English | Telugu
బ్యానర్:శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా
Rating:1.50
విడుదలయిన తేది:Mar 10, 2017
గీతాంజలితో హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకి తగ్గ కథానాయిక అనిపించుకొంది అంజలి. ఆ సినిమా విడుదలైన వెంటనే ఆమెని ఆ తరహా కథలు చుట్టుముట్టాయి. కథల విషయంలో మంచి అభిరుచినే కనబరిచే అంజలి `చిత్రాంగద` చేసింది. `పిల్లజమిందార్`లాంటి విజయవంతమైన సినిమాని అందించిన జి.అశోక్ దర్శకత్వం వహిస్తుండడంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది `చిత్రాంగద`. అయితే రకరకాల కారణాలతో సినిమా చాలా రోజులపాటు విడుదల కాలేదు. ఆలస్యంగానైనా ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకొచ్చిన `చిత్రాంగద` ఎలా ఉంది? అంజలి మళ్లీ `గీతాంజలి`లాగా అలరించిందా? హీరోయిన్ ఓరియెంటెడ్ కథల విషయంలో తనకి తిరుగులేదు అనిపించుకొన్నట్టేనా?
* కథ
చిత్రాంగద (అంజలి) ఓ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్. ప్యారానార్మల్ యాక్టివిటీపై రీసెర్చ్ కూడా చేస్తుంటుంది. ఆమెకి తరచుగా ఓ కల వస్తుంటుంది. అందులో ఓ వ్యక్తిని ఓ మహిళ దారుణంగా హత్య చేస్తుంది. ప్రతిసారీ వస్తున్న ఆ కల వెనక మర్మాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే ఆ కల జరిగిన ప్రదేశం అమెరికాలో ఉందని తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన చిత్ర తనకి కలలో వస్తున్న ప్రదేశాన్ని కనుక్కుంటుంది. అంతే కాకుండా... ఆ కలలో చనిపోయిన వ్యక్తి రవ వర్మ (దీపక్) అని కూడా తెలుస్తుంది. అసలు ఆ రవివర్మ ఎవరు? ఆయనకీ చిత్రాంగదకీ మధ్య సంబంధమేంటి? రవివర్మ హత్య ఎందుకు జరిగింది? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
ఎనాలసిస్ :
ఒక హత్య చుట్టూ సాగే కథ ఇది. దానికి ఆత్మ, పునర్జన్మవంటి నేపథ్యాన్ని మేళవించారు. ఈ తరహా కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలనుకోవడం పెద్ద తప్పు. కథని ఎంత పకడ్బంధీగా, ఎంత ఆసక్తికరంగా చెబితే అన్ని కమర్షియల్ అంశాలు జోడించినట్టు. కానీ దర్శకుడు ఆ విషయాన్ని మరిచిపోయి కామెడీ, హారర్, పాటలు ... అంటూ నానా హంగామా చేశాడు. దాంతో కథ ఏ దశలోనూ ఆసక్తికరంగా సాగక ప్రేక్షకుల సహనాన్ని పరీక్షలా నిలుస్తుంది. కథలో ఆసక్తి కరమైన దశ మొదలైందనుకోలేపో పంటికింద రాయిలాగా ఓ పాట వస్తుంటుంది.
దాంతో తొలి సగభాగం సన్నివేశాలు ఏ దశలోనూ రక్తికట్టించవు. ఆ సన్నివేశాల్నిబట్టి దర్శకుడు కథని రెండో సగభాగం కోసం అట్టిపెట్టుకొంటున్నాడనే విషయం అర్థమైపోతుంది. అప్పట్నుంచి విరామం ఎప్పుడొస్తుందా అని చూడటంవైపే ప్రేక్షకుడి దృష్టి ఉంటుంది. ఇక విరామం నుంచైనా అసలు కథ మొదలవుతుందనుకొంటే అక్కడ కూడా చాలాసేపు నిరీక్షించాల్సి వస్తుంది. అమెరికాలో సప్తగిరి, సుధీర్ కామెడీ కోసం చేసే హంగామాని చాలాసేపు భరించాల్సి వస్తుంది. రవివర్మ హత్య మిస్టరీ చుట్టూ సాగే అసలు పరిశోధన ఊపందుకొన్న దగ్గర్నుంచే కథ కాస్త రక్తి కడుతుంది. దర్శకుడు రాసుకొన్న కథలో కొత్తదనం ఉంది. కాకపోతే దాన్ని పకడ్బంధీ స్క్రీన్‌ప్లేతో ఒక కాన్సెప్ట్ సినిమా తరహాలో తెరకెక్కించాల్సి ఉంటుంది. దర్శకుడు మాత్రం అన్ని విషయాల్నీ ఓ కథలో చూపించేయాలన్నట్టుగా సన్నివేశాలు రాసుకొన్నారు. దాంతో మంచి థ్రిల్లర్ కథ కాస్త వృథా అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజానికి అంజలి పాత్రని ఓ ఆత్మ ఆవహిస్తున్నట్టుగా కూడా చూపించాల్సిన అవసరం లేదు.
అలా చూపించడం ద్వారా ఒరిగింది కూడా ఏమీ లేదు. దర్శకుడు మాత్రం హారర్ ఎలిమెంట్ కోసం ఆ ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఎక్కడా అతకలేదు. అంజలి ఏ దశలోనూ భయపెట్టలేకపోయింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అతకలేదు. అప్పటిదాకా రవి వర్మ పాత్రపై ఉన్న సింపథీని కూడా పోగొడుతూ ఆ సన్నివేశాలు సాగుతాయి. కథ రాసుకొనేటప్పుడే తాము ప్రేక్షకులకు ఏ జోనర్ కథని చెప్పబోతున్నామనే విషయంపై దర్శకుడికి ఓ క్లారిటీ ఉండాలి. లేదంటే మాత్రం చిత్రాంగదలాగా ఉంటుంది. అన్నిఅంశాలూ ఓ కథలో అన్నిసార్లూ ఇమిడిపోవనే విషయాల్ని దర్శకులు గమనించాలి. ఈ కథ మాత్రం కథనంలొ వైవిధ్యం చూపించుంటే `క్షణం` తరహాలో నిలబడిపోయే సత్తా ఉంది. కానీ దర్శకత్వలోపంతో ఆ కథ బూడిదలో పోసిన పన్నీరు చందంలా మారిపోయింది.
* నటీనటులు...
అంజలి నటన ఫర్వాలేదనిపిస్తుంది. కాకపోతే సినిమా మొత్తం ఆమెని చిట్టిపొట్టి డ్రెస్సుల్లోనే చూపించాలనుకోవడంలో దర్శకుడి ఆంతర్యం ఏంటో అర్థం కాదు. ప్రొఫెసర్ అంటూనే అంజలిని మిడ్డీల్లో చూపించాడు దర్శకుడు. జయప్రకాష్, రాజా రవీంద్ర, దీపక్, సింధుతులానీ.. ఇలా తెరనిండా నటులే కనిపించినా ఏ పాత్ర కూడా పెద్దగా ఎలివేట్ కాలేదు. సప్తగిరి కొన్ని సన్నివేశాల్లొ నవ్వించాడంతే.
* సాంకేతికత
సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమెరికాలో సన్నివేశాల్ని ఎఫెక్టివ్‌గా చూపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. దర్శకుడు ఇదివరకు తాను తీసిన `సుకుమారుడు` విషయంలో చేసిన తప్పే మళ్లీ చేశాడనిపిస్తోంది. కథ, మాటలు వరకు ఆయనకి మార్కులు పడతాయి. ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చిత్రాంగద... కథ పట్టుతప్పిన ఓ గాథ