Read more!

English | Telugu

సినిమా పేరు:బిల్లా
బ్యానర్:గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 27, 2009
బిల్లా (ప్రభాస్) ఒక అంతర్జాతీయ క్రిమినల్‍. మలేసియాని స్థావరంగా చేసుకుని బిల్లా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. సాహసానికి అతను మారుపేరు. ధైర్యం అతని రూపం. ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా నిబ్బరంగా ఉండగలగటం అతని ప్రత్యేకత. అలాంటి బిల్లాని పట్టుకోటానికి హైదరాబాద్‍ నుండి క్రైం బ్రాంచ్ ఎసిపి (కృష్ణంరాజు) మలేసియాకి వెళతాడు. ఎసిపి బిల్లాని పట్టుకోటానికి ప్రయత్నించిన ప్రతిసారీ బిల్లా చాలా చాకచక్యంగా తప్పించుకుపోతుంటాడు. బిల్లాకి, డెవిల్‍ ఆర్డర్లు పాస్ చేస్తుంటాడు. లీసా ( నమిత) బిల్లాకి గర్ల్ ఫ్రెండ్. బిల్లా కోసం ఇంటర్‌పోల్‍ కూడా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఇంటర్‌పోల్‍ ఆఫీసర్ ధర్మేంద్ర (రఘు) ఎసిపిని బిల్లాని పట్టుకోమని తొందరపెడుతూంటాడు. ఒకసారి ఎసిపి జరిపిన ఒక ఎటాక్‌లో బిల్లా గాయపడి చనిపోతాడు. ఎసిపి అతని శవాన్ని భద్ర పరిచి బిల్లా తప్పించుకున్నాడని కలరింగ్ ఇస్తాడు.శంకర్ (ఆలీ) అనే ఇన్ ఫార్మర్ వల్ల బిల్లానే పోలి ఉండే మనిషి ఒకడు వైజాగ్‌లో ఉన్నాడని తెలుసుకుని వైజాగ్ వెళ్ళి, రంగ (ప్రభాస్) అనే జేబుదొంగని చుస్తాడు ఎసిపి. రంగాకి పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి అతన్ని బిల్లా స్థానంలోకి పంపిస్తాడు ఎసిపి. అక్కడ రంగ బిల్లాగా మారి ఎసిపికి ఆ గ్యాంగ్ యోక్క వార్తలన్నీ చేరవేస్తుంటాడు. చివరికి ఆ గ్యాంగ్‌తో పాటు బిల్లాగా నటిస్తున్న రంగా కూడా పోలీసులకు దొరుకుతాడు. కానీ డెవిల్‍ ఎసిపిని చంపేస్తాడు. పోలీసులు, ధర్మేంద్ర కూడా రంగా చెప్పిన మాటలు నమ్మరు. చివరికి రంగా ఎలా ఆ గ్యాంగ్ నుండీ, పోలీసుల నుండీ తప్పించుకున్నాడనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
గతంలో ఇదే కథతో హిందీలో రెండుసార్లు ( అమితాబ్‍ బచ్చన్, షారూఖ్‍ ఖాన్‌‍), తమిళంలో రెండుసార్లు (రజనీకాంత్, అజిత్), తెలుగు భాషలో (యన్‌.టి.ఆర్‌‍) ఒకసారి ఇలా మూడు భాషల్లో ఐదు చిత్రాలు వచ్చాయి. అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి, తనదైన స్టైల్లో మార్చుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్‌‍. స్క్రీన్‌ప్లే బాగుంది. దర్శకత్వం బాగుంది. టేకింగ్ పరంగా, సాంకేతిక పరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తీశారు. పాత చిత్రాలతో ఈ చిత్రాన్ని పోల్చలేం. దీన్లో ప్రభాస్‌ని చూపించిన స్థాయిలో తెలుగులో మరే హీరోనీ చూపించలేదంటే అతిశయోక్తి కాదేమో. కాకపోతే ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‍ లోపించటం ఒక్కటే డ్రా బ్యాక్.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- ప్రభాస్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తాడు. అసలే ఆరడుగుల ఎత్తు. దానికి తోడు ఎయిట్‍ ప్యాక్ మస్క్యులర్ బాడీ. దానికి తగ్గ బాడీ లాంగ్యేజ్‍. ఒక డాన్‌కి కావలసిన లక్షణాలన్నీ ప్రభాస్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇక చూపు, మాట ఒక డాన్‌కి ఎలా ఉండాలో అలా ఉన్నాయి. తను నటించిన రెండు పాత్రలకూ ప్రభాస్‍ పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. కాకపోతే రంగా పాత్రలో ఇంకొంచెం హ్యుమర్ పెంచితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో గ్లామర్‌కి కొదవేం లేదు. అనుష్క, నమిత తమ తమ అందాలను పోటీపడి ప్రేక్షకులకు కనువిందు చేసేలా విచ్చలవిడిగా ప్రదర్శించారు.ఇక కృష్ణంరాజుని ఒక నటుడిగా సరిగ్గా ఉపయోగించుకోలేదేమోననిపిస్తుంది.రఘు విలన్ అనే విషయం ప్రేక్షకులకు బాగానే రీచయ్యింది. ఇది ఈ చిత్రంలో ఊహించని ట్విస్ట్. ఆలీ, జయసుధలతో పాటు మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం:- మణిశర్మ సంగీతం గొప్పగా లేకపోయినా ఫరవాలేదనిపిస్తుంది. ఆరు పాటల్లో రెండు సగటు స్థాయి పాటలు మినహా మిగిలిన పాటలన్నీ బాగానే ఉన్నాయి. ఇక రీ-రికార్డింగ్ బాగుంది. మాటలు:- ట్రస్ట్ నో వన్, కిల్‍ ఎనీ వన్, బి నంబర్ వన్ అనే మాట, అస్తాల విస్తా అనే మాటలు కొన్ని బాగున్నాయి. ఈ చిత్రంలోని మాటలు చాలా క్లుప్తంగా, సింపుల్‌గా ఉన్నాయి. పాటలు:- రామజోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో నాలుగు పాటలు వ్రాశారు. నాలుగు యూత్‌కి బాగా ఎక్కే పాటలే. ఇక భాస్కరభట్ల, దర్శకుడు మేహర్ రమేష్ వ్రాసిన పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్:- చాలా బాగుంది. చాలా షార్పగా, క్రిస్ప్ గా కట్‍ చేశారు. ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో ఎడిటింగ్ బాగుంది. యాక్షన్:- ఈ చిత్రంలోని ఛేజింగ్‌లూ, యాక్షన్ సిన్లూ, సింపుల్‍గా, చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌కి బాడీకి తగ్గ స్థాయిలో ఈ చిత్రంలోని యాక్షన్ సిన్లున్నాయి. ఈ చిత్రం యాక్షన్ చిత్రాల ప్రేమికులకు చాలా బాగుంటుంది. ఇక కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం ఎలా నచ్చుతుందో వేచి చూడాలి. అంటే అనుష్క, నమిత అత్యంత కురుచ దుస్తులతో తమ అంగాంగ ప్రదర్శన చేశారు. దీనికి తోడు తుపాకుల కాల్పులు, కార్ ఛేజింగ్‌కలూ, యాక్షన్ సీన్లూ యూత్‌ని బాగా ఆకర్షిస్తాయి. అవి ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. స్త్రీలకు, చిన్న పిల్లకు, వయోవృద్ధులకూ ఈ చిత్రం ఎంతవరకూ ఆకర్షించగలదో రెండు వారాలాగితే గానీ చెప్పలేం. కాకపోతే ఈ చిత్రంలో ఇంకొంచెం కామెడీ జొప్పిస్తే ఇంకా బాగుండేదేమోననిపించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులను గ్యారంటీగా నిరాశపరచదు.