Read more!

English | Telugu

సినిమా పేరు:దర్జా
బ్యానర్:పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 22, 2022

సినిమా పేరు: దర్జా
తారాగ‌ణం: అనసూయ, సునీల్, అక్సా ఖాన్, ఆమని, పృథ్వీ, షకలక శంకర్, సంజయ్ స్వరూప్, షఫి, ఛత్రపతి శేఖర్
సంగీతం: రాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫీ: దర్శన్
ఎడిటర్‌: ఎం.ఆర్. వర్మ
నిర్మాత: శివశంకర్ పైడిపాటి 
దర్శకత్వం: సలీమ్ మాలిక్
బ్యానర్: పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్
విడుద‌ల తేదీ: జులై 22, 2022

తన గ్లామర్ తో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. తన నటనతో వెండితెరపైనా అలరిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'దర్జా'. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటించడం విశేషం. 'పుష్ప' సినిమాలో భార్యాభర్తలుగా నటించిన మెప్పించిన ఈ ఇద్దరు.. ఇప్పుడు ఈ 'దర్జా' చిత్రంలో ప్రత్యర్థులుగా నటించారు. మరి ఇందులో ఎవరిది పైచేయి?.. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:-

బందరు కనకం అలియాస్‌ కనక మహాలక్ష్మీ(అనసూయ) పోలీసులను, రాజకీయ నాయకులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ ఉంటుంది. తనకు అడ్డొచ్చిన వారిని చంపేస్తూ, శవాలపై తన మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. తన తమ్ముడు, అనుచరులతో కలిసి ఆమె చేసే దౌర్జన్యాల వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఎన్నో కుటుంబాలలో కన్నీళ్లు మిగులుతాయి. ఆమె ఆగడాలు మితిమీరిన సమయంలో ఆ ఏరియాకి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివ శంకర్(సునీల్‌) వస్తాడు. వచ్చీ రావడంతోనే కనకాన్ని ఢీ కొడతాడు. ఆమె మాఫియా సామ్రాజ్యాన్ని ఒక కుదుపు కుదుపుతాడు. అసలు శివ శంకర్ ఎవరు? కనకాన్ని ఎందుకు ఢీ కొట్టాడు? అతనికి, ఆ ప్రాంతానికి సంబంధం ఏంటి? అక్కడి ప్రజలను కనకం బారి నుంచి కాపాడాడా లేదా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఒక వ్యక్తి చేతిలోనో, ఒక కుటుంబం చేతిలోనో అమాయకపు ప్రజలు నలిగిపోతుండటం.. ఒకరొచ్చి వాళ్ళను ఎదిరించి ప్రజలను కాపాడటం అనేది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన కథ. అలాంటి రొటీన్ కథతో తెరకెక్కిందే 'దర్జా'. అయితే కథ ఎంత పాతదైనా, కథనం ఆసక్తికరంగా సాగితే విజయాన్ని అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. 'దర్జా'ని కూడా కథ కంటే, కథనాన్ని నమ్ముకొని తీశారని చెప్పొచ్చు.

పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఎస్సై లక్ష్మి నరసింహం(షఫి).. రాగానే పాత కేసులు, రికార్డులు అని హడావిడి చేస్తుండటంతో.. అతనికి ఆ ఏరియాలో కనకం గురించి, ఆమె క్రూరత్వం గురించి హెడ్ కానిస్టేబుల్ చెప్పడం స్టార్ట్ చేయడంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఫస్ట్ హాఫ్ లో ఒకవైపు కనకం దౌర్జన్యాలు, మరోవైపు రెండు ప్రేమ కథలు జరుగుతుంటాయి. కానీ ఆ ప్రేమ కథల సన్నివేశాలే బోరింగ్ గా అనిపిస్తాయి. షకలక శంకర్, పృథ్విల కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఒక ప్రేమజంటలోని అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం, అతన్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయి మిస్ అవ్వడంతో కాస్త ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వెల్ కి ముందు సునీల్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వడం, కనకం గ్యాంగ్ ని కొట్టడం ఆకట్టుకుంది.

ఫస్ట్ హాఫ్ లో పలు ప్రశ్నలు రేకెత్తేలా చేసిన దర్శకుడు వాటికి సెకండాఫ్ లో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. అబ్బాయి ఆత్మహత్యకు కారణమేంటి? అమ్మాయి ఎక్కడుంది? ప్రేమ జంటలకు, కనకానికి లింకేంటి? అసలు సునీల్ ఆ ఊరు ఎందుకొచ్చాడు? ఇలాంటివన్నీ సెకండాఫ్ లో రివీల్ అవుతాయి. అయితే సస్పెన్స్ మైంటైన్ చేయడం, వాటిని లింక్ చేసిన విధానం బాగానే ఉంది కానీ.. సన్నివేశాలను ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యారు. మన ఆలోచన బాగుంటే సరిపోదు, దానిని స్క్రీన్ మీద అందంగా, ఆసక్తికరంగా చూపించగలగాలి. అప్పుడే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలా కాకుండా పేజీల పేజీల డైలాగ్స్ తో చెప్పిస్తే విసుగొస్తుంది. ఇందులో కొన్ని కొన్ని చోట్ల డైలాగ్స్ సన్నివేశాల్ని డామినేట్ చేశాయి. కొన్నివేశాల్లో నీకొక డైలాగ్, నాకొక డైలాగ్ అన్నట్లుగా ఆర్టిస్టులు పోటాపోటీగా చెప్పినట్లు అనిపించింది.

ఈ సినిమాలో మాస్ ని ఆకట్టుకునే అంశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో మీడియం రేంజ్ హీరో సినిమా స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉండటం విశేషం. అలాగే ఈ చిత్రంతో 'ఢీ' షో ఫేమ్ అక్సా ఖాన్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇందులో హీరోయిన్ గా నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ చేసింది. ఆ సాంగ్ తెరకెక్కించిన విధానం, అందులో అక్సా ఖాన్ గ్లామర్ షో, ఆమె స్వింగ్ స్టెప్పులు మాస్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

రాప్ రాక్ షకీల్ సంగీతం పర్లేదు. కొన్ని సన్నివేశాలకు అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలం చేకూర్చితే, మరికొన్ని చోట్ల సన్నివేశాలను డామినేట్ చేసేలా ఉంది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ ఎమ్.ఆర్. వర్మ తన కూర్పులో మరింత నేర్పు చుపించాల్సింది.


నటీనటుల పనితీరు:-
బందరు కనకంగా అనసూయ అదరగొట్టింది. ఆహార్యం, అభినయంతో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ శివ శంకర్ గా సునీల్ మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మూగవ్యక్తిగా అరుణ్ వర్మ, పుష్పగా శిరీష ఆకట్టుకున్నారు. రంగా పాత్రలో షమ్ము, గీతగా అక్సా ఖాన్ పర్లేదు అనిపించుకున్నారు. వారి ఎక్స్ ప్రెషన్స్ లో కొత్త నటులనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమని, పృథ్వీ, షకలక శంకర్, సంజయ్ స్వరూప్, షఫి, ఛత్రపతి శేఖర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అసలే ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలకు ఆదరణ అంతంత మాత్రంగా ఉన్న ఇలాంటి సమయంలో 'దర్జా' లాంటి సాధారణ కథతో ప్రేక్షకుల ముందుకు ధీమాగా రావడం సాహసమనే చెప్పాలి.

-గంగసాని