Read more!

English | Telugu

సినిమా పేరు:కస్టడీ
బ్యానర్:శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
Rating:2.00
విడుదలయిన తేది:May 12, 2023

సినిమా పేరు: కస్టడీ
తారాగణం: నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిశోర్, గోపరాజు రమణ, సంపత్ రాజ్, జయప్రకాశ్, వైజీ మహేంద్రన్, సూర్య, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, కాదంబరి కిరణ్, రజిత, ముఖ్తార్ ఖాన్, ప్రేమి విశ్వనాథ్, జీవా (గెస్ట్), ఆనంది (గెస్ట్), జయసుధ (గెస్ట్), రాంకీ (గెస్ట్), ఆనంద్ (గెస్ట్)
డైలాగ్స్: అబ్బూరి రవి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీ శివాని
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కదిర్
ఎడిటింగ్: వెంకట్ రాజేన్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
యాక్షన్: స్టన్ శివ, మహేశ్ మాథ్యూ
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
రచన-దర్శకత్వం: వెంకట్ ప్రభు
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: 12 మే 2023

నాగచైతన్య హీరోగా ప్రతిభావంతుడైన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు, తమిళ భాషల్లో 'కస్టడీ' సినిమా తీస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారితో పాటు చైతూ ఫ్యాన్స్, సినీ గోయర్స్ చాలా ఆసక్తి కనపర్చారు. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆశించారు. 'బంగార్రాజు' తర్వాత చైతూ, కృతి శెట్టి మరోసారి జతకట్టిన ఈ సినిమా ఎలా ఉందయ్యా అంటే...

కథ

సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే ఎ. శివ (నాగచైతన్య) ఒక రోజు రాత్రి హెడ్ కానిస్టేబుల్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుంటే, ఒక కారు వారిని ఢీకొడ్తుంది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకొని లాకప్‌లో పెడతాడు శివ. ఆ తర్వాత వారిలో ఒకరు కరడుకట్టిన కిల్లర్ రాజు (అరవింద్ స్వామి), మరొకరు సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) అనే విషయం తెలుస్తుంది. అయితే పోలీస్ శాఖలోని పై అధికారులు ఆ స్టేషన్‌కు వచ్చి రాజును విడిపించి తీసుకోవాలని యత్నించడంతో పాటు, జార్జిని చంపాలని చూస్తారు. శివ వాళ్లను అడ్డుకొని రాజు, జార్జితో అక్కడ్నుంచి ఎస్కేప్ అవుతాడు. అప్పుడే శివ ప్రియురాలు రేవతి అతడి కోసం వచ్చి, కాకతాళీయంగా రోడ్డుపై కలుస్తుంది. ఆమెను కూడా తనతో తీసుకుపోతాడు శివ. ఐజీ నటరాజ్ (శరత్‌కుమార్) వారిని వెంటాడుతాడు. జార్జిని చంపేస్తాడు. రాజును కూడా చంపడానికి ట్రై చేస్తాడు. దీని వెనుక ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) ఉన్నదనే విషయం తెలుస్తుంది. రాజును శివ బెంగళూరులోని సీబీఐ కోర్టుకు తీసుకు వెళ్లగలిగాడా? రాజుకు, శివకు మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి? దాక్షాయణి అసలు రూపమేమిటి? శివ, రేవతి ఒక్కటయ్యారా?.. ఇలాంటి పలు ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానాలు లభిస్తాయి.


ఎనాలసిస్ :

యాక్షన్ థ్రిల్లర్‌గా 'కస్టడీ'ని మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. అయితే చివరకు వచ్చేసరికి సినిమాలో యాక్షన్ మిగిలి, థ్రిల్ అనేది లేకుండా పోయింది. ఇలాంటి సినిమాకు పకడ్బందీ స్క్రీన్‌ప్లే అవసరం. ఫస్టాఫ్ ఓ మోస్తరుగా ఉంది, సెకండాఫ్ అయినా ఉత్కంఠభరితంగా నడుస్తుందని ఊహిస్తే, మరింత అధ్వాన్నంగా కథనం సాగి.. సాగి చికాకు పెట్టింది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు కథనాన్ని రక్తి కట్టించాల్సిందిపోయి, సంక్లిష్టంగా మారిపోయాయి. పైగా ప్రధాన కథకు అనేక ఇతర విషయాలు జోడించడంతో సినిమా ఒక రుచిలేని ఒక కలగూరగంపలా మారిపోయింది.

శివ, రేవతి ప్రేమకథలో విలన్ లాగా వెన్నెల కిశోర్ చేసిన ప్రేమ్ క్యారెక్టర్ వచ్చి ప్రధాన కథకు పదే పదే ఆటంకం కలిగించింది. నిజానికి వెన్నెల కిశోర్ ఉంటే హాస్యం పండాల్సింది పోయి, అతను కనిపించే పలు సీన్లు చికాకు పెట్టించాయి. సినిమా అంతా రాజును శివ క్షేమంగా బెంగళూరులోని సీబీఐ కోర్టుకు తీసుకు వెళ్లడానికి చేసే ప్రయాణంతోనే సరిపోయింది. ఈ క్రమంలో ఐజీ నటరాజ్ పదే పదే వాళ్లను పట్టుకోడానికి ప్రయత్నించడం, నానా తంటాలు పడుతూ వాటి నుంచి శివ బయటపడటం.. ఇదొక ప్రహసనంలా మారిపోయి విసుగొస్తుంది. ఈ చేజింగ్ సీన్స్ అన్నీ కూడా దాదాపు ఒకే రకంగా ఉండటంతో పదే పదే ఒకే తరహా యాక్షన్ సీన్లు చూస్తున్న ఫీల్ కలుగుతుంది. పైగా రాజుకి ఒక దాని తర్వాత ఒకటిగా బుల్లెట్ గాయం, కత్తుల పోట్లతో ఒళ్లు ఛిద్రమవుతూ వస్తున్నా మనకు ఆ పాత్రమీద సానుభూతి కలగదు. ఇది క్యారెక్టరైజేషన్‌లోని లోపం.

శివకు ఒక అన్న ఉన్నాడంటూ సడన్‌గా ఫ్లాష్‌బ్యాక్ ద్వారా విష్ణు (జీవా) పాత్రను ప్రవేశపెట్టడం బాగానే అనిపించినా, దాన్ని ప్రధాన కథకు ప్రభావవంతంగా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా అంతా అనేక పాత్రలు వస్తూ పోతూ ఉండటం కూడా కథనాన్ని బలహీనపర్చాయి. శివ తండ్రి (గోపరాజు రమణ) పాత్రను ముగించిన తీరు కూడా సమంజసంగా లేదు. ఒకప్పుడు హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆనంద్ ఈ సినిమాలో చేసిన ఒక సీన్ క్యారెక్టర్ చూసి, అతని మీద జాలిపడాల్సిందే. క్లైమాక్స్‌లో జడ్జిగా పట్టి పట్టి మాటలతో తీర్పును చదివే జడ్జి పాత్రలో కనిపించి సహజనటి జయసుధ ఆశ్చర్యపరిచారు. ఇక ఆమె ఇలాంటి పాత్రలకు కూడా సిద్ధమైపోయారన్న మాట. రాంకీ కూడా కొద్దిసేపే కనిపించారు కానీ కొంత బెటర్. దాక్షాయణి పెదనాన్నగా పాపులర్ తమిళ నటుడు వైజీ మహేంద్రన్ కనిపించారు.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా మ్యూజిక్ అందించారు. ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉంది. చాలా సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఎడిటర్ వెంకట్ రాజేన్ వర్క్ ఇంప్రెసివ్‌గా లేదు. కథనంలో స్పీడ్ లేదనే విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. అబ్బూరి రవి సంభాషణలు సందర్భానుసారం నడిచాయి. నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు
శివ పాత్రలో నాగచైతన్య ఇమిడిపోయాడు. ఆ పాత్రను సంపూర్ణంగా అర్థం చేసుకొని దానిలా ప్రవర్తించాడు. ఒకవైపు అన్న కలను నిజం చేయడానికి తాపత్రయపడే తమ్మునిలా, ఇంకోవైపు ప్రేయసికి ఎలా న్యాయం చెయ్యాలో పాలుపోని ప్రియునిలా ఆ పాత్రలోని సంఘర్షణను బాగా చూపించాడు. రేవతి పాత్రలో కృతి కొత్తగా ఉన్నా, నటనపరంగా మెప్పించింది. దాక్షాయణిగా ప్రియమణి నెగటివ్ రోల్‌లో ఆకట్టుకుంది. రాజు పాత్రలోకి అరవింద్ స్వామి పరకాయ ప్రవేశం చేశాడు. ఐజీ నటరాజ్‌గా శరత్‌కుమార్ నటనను ఏమాత్రం తక్కువ చెయ్యలేం. శివ అన్న విష్ణుగా జీవా, అతని ప్రేయసిగా ఆనంది.. కనిపించేది కొద్దిసేపే అయినా బాగున్నారు. ఆనంది పాత్రను అర్ధంతరంగా వదిలేయడం బాలేదు. వెన్నెల కిశోర్ నటనలో మొనాటనీ వచ్చేసింది. ఈమధ్య ఏ సినిమాలో చూసినా ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు. శివ తండ్రిగా గోపరాజు రమణ మెప్పించారు. సంపత్ రాజ్, వైజీ మహేంద్రన్, జయప్రకాశ్, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, సూర్య, కాదంబరి కిరణ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

థ్రిల్లింగ్ కలిగించని యాక్షన్ సినిమా 'కస్టడీ'. తన పై అధికారుల ఆదేశాల్ని బేఖాతరు చేసి, ఏకంగా ముఖ్యమంత్రికి ఎదురొడ్డి, ఒక క్రిమినల్‌ను చట్టానికి అప్పగించాలని తపించే శివ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ సాహస గాథ బాక్సాఫీస్ దగ్గర వృథా ప్రయాస అయ్యే అవకాశాలే మెండు. కథ నడిచే కొద్దీ విసుగుపుట్టించే కథనంతో మన సహనానికి పరీక్ష పెట్టే సినిమా 'కస్టడీ'.

 

- బుద్ధి యజ్ఞమూర్తి