Read more!

English | Telugu

సినిమా పేరు:డార్లింగ్
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
Rating:3.00
విడుదలయిన తేది:Apr 23, 2010
ప్రభ (ప్రభాస్) ఆలియాస్ ప్రభాస్ లాయర్ హనుమంతరావు (ప్రభు) ముద్దుల కొడుకు. తన జూనియర్ అయిన నిషా(శ్రద్ధాదాస్) ప్రభాస్ ని ప్రేమిస్తున్నాని చెబుతుంది. ప్రభాస్ ఆమె ప్రేమని తిరస్కరిస్తాడు. దాంతో నిషా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. నిషా తండ్రి (ముఖేష్ రుషి) పెద్ద గూండా. తన కూతురు ప్రభాస్ కారణంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందన్న విషయం తెలిసి తన గుండాల చేత ప్రభాస్ ని తన దగ్గరకు రప్పించుకుంటాడు. తన కూతురుని పెళ్ళి చేసుకోకపోతే చంపేస్తానని అంటాడు.దాంతో ప్రభాస్ స్విట్జర్లాండ్ లో ఉన్న నందిని (కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తున్నానని అతనికి ఓ అందమైన కథని అల్లి చెబుతాడు. ఆ కథ నమ్మి ప్రభాస్ ని వదిలేస్తాడు. అయితే నందిని అనే అమ్మాయి ప్రభాస్ చిన్ననాటి స్నేహితురాలు. స్విట్జర్లాండ్ లో ఉంటుంది. నందిని తండ్రి విశ్వనాథ్(ఆహుతి ప్రసాద్), ప్రభాస్ తండ్రి ప్రాణస్నేహితులు. విశ్వనాథ్, హనుమంతరావు వారి పాత స్నేహితులందరూ కలిసి ఒకచోట కలుసుకుంటారు. అక్కడికి నందిని కూడా వస్తుంది. ఆమెని కలవడం కోసం ప్రభాస్ కూడా బయలు దేరుతాడు. మరి చిన్ననాటి స్నేహితురాలయిన నందిని, ప్రభాస్ ని ప్రేమించిందా...లేదా చివరికి వారిద్దరూ ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రం ఓ చిన్ననాటి స్నేహితుల మధ్య ప్రేమని ఆవిష్కరిస్తుంది, స్నేహితుల మధ్య ఉండే బంధాన్ని ఆవిష్కరిస్తుంది, తండ్రీ కొడుకుల మధ్యలో ఉండే అనుబంధాన్ని, ఆప్యాయతని ఆవిష్కరిస్తుంది. ఎలాంటి అసభ్యతతో కూడిన సంభాషణలు లేని చక్కని హాస్యాన్నిఆవిష్కరిస్తుంది, కుర్రకారులో ఉండే కొంటేతనాన్ని, చిలిపి చేష్టలని ఆవిష్కరిస్తుంది, చిన్నపిల్లల్లో ఉండే అల్లరి తనాన్ని ఆవిష్కరిస్తుంది... టోటల్ గా ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి ఆస్వాదించే విధంగా ఉంది. దర్శకుడు కరుణాకరన్ ప్రేమకథలని ఎంత అందంగా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సన్నివేశాన్ని చాలా అందంగా చిత్రీకరించాడు. స్విట్జర్లాండ్ లో తీసిన సన్నివేశాలు చాలా బావున్నాయి. ఫస్టాఫ్ లో హీరో విలన్ కి తన లవ్ స్టోరీ చెబుతున్నట్టు ఓ కట్టుకథని చూపించడం కొత్తగా ఉంది. సరిగ్గా హీరో చెప్పిన కట్టుకథలో ఉండే క్యారెక్టర్ మ్యానరిజమే సెకెండాఫ్ లో వచ్చే పాత్రలలో ఉండడం బావుంది. మొత్తానికి ఈ చిత్రం ఈ వేసవిలో కుటుంబసమేతంగా చూసి ఆనందించే విధంగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ప్రభాస్ కి ఈ చిత్రం ద్వారా ఓ హిట్ లభించినట్టే.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :- ప్రభాస్ :- ప్రభాస్ క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలైట్. ప్రతీ సన్నివేశంలోనూ ప్రభాస్ నటన అదిరిపోయింది. ఎక్స్ ప్రెషన్స్ లోనూ, డ్యాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ తనదైన శైలి కనబరచాడు. కాజల్ :- కాజల్ క్యారెక్టర్ బావుంది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లలో, ప్రేమని వ్యక్తపరిచే సన్నివేశాలలో కాజల్ నటన ఆకట్టుకుంటుంది. ప్రభు :- తమిళ నటుడు ప్రభు నటన ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ప్రభాస్ తండ్రిగా ప్రభు చాలా బాగా నటించాడు. తండ్రీ కొడుకులుగా ప్రభాస్, ప్రభుల కెమిస్ట్రీ బావుంది. చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, ముఖేష్ రుషి, తులసి, ధర్మవరపు మిగతా నటీనటులు తమ తమ పాత్రలకి తగ్గట్టుగా చక్కగా నటించారు. సంగీతం :- జి.వి. ప్రకాష్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకి తగ్గట్టుగా చాలా బాగా కంపోజ్ చేసాడు. దర్శకత్వం :- కరుణాకరన్ దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రంలోనూ లవ్, సెంటిమెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రభాస్ లాంటి మాస్ హీరోతో ఎక్కువగా వయోలెన్స్ లేకుండా చక్కని ప్రేమకథా చిత్రాన్ని అందించడంలో కరుణాకరన్ సక్సెస్ సాధించాడు. హిట్టుకొట్టే అన్ని అంశాలు వున్న ఈ సినిమా ఎంత సెన్షేషన్ సృష్టించనున్నదో మరో నాలుగైదు రోజులలో తెలుస్తుంది.