Read more!

English | Telugu

సినిమా పేరు:కొరియర్ బాయ్ కళ్యాణ్
బ్యానర్:గురు ఫిల్మ్స్‌
Rating:2.00
విడుదలయిన తేది:Sep 17, 2015


ఏదైనా వేడి వేడిగా వ‌డ్డిస్తేనే అందం.. రుచి!  ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన సినిమా.. ముక్కుతూ, మూలుగుతూ.. అదిగో, ఇదిగో అంటూ రిలీజ్ డేట్లు మార్చి  మార్చీ.. విసిగించీ విసిగించి.. చివ‌రికి విడుద‌ల చేశారు. అదే కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్‌. సినిమా అస‌లే ఆల‌స్యం, దానికి తోడు.. సినిమాలో 'విష‌యం' వీకు. అలా.. కొరియ‌ర్ కాస్త ఆల‌స్య‌మైనా వ‌చ్చింద‌ని సంతోషించేలోగా.. తెర‌చి చూస్తే ఏం లేదు. వెర‌సి.. కొ.బో.క‌ల్యాయ్ కాస్త‌.. బోరింగ్ క‌ల్యాణ్‌గా మిగిలాడు.




క‌థేంటంటే..
క‌ల్యాణ్ (నితిన్‌) బీఏ డిస్కంటున్యూడ్‌. జాబు కోసం ట్రై చేస్తుంటాడు. కానీ.. త‌న చ‌దువుకి ఉద్యోగం ఎవ‌డిస్తాడు?  అటు తిరిగి ఇటు తిరిగి ఓ కొరియ‌ర్ బోయ్‌గా చేర‌తాడు. అదీ.. కావ్య (యామీ గౌత‌మ్‌) కోసం. కావ్య కి రోజుకో క‌వర్ ఇచ్చి.. త‌న‌తో ప‌రిచయం పెంచుకొందామ‌ని మ‌నోడి ప్లాన్‌. అలా ట్రై చేసి. ట్రై చేసి విసిగిపోతాడు. ఈలోగా ఓ రోజు నేను ఆల్రెడీ ల‌వ్‌లో ఉన్నా ఆ ప్ర‌య‌త్నం మానుకో.. అంటుంది కావ్య‌.

మ‌రోవైపు విదేశాల్లో జీవక‌ణాల‌పై ప‌రిశోధ‌న జ‌రుపుతుంటాడు ఓ సైంటిస్ట్ (అశితోష్ రాణా). అందుకోసం గ‌ర్బిణీ స్త్రీల క‌ణాలు సేక‌రించాల్సిఉంటుంది. ఇండియాలో అయితే అందుకు అనువుగా ఉంటుంద‌ని.. త‌న ప్లాన్‌ని ఇండియాకొచ్చి అమ‌లు చేస్తుంటాడు. గ‌ర్బీణీ స్త్రీల‌కు ఏవో మందులిచ్చి బ‌ల‌వంతంగా అబార్ష‌న్ అయ్యేలా చేసి, అబార్ష‌న్ చేశాక ఆ క‌ణాల‌ను ప‌రిశోధ‌న నిమిత్తం పంపుతుంటారు. ఈ వ్య‌వ‌హారం ఆసుప‌త్రిలో ప‌నిచేసే ఓ కాంపౌండ‌ర్‌కి తెలుస్తుంది. వీటికి సంబంధించిన సాక్ష్యాల‌న్నీ సేక‌రించి, ఓ కవ‌ర్‌లో పెట్టి, స‌త్య‌మూర్తి (నాజ‌ర్‌) అనే ఓ సోష‌ల్ యాక్టివిస్ట్‌కి కొరియ‌ర్ చేస్తాడు. ఆ విష‌యం ముఠాకి తెలిసిపోతుంది. దాంతో ఆ కొరియ‌ర్ డెలివ‌రీ కాకుండా అడ్డుప‌డ‌దామ‌ని చూస్తారు. అది కాస్త‌.. క‌ల్యాణ్ చేతికి చేరుతుంది. ఆ త‌ర‌వాత ఏమైంది?  ఈ దారుణాన్ని క‌ల్యాణ్ ఎలా ఆపాడు, త‌న ప్రేమ‌ని ఎలా కాపాడుకొన్నాడు? అనేదే మిగిలిన క‌థ‌.



ఎనాలసిస్ :

రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తీద్దామ‌ని ద‌ర్శ‌కుడు ప్రేమ్‌సాయి అనుకొని ఉంటాడు. నిజానికి ఈ త‌ర‌హా క‌థ‌లు తెలుగుకి కొత్తే. కాక‌పోతే ప్రేమ్ సాయి న‌మ్మింది ఓ పాయింట్‌ని మాత్ర‌మే. ఆ పాయింట్‌ని సినిమాగా తీయాలంటే త‌గిన సన్నివేశాలు రాసుకోవాలి. ఆ విష‌యంలో ప్రేమ్ సాయి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. హాలీవుడ్‌లో అయితే ఇలాంటి సినిమాలు చ‌ల్తా. ఎందుకంటే అక్క‌డ సినిమా నిడివి గంట‌, గంటం పావు ఉంటే స‌రిపోతుంది. మ‌న‌కు అలా కాదు క‌దా, రెండు గంట‌ల సినిమా చెప్పాలి.

దానికి ఈ పాయింట్ స‌రిపోదు. ల‌వ్ ట్రాక్ స‌రిగా రాసుకొని, కామెడీ వైపు దృష్టి పెడితే బాగుండేది. కానీ యామీ గౌత‌మ్ హీరోయిన్ గా కాదు, నితిన్ అక్క‌లా క‌నిపించింది. దాంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఓ మిస్ట‌రీలా మారింది. ఇంట్ర‌వెల్‌కి ముందే సినిమా క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అంత వ‌ర‌కూ మ‌హా బోరింగ్ స్ర్కీన్ ప్లేతో సినిమా సాగుతూ... సాగుతూ ఉంటుంది. సెకండాఫ్‌లోనూ చెప్ప‌డానికి ఏం లేదు. ఆ కొరియ‌ర్‌ని అడ్డుకొని.. ఆప‌రేష‌న్ బ‌య‌ట‌పెట్ట‌డం త‌ప్ప‌.. హీరోకి టార్గెట్ అంటూ ఏం లేదు. హీరో ఎలాగూ... విలన్ల ప‌న్నాగం బ‌య‌ట‌పెడ‌తాడ‌న్న సంగ‌తి ఆడియన్ కి ముందే తెలుసు. కానీ అదెలా అన్న‌దే ఆస‌క్తిక‌రం. దాన్ని ఇంట్ర‌స్టింగ్‌గా చెప్ప‌డంలోనే ద‌ర్శ‌కుడి నైపుణ్యం దాగి ఉంటుంది. కానీ.. ప్రేమ్ సాయి ఈ విష‌యంలోనూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌రి ప‌ది నిమిషాల బైకు ఛేజింగ్ త‌ప్ప ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఏమీ లేకుండా పోయింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:

నితిన్ త‌న వ‌ర‌కూ బాగానే చేసుకొంటూ వెళ్లాడు. క‌ల్యాణ్‌గా చ‌లాకీ న‌ట‌న చూపించాడు. అయితే క‌థ‌లో నితిన్‌కి కావ‌ల్సిన జోరు లేకుండా పోయింది. యామీ ముందే చెప్పిన‌ట్టు నితిన్ అక్క పాత్ర‌ల‌కు బాగా సూట‌వుతుంది. హీరోయిన్‌గా కాదు. అశితోష్ రాణాని, నాజ‌ర్‌ని వాడుకొన్న‌ది ఎక్క‌డ?  స‌త్యం రాజేష్  ఉన్నా న‌వ్వుల్లేవు. స‌ప్త‌గిరి కామెడీని కావాల‌ని అతికించిన‌ట్టుంది.

టెక్నిక‌ల్‌గా..

సాంకేతికంగా పాట‌లు ఓకే. కానీ.. తెర‌పై రాంగ్ టైమింగ్‌లో వ‌చ్చి విసిగించాయి. ఇలాంటి సినిమాల‌కు పాటలు లేకున్నా ఫ‌ర్వాలేదు. నేప‌థ్య సంగీతం మాత్రం ఓకే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడికి ఇదే తొలిసినిమా. అన్ని విష‌యాల్లోనూ దారుణంగా విఫ‌లమ‌య్యాడు. నితిన్‌కి వ‌రుస‌గా హిట్స్ వ‌స్తున్నాయ్ ఈమ‌ధ్య‌.. వాటిని బ్రేక్ చేయ‌డానికి అన్న‌ట్టుగా ఈ కొరియ‌ర్ వ‌చ్చింతే.

పంచ్‌లైన్ :  కొరియ‌ర్ లేట్‌.. అందునా రాంగ్ అడ్ర‌స్‌...