Read more!

English | Telugu

సినిమా పేరు:చుట్టాలబ్బాయి
బ్యానర్:శ్రీ ఐశ్వర్య లక్ష్మీమూవీస్
Rating:1.00
విడుదలయిన తేది:Aug 19, 2016

 

తాడు దొరికింది క‌దా అని గుర్రాన్ని కొన‌కూడ‌దు..
కిళ్లీ ఫ్రీ క‌దా అని భోజ‌నం మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌కూడ‌దు..
సీన్‌లో పంచ్ ఉంటే బాగుంటుంది.. పంచ్‌ల కోసం సీన్ రాసుకోకూడ‌దు.
కానీ... టాలీవుడ్ ఖ‌ర్మ‌కొద్దీ  కొన్ని సినిమాలు, కొన్ని క‌థ‌లు అలానే త‌యార‌వుతున్నాయి. న‌వ్వించేద్దాం అన్న ఉద్దేశం మంచిదే. దాని కోసం పంచ్‌లు రాసేసుకొంటే చాల‌దు. క‌థ‌మీద ప‌ని చేయాలి. ఈమ‌ధ్య ప్ర‌తీ సినిమాలోనూ బ‌కెట్ల ఒక‌ద్దీ పంచ్‌లు వినిపిస్తున్నాయి. కానీ.. సినిమా పంక్చ‌ర్ అయిపోతోంది. ఎందుకంటే.. పంచ్‌లో ఉన్న బ‌లం.. క‌థ‌లో, ఆ స‌న్నివేశంలో లేక‌పోవ‌డమే. అలా కేవ‌లం ఏదో తిమ్మిని బ‌మ్మిని చేసి, న‌వ్వించేద్దామ‌ని చేసిన మ‌రో ప్ర‌య‌త్నం జ‌రిగింది. చుట్టాల‌బ్బాయితో.

క‌థ‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రిక‌వ‌రీ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు బాబ్జీ (ఆది). లోన్ పెట్టి ఈఎమ్ఐలు క‌ట్ట‌నివాళ్ల ముక్కు పిండి మ‌రీ వసూలు చేస్తుంటాడు. త‌న స్నేహితుడు అప్పులిచ్చి మోస‌పోతే.. ఆ అప్పుల్ని వ‌సూలు చేసి చెల్లెలు పెళ్లి జ‌రిపిస్తాడు. ఆ పెళ్లిలోనే కావ్య (న‌మిత ప్ర‌మోద్‌) ప‌రిచ‌యం అవుతుంది. జ‌స్ట్‌... కావ్య‌, బాబ్జీ ఒక‌రికొక‌రు తెలుసంతే. కానీ... కావ్య అన్న‌య్య (అభిమ‌న్యుసింగ్‌) మాత్రం దాన్ని ప్రేమ అనుకొంటాడు. అలా అనుకొంటే ఫ‌ర్వాలేదు. 'నా చెల్లెల్ని ప్రేమిస్తావా' అంటూ ఎన్‌కౌంట‌ర్ చేసేద్దామ‌ని రెడీ అయిపోతాడు. ఎందుకంటే కావ్య అన్న‌య్య ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్టు. ఈ విష‌యం తెలిసి 'కావ్య‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు' అని న‌చ్చ‌జెబుదామ‌నుకొంటాడు. కానీ వీలు కాదు. ఈలోగా కావ్య ఇంటి నుంచి పారిపోతుంది. ఆ స‌మ‌యంలో కావ్య‌కి స‌హాయ‌ప‌డ‌తాడు బాబ్జీ. కావ్య కోసం హైద‌రాబాద్ పోలీసులు మొత్తం వెదుకుతుంటారు. ఈలోగా మ‌రో గ్యాంగ్‌కూడా కావ్య ఫొటో ప‌ట్టుకొని తిరుగుతుంటుంది.  వీళ్లిద్ద‌రికీ బాబ్జీ, కావ్య దొరికిపోతార‌న‌గా దొర (సాయికుమార్‌) మ‌నుషులు బాబ్జీ, కావ్య‌ల‌ను కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ దొర ఎవ‌రు?  వాళ్ల‌ని ఎందుకు కిడ్నాప్ చేశారు?  అనే విష‌యాలు సెకండాఫ్ చూసి తెలుసుకోవాల్సిందే.


ఎనాలసిస్ :

పూల‌రంగ‌డు, అహ‌నా పెళ్లంట సినిమాలో విజ‌యాలు అందుకొన్న వీర‌భ‌ద్ర‌మ్‌.. భాయ్‌తో గ‌ట్టి దెబ్బ త‌గిలించుకొన్నాడు. ఈసారి హిట్టు కొట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే అందుకు కావ‌ల్సిన క‌స‌ర‌త్తు మాత్రం చేయ‌లేక‌పోయాడు. మిస్ అండ‌ర్ స్టాండ్ వ‌ల్ల ఓ జంట‌ని ప్రేమికులు అనుకొని వెంబ‌డించ‌డం వ‌ర‌కూ బాగానే ఉంది. అలా మొద‌లైన క‌థ‌... మ‌ళ్లీ రొటీన్ దారిలో ప‌డ‌డం మాత్రం బోర్ కొట్టిస్తుంది. ప్ర‌తీ డైలాగ్‌లో నూ పంచ్ పేల్చాల‌న్న ప్ర‌య‌త్నం క‌నిపించింది. కానీ న‌వ్వు రాదు. పంచ్‌లు ఉంటే స‌రిపోదు. ఆ స‌న్నివేశం కామెడీ చేయ‌డానికి అనువుగా ఉండాలి. స‌న్నివేశంలోంచి పంచ్ పుట్టాలి త‌ప్ప‌. పంచ్‌లోంచి స‌న్నివేశం పుట్ట‌దు. ఈ విష‌యాన్ని వీర‌భ‌ద్ర‌మ్ ఎంత త్వ‌ర‌గా తెలుసుకొంటే అంత మంచిది.

ప్రారంభ స‌న్నివేశాలు, ఈగో బాబ్జీ (ఫృద్వీ) ఎపిసోడ్‌.. కాస్తో కూస్తో ఓకే అనిపిస్తాయి. కానీ రైల్ జ‌ర్నీ ఎప్పుడైతే మొద‌లైందో అప్ప‌టి నుంచీ సినిమా విసుగు పుట్టించ‌డం మొద‌ల‌వుతుంది. సినిమా మొద‌లైన 20 నిమిషాల‌కే ఈ సినిమాలో ఏం లేదు.. అన్న విష‌యం అర్థ‌మైపోతే... ఇక ఆడియ‌న్ తెరపై మ‌న‌సు ఎలా ల‌గ్నం చేస్తాడు?  ఆఖ‌రికి ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఎక్క‌డ వేయాలి అనే విష‌యంలోనూ వీర‌భ‌ద్ర‌మ్‌కి స్ప‌ష్ట‌త లేకుండా పోయింది. 'ఇదేదో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అనుకొంటా.. జంప్ అయిపోతే మంచిది' అనే డైలాగ్ ఫృద్వీ చేత ప‌లికించారు. థియేట‌ర్లో ఆడియ‌న్ కూడా అలా అనుకొనేలా ఉంది ఈ సినిమా.

ఎందుకంటే ఫ‌స్టాఫ్‌ని ఏదోలా భ‌రించొచ్చు. కానీ సెకండాఫ్‌లో మాత్రం క‌ష్టం. చూస్తోంది సినిమానా, సీరియ‌లా? అనేది అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. తొలి స‌గంలో క‌నిపించిన న‌వ్వులు కూడా సెకండాఫ్‌లో మృగ్యం అయిపోయాయి. ఏదో సినిమా ఎలాగూ మొద‌లెట్టాం కాబ‌ట్టి... ఫినిష్ చేయాలి అన్న‌ట్టు క‌థ‌ని ప‌ట్టుకొని లాగుతుంటారు. చిల‌క పేరుతో మ‌రో హీరోయిన్‌ని దింపి.. త‌న‌ని వ్యాంప్ పాత్ర‌లా మార్చేశారు. అన్న‌పూర్ణ‌మ్మ‌తో కూడా 'మావాడికి స్టార్టింగ్ ట్ర‌బుల్‌' అంటూ డ‌బుల్ మీనిండ్ డైలాగులు వినిపించారు.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌: ఆది ఈజ్ ప‌రంగా ఓకే. ఏ స‌న్నివేశం అయినా ఒకేలా చేస్తున్నాడు. స్టెప్పులు, ఫైటింగులు వ‌ర‌కూ ఓకే. కానీ క‌థ‌ల ఎంపిక‌లో కాస్త దృష్టి పెట్టాలి.  న‌మిత ప్ర‌మోద్ గ్లామ‌ర్ ప‌రంగా, న‌ట‌న ప‌రంగా బాగా వీక్‌. ఆది ప‌క్క‌న అస్స‌లు ఆన‌లేదు. లిప్ సింక్ కూడా కుద‌ర్లేదు. సాయికుమార్ లాంటి న‌టుడు ఉన్న‌ప్పుడు ఇంటెన్సిటీ ఉన్న సన్నివేశాలు రాసుకోవాలి. కానీ.. అదేం క‌నిపించ‌లేదు. ఫృద్వీ ఒక్క‌డే కాస్త బెట‌ర్‌. ఎప్ప‌టిలా బాల‌కృష్ణ డైలాగులు చెప్పి న‌వ్వించాల‌ని చూశాడు. పోసాని కృష్ణ‌ముర‌ళి డైలాగులూ పేల‌లేదు. ఎప్ప‌డూ లౌడ్ కామెడీనే చేస్తా.. అంటే పోసానినీ అతి త్వ‌ర‌లోనే మ‌ర్చిపోవాల్సి ఉంటుంది.

టెక్నిక‌ల్ గా: త‌మ‌న్ సంగీతం ఎప్ప‌ట్లా.. స్పీడు స్పీడుగా సాగింది. ర‌బ్బా ర‌బ్బా పాట కాస్త హ‌మ్ చేసుకొనేలా ఉంది. అది మిన‌హా.. ఏ పాటా గుర్తుండ‌దు. నేప‌థ్య సంగీతం కూడా ఇష్టం లేన‌ట్టు కొట్టి పారేశాడు. కెమెరా వ‌ర్క్ బాగుంది. సీన్లు లావీష్‌గా తీశారు. ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ క‌థ‌పైనా దృష్టి పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వినోదం అంటే పంచ్‌లు రాసేసుకోవ‌డం కాద‌ని, అది క‌థ‌లో ఉండాల‌ని తెలుసుకోవాలి. సినిమా మొత్తం బాగుంటే క‌చ్చితంగా ఒక‌రిద్ద‌రి పాత్ర‌లు హైలెట్ అవుతాయి. 30 ఇయ‌ర్స్ ఫృద్వీ లాంటి పాత్ర‌నో, పోసానినో న‌మ్ముకొని సినిమాలు తీస్తే ఇలానే త‌యార‌వుతుంది.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చుట్టాలొస్తున్నారు జాగ్ర‌త్త‌!