Read more!

English | Telugu

సినిమా పేరు:బంపర్ ఆఫర్
బ్యానర్: వైష్ణో అకాడమీ
Rating:2.50
విడుదలయిన తేది:Oct 23, 2009
సాయి (సాయిరాం శంకర్) ఒక మెకానిక్. బాగా డబ్బుందన్న అహంకారంతో ఉండే కుటుంబం నుండి వచ్చిన ఐశ్వర్య అనే అమ్మాయితో అతనికి చిన్న గొడవ జరుగుతుంది. దానికి అపార్థం చేసుకున్న ఆ అమ్మాయి రౌడీలతో సాయిని కొట్టిస్తుంది. కానీ తర్వాత తన తప్పు తెలుసుకుని సాయితో ప్రేమలో పడుతుంది. కానీ ఐశ్వర్య తండ్రి ధనవంతుడైన వ్యాపారవేత్త అయిన సూర్యప్రకాశరావు వీరి పెళ్ళికి అంగీకరించడు. అందుకని సాయికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే తన ఆస్తిలో కనీసం పదిశాతం అన్నా సాయి సంపాదిస్తే అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తానంటాడు. కానీ ఈ బంపర్ ఆఫర్ ని సాయి అంగీకరించకుండా, సూర్యప్రకాశరావునే తన స్థాయికి దించి, అప్పుడే అతని కూతుర్ని పెళ్ళిచేసుకుంటానని తానే ఎదురు ఒక ఛాలెంజ్‍ చేస్తాడు. మరి ఒక మెకానిక్ అయిన సాయి కోటీశ్వరుణ్ణి ఎలా తన స్థాయికి తీసుకొచ్చి అతని కూతుర్ని పెళ్ళిచేసుకున్నాడు...? ఎలా తన ప్రియురాలిని దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఛాలెంజ్" సినిమా కథలోని మెయిన్ పాయింట్‍ని కొద్దిగా మార్చి ఈ కథను తయారు చేశారు ఈ చిత్ర నిర్మాత అయిన పూరీ జగన్నాథ్. ఈ సినిమాకి మాటలు కూడా తన స్టైల్లో ఆయనే వ్రాశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జయరవీంద్ర ఆయన శిష్యుడే కావటంతో ఈ సినిమా పోకడ కథ, కథనం కూడా ఆయన పద్ధతిలోనే మనకు కనపడుతుంది. దర్శకుడు జయ రవీంద్రకు చక్కని భవిష్యత్తుంది. అతని స్క్రీన్ ప్లే ఆ విషయాన్ని చెపుతుంది. అతను కూడా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. దర్శకుడిగా అతనిది తొలి చిత్రమైనా ఆ తడబాటు మనకు సినిమాలో ఎక్కడా కనపడదు. బాగా అనుభవమున్న దర్శకుడిలాగే ఈ చిత్రాన్ని తీశాడు జయరవీంద్ర. ఇక నిర్మాణపు విలువలు కూడా అవసరమైన మేరకు బాగానే ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: ఇక నటన విషయానికొస్తే హీరో సాయిరాం శంకర్ హీరోగా చక్కని నటన కనబరిచాడు. పాటల్లో, ఫైట్స్ లో అతని ప్రతిభ మనకు కనబడుతుంది. కాకపోతే సాయి పాత్రలో "ఇడియట్‍" చిత్రంలో రవితేజ పోలికలు కనబడతాయి. అందుకు ఈ చిత్రానికి కథ తయారుచేసి, మాటలు వ్రాసిన నిర్మాత పూరీ జగన్నాథ్ కారణమనుకోవాలి. హీరోయిన్ బిందుమాధవి "ఆవకాయ్ బిర్యానీ" చిత్రం కంటే ఈ చిత్రంలో నటనలో మరింత పరిణితి కనపరచింది. తన పాత్రకు పూర్తి స్థాయిలో ఆమె న్యాయం చేసింది. ఆలీ, వేణు మాధవ్ ల "మగధీర"ను పేరడీ చేసిన కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది. షాయాజీ షిండే, చంద్రమోహన్, రక్ష, కోవై సరళ తదితరులు తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. సంగీతం-: గాయకుడైన రఘు కుంచె ఈ చిత్రంతో తొలిసారిగా సంగీత దర్శకుడిగా కూడా మారాడు. ఈ చిత్రం ఆడియో ఈ చిత్రం విడుదలకు ముందే సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగున్నా , ముఖ్యంగా "ఎందుకే రమణమ్మా" అనే పాట, "మైకం కమ్మేసినాదిరో" పాటలు మాస్ కి బాగా నచ్చుతాయి. రీ-రికార్డింగ్ కూడా సందర్భోచితంగా ఉండి బాగుంది. పాటలు-: ఈ సినిమాలోని పాటలన్నీ భాస్కరభట్ల రవికుమార్ వ్రాశారు. ఇతనికి పూరీ జగన్నాథ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ప్రతి సినిమాలో ఇతను కనీసం ఒక పాటైనా రాస్తూంటాడు. ఈ సినిమాలో సింగిల్‍ కార్డు ద్వారా అన్ని పాటలూ తానే వ్రాశారు. అన్ని పాటల్లోనూ సాహిత్యం బాగున్నా ఆర్థిక మాంద్యం మీద వ్రాసిన "ఎందుకే రమణమ్మా.. పెళ్ళెందుకే రమణమ్మా" పాట పబ్లిక్ కి మరింత బాగా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ-: బాగుంది. సినిమాని నీట్ గా ఏ గందరగోళం లేకుండా చక్కగా నయనానందకరంగా మలచాడు ఈ చిత్ర కెమేరామెన్. ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో కెమేరా పనితనం బాగుంది. ఎడిటింగ్-: యమ్.ఆర్.వర్మ ఎడిటింగ్ నీట్‍గా ఉంది. అనవసరమైన షాటలు గానీ, అవసరానికి మించిన షాట్‍లు కాని లేకుండా ఎడిటింగ్ బాగుంది. కొరియోగ్రఫీ-: అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ సందర్భోచితంగా ఉండి బాగుంది. ముఖ్యంగా "ఎందుకే రమణమ్మా"పాటలో ఇంకా బాగుంది. యాక్షన్-: ఈ చిత్రంలోని అన్ని యాక్షన్ సీన్లూ బాగున్నాయి. ఈ సినిమా చూస్తే ఒక మంచి విభిన్నమైన, ఆసక్తికరమైన, మంచి సినిమా చూసిన భావన ప్రతి ప్రేక్షకుడికీ కలుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు.