Read more!

English | Telugu

సినిమా పేరు:బబుల్ గమ్
బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, భాగ్యలక్షి మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Dec 29, 2023

తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి,చైతు జొన్నలగడ్డ, హర్షవర్ధన్,బిందు చంద్రమౌళి,అనుహాసన్,కిరణ్ మచ్చా,అనన్య ఆకుల. వివా హర్ష 
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
సినిమాటోగ్రఫీ: సురేష్ రగతు
దర్శకుడు: రవికాంత్ పేరెపు 
బ్యానర్స్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, భాగ్యలక్షి మూవీస్ 
విడుదల తేదీ: డిసెంబర్ 29 

ఎంతో మంది నటులకి నటనలో ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల మనవడు, ప్రముఖ నటి నటులు  రాజీవ్ కనకాల,సుమ ల కొడుకు రోషన్ కనకాల సోలో హీరోగా పరిచయం అయిన మూవీ బబుల్ గమ్..పైగా ఈ సినిమాకి 'క్షణం', 'కృష్ణ అండ్ హిస్ లీల'ల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకుడు కావడంతో సినిమాపై అందరిలోను మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ రోజు విడుదలైన బబుల్ గమ్ ప్రేక్షుకులని ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

ఆది(రోషన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రోడు.పెద్ద డీజే గా ఎదగాలనేది అతని కోరిక. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక పబ్ లో జాను(మానస చౌదరి)ని చూసి ఆది మనసు పారేసుకుంటాడు. జాను కూడా ఆదిని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి గోవాలో శారీరకంగా కూడా ఒకటి అవుతారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో జాను ఫ్రెండ్ ఆదికి లిప్ లాక్ ఇస్తుంది. ఇది చూసిన జాను ఆదిని  ద్వేషించి అందరి ముందు బట్టలు ఊడదీసి పంపిస్తుంది. అసలు ఆదికి జాను ఫ్రెండ్ ఎందుకు ముద్దు పెట్టింది? తనని అవమానించిన జానునీ ఆది ఏం చేసాడు? అసలు చివరకి ఆది జాను ఒక్కటయ్యారా? అనేదే ఈ కథ.


ఎనాలసిస్ :

అసలు ఈ సినిమా కథనే ఒక పెద్ద విచిత్రం. సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలకి థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడు ఒక కొత్త జోనర్లో సినిమా చూస్తున్నానే అనుభూతిని పొందుతాడు. కానీ కథలో ముందుకు వెళ్లే కొద్దీ బాబోయ్ ఇదేం సినిమా అని అనుకోక మానడు. అసలు సీన్ టు సీన్ కంటిన్యూ లేకపోవడంతో పాటు చాలా సీన్లు  అర్ధం కావు. సినిమాలో ప్రేక్షకుడికి క్లియర్ గా అర్ధమయ్యేది ఏదైనా ఉందంటే అది కేవలం హీరో హీరోయిన్ లు పెట్టుకున్న ముద్దులు తప్పితే  ఇంకేం అర్ధం కావు. అసలు కథ ఎటు వైపు వెళ్తుంది అనే ఆలోచన కూడా రచయిత దర్శకుడుకి లేదు. అందుకే అంటారు ఒక మంచి కథని చెడ్డ స్క్రీన్ ప్లే తో ప్లాప్ చెయ్యవచ్చు. ఒక చెడ్డ కథ ని మంచి స్క్రీన్ ప్లే తో హిట్ చెయ్యవచ్చని. ఈ సూత్రం ఈ సినిమాతో ఇంకో సారి నిజమయ్యింది. పైగా ఈ సినిమాలో హీరో తండ్రి తల్లి పాత్రలకి తప్పించి ఏ క్యారక్టర్ కి కూడా  తాను పోషించే పాత్ర మీద  అవగాహన కూడా లేదు. రవికాంత్ పేరెపు  స్క్రిప్ట్ ని  పక్కాగా రెడీ చేసుకోలేదనే విషయం కూడా సినిమా స్క్రిప్ట్ మీద కనీస అవగాహన లేని వాళ్లకి కూడా చాలా ఈజీగా అర్ధం అవుతుంది.  

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:-

ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో పాత్ర పోషించిన రోషన్ కనకాల అయితే తన క్యారక్టర్ వరకు సూపర్ గా నటించాడు. తన రక్తంలోనే నటన ఉందనే విషయాన్ని నిరూపించాడు. సినిమా కథ ఎటు పోతున్న కూడా తను స్క్రీన్ మీద కనపడుతున్నంత సేపు ప్రేక్షకులని తన నటనతో కట్టిపడేసాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులు సినిమా  మధ్యలో ఇళ్ళకి వెళ్లకుండా ఉన్నారంటే రోషన్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. డాన్స్ లతో పాటు చిన్న చిన్న ఎక్సప్రెషన్స్ లో కూడా సూపర్ గా నటించాడు. ఇక హీరోయిన్ మానస చౌదరి కూడా చాలా క్యూట్ గా ఉండి తన క్యారక్టర్ పరిధిలో చక్కగా నటించింది. ఇంక మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. రోషన్ తల్లి తండ్రులు గా చేసిన వాళ్ళు కూడా సూపర్ గా చేసారు. 

ఇక రచన, దర్శకత్వం గురించి ఎంత తక్కువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఫోటోగ్రఫీ అయితే అసలు ఏమి బాగోలేదు. సంగీతంలో ఉన్న మెరుపులు కూడా ఏమి లేవు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టైటిల్ కి తగ్గట్టే సినిమాని బాగా సాగతీసారు. ఒక ఫుల్ బాటిల్ మందు తాగినోడు మాటలు ఎంత గందరగోళంగా ఉంటాయో ఈ బబుల్ గమ్ సినిమా కూడా అంతే గందరగోళంగా ఉండి ప్రేక్షకులకి చిరాకుని తెప్పిస్తుంది.

-అరుణాచలం