Read more!

English | Telugu

సినిమా పేరు:బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
బ్యానర్:స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌
Rating:2.00
విడుదలయిన తేది:Oct 14, 2022

సినిమా పేరు: బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
తారాగణం: విశ్వంత్, మాళవిక సతీశన్, హర్ష వర్ధన్, మధునందన్, సుదర్శన్, రాజా రవీంద్ర, శివన్నారాయణ
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి
ఎడిటర్: విజయ్ వర్ధన్
నిర్మాతలు: వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
బ్యానర్స్: స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: 14 అక్టోబర్ 2022

'కేరింత', 'మనమంతా', 'ఓ పిట్ట కథ' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన తాజా చిత్రం 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ టీజర్, ట్రైలర్ యూత్ ని ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
చిన్నప్పటి నుంచి అర్జున్(విశ్వంత్) జీవితంపై అతని బాబాయ్(హర్ష వర్ధన్) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు అవ్వడంతో అమ్మాయిలకు దూరంగా ఉండమని చిన్నప్పటి నుంచే అర్జున్ కి నూరి పోస్తుంటాడు బాబాయ్. దానికితోడు అర్జున్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా అతడు అమ్మాయిలకు దూరంగా ఉండేలా చేస్తాయి. అలాంటి అర్జున్, తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే వాళ్ళు చూసిన అమ్మాయిని కాకుండా తనకి తగ్గ జోడీని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంటాడు. తనకి ఎలాంటి అమ్మాయి కావాలి?, ఆమెలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని తెలుసుకునే క్రమంలో మంచి జాబ్ ని కూడా వదిలేసి 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'గా మారతాడు. అసలు అర్జున్ అలా ఎందుకు మారాల్సి వచ్చింది? అతనికి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికిందా? దివ్య(మాళవిక సతీశన్) ఎవరు? ఆమె రాకతో అర్జున్  జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

కుర్ర హీరోలు చిన్న సినిమాలతో వచ్చి పెద్ద విజయాలు అందుకోవడం చూస్తున్నాం. ఉదాహరణగా 'ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు'తో నవీన్ పోలిశెట్టి, 'డీజే టిల్లు'తో సిద్ధూ జొన్నలగడ్డ సాధించిన విజయాలను చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ ఆకట్టుకునేలా ఉంటే చాలు.. హీరో, డైరెక్టర్ ఎవరనేది చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కాకుండా ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని.. పేలవమైన కథనం, బలంలేని సన్నివేశాలతో సగం ఉడికి ఉడకని ఓ రెండు గంటల సినిమా తీసేసి ప్రేక్షకుల మీదకు వదిలితే ఏమాత్రం మొహమాట పడకుండా తిరస్కరిస్తారు.

'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే పాయింట్ ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది కానీ దానిని ఆసక్తికరంగా మలచడంలో రచయిత, దర్శకుడు సంతోష్ కంభంపాటి ఫెయిల్ అయ్యాడు. అసలు అమ్మాయిలు అంటే ఇష్టం లేని అర్జున్ సులభంగా పెళ్లికి ఒప్పుకోవడం, తన భాగస్వామిని వెతకడం కోసం మంచి ఉద్యోగం వదిలేసి 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'గా మారడం అనేవి అంత నమ్మశక్యంగా లేవు. పైగా ఇందులో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఛాయలు కనిపిస్తాయి. ఆ సినిమాలో కూడా హీరో సోలోగా, అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంపై అతని మావయ్య ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత తన ఆలోచన తప్పని తెలుసుకొని ప్రేమ కోసం వేట మొదలుపెడతాడు. ఇందులో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. బాబాయ్ వల్ల హీరో అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ తర్వాత పెళ్లి చేసుకోవాలని, అమ్మాయిని వెతికే క్రమంలో 'అమ్మాయిలు, ప్రేమ, పెళ్లి' విషయాల్లో తన ఆలోచనలు తప్పని తెలుసుకుంటాడు.

ఫస్ట్ హాఫ్ అంతా 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే పాయింట్ చుట్టూ తిరిగింది. సెకండాఫ్ మాత్రం 'జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్న వారిలో చూడాల్సింది క్వాలిటీస్ కాదు, ప్రేమ' అనే పాయింట్ తో నడిచింది. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న మెరుపు తప్ప ఎలాంటి మలుపులు లేకుండా సినిమా చాలా సాదాసీదాగా సాగిపోయింది. హీరో-హీరోయిన్ ల లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా లేదు. ఎంతో ఎమోషనల్ గా సాగాల్సిన సెకండాఫ్ ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా సాగలేదు. హీరోయిన్ పెయిన్ ని ఎక్కడా మనం ఫీల్ అవ్వలేము. ఇలాంటి సినిమాలకి కామెడీ కూడా ప్రధాన బలంగా నిలవాలి. కానీ ఇందులో కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు.

లవ్ స్టోరీలకు గోపీ సుందర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కానీ ఇందులో ఆయన మార్క్ కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా, గుర్తుపెట్టుకొని పాడుకునేలా ఒక్క పాట కూడా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. సాంగ్స్ పిక్చరైజేషన్ ఆకట్టుకుంది. ఎడిటర్ విజయ్ వర్ధన్ కూర్పు బాగానే ఉంది. కేవలం రెండు గంటల నిడివి ఉన్న సినిమా కూడా అక్కడక్కడా ల్యాగ్ అనిపించింది అంటే అది ఎడిటర్ తప్పు కాదు.. దర్శకుడి తప్పు. కథనం, సన్నివేశాల మీద సంతోష్ కంభంపాటి మరింత శ్రద్ధ పెట్టుంటే బాగుండేది.

నటీనటుల పనితీరు:
జీవిత భాగస్వామిని వెతికే క్రమంలో 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'గా మారిన అర్జున్ పాత్రలో విశ్వంత్ ఆకట్టుకున్నాడు. అయితే హావభావాలను పలికించడంలో అతను ఇంకా పరిణితి చెందాలి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోతున్నాడు. తన జీవిత భాగస్వామి నుంచి ప్రేమ తప్ప ఏది ఆశించని దివ్య అనే పాత్రలో మాళవిక సతీశన్ మెప్పించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె కూడా మెరుగు పడాల్సి ఉంది. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె మేకప్ కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. హర్ష వర్ధన్, మధునందన్, సుదర్శన్, రాజా రవీంద్ర, శివన్నారాయణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఎవరివీ పెద్దగా గుర్తుంచుకునే పాత్రలు కావు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే ఆలోచన బాగున్నా.. లవ్, కామెడీ, ఎమోషన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా.. అటు నవ్వించలేక, ఇటు ఏడిపించలేక ఉడికి ఉడకని కిచిడిలా తయారైంది చిత్రం. ప్రథమార్థం కొంతలోకొంత నయం అనుకున్నా, ద్వితీయార్థం మరీ నీరసంగా నడిచింది. 

-గంగసాని