.


ఎనాలసిస్ :

సినిమా ఫలితం అనేది ప్రధానంగా కథనం మీద ఆధారపడి ఉంటుంది. కథనం ఎంత ఆసక్తికరంగా, ఎంత ఉత్కంఠభరితంగా ఉంటే.. సినిమా అంతలా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక సాధారణ కథని కూడా అద్భుతమైన కథనంతో ప్రేక్షకుల మెప్పు పొందేలా మలచవచ్చు. అలాగే ఒక మంచి కథని తీసుకొని, దానికి తగ్గ కథనం రాసుకోక.. ప్రేక్షకుల తిరస్కారానికి గురికావచ్చు. డెవిల్ విషయంలో కూడా ఇంచుమించు అలాగే జరిగింది.

బ్రిటిష్ పాలన సమయంలో.. ఒక హత్య కేసు విచారణని మరియు సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కోసం బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాన్ని ముడిపెడుతూ కథ రాసుకోవాలన్న ఆలోచన నిజంగా బాగుంది. కానీ ఆ కథాంశానికి తగ్గ సరైన కథనం తోడైతే సినిమా అద్భుతంగా వచ్చి ఉండేది. 

జమీందారు కుమార్తె హత్యతో సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత డెవిల్ పాత్ర పరిచయమై, ఆ హత్య కేసు విచారణ కోసం రాసపాడు వస్తాడు. విచారణలో భాగంగా వచ్చే కొన్ని సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా ఆ హత్య ఎవరు చేశారనే సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ, పలువురిపై అనుమానం వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే అసలైన నేతాజీ కథని కాకుండా, ఈ హత్య కేసుని ఎక్కువగా చూపించడం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలు.. కథకి స్పీడ్ బ్రేకర్లులా అడ్డు తగిలాయి. ఇంటర్వెల్ మాత్రం మెప్పిస్తుంది.

ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతాయి. అయితే ఆ ట్విస్ట్ లు రివీల్ అయ్యే సన్నివేశాలు మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. అంతా రివీల్ అయ్యాక కూడా సినిమాని కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఇంకా మెరుగ్గా రాసుకొని ఉండాల్సింది.

నటీనటుల పనితీరు:-
డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ చక్కగా రాణించాడు. సీక్రెట్ ఏజెంట్ పాత్రకి తగ్గట్టుగా తన డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్ ఉన్నాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆయన డబ్బింగ్ మాత్రం అంత సహజంగా లేదు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లకు మంచి పాత్రలే లభించాయి. వారు ఆ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, అజయ్, మహేష్ ఆచంట, శ్రీకాంత్ అయ్యంగర్, షఫీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

రచయిత శ్రీకాంత్ విస్సా కథాకథనాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి.  పాటలతో మెప్పించలేకపోయిన హర్షవర్ధన్ రామేశ్వర్.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సౌందర్ రాజన్.ఎస్ కెమెరా పనితనం బాగుంది. గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ మెప్పించింది. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ తమ్మిరాజు కత్తెరకు మరింత పని చెప్పి ఉండాల్సింది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

బ్రిటిష్ పాలన కాలంలో.. ఒక మర్డర్ మిస్టరీని మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కోసం బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాన్ని ముడిపెడుతూ కథ రాసుకోవాలన్న ఆలోచన బాగుంది. కానీ ఆ ఆలోచనకు తగ్గ ఆసక్తికరమైన కథనం తోడు కాలేదు. అనవసరమైన సన్నివేశాలు, పాటలు ఇరికించడంతో పాటు.. నెమ్మదిగా సాగే కథనం కారణంగా సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కళ్యాణ్ రామ్ మరియు చిత్ర బృందం చేసిన ప్రయత్నం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

- గంగసాని