Read more!

English | Telugu

సినిమా పేరు:బిచ్చగాడు 2
బ్యానర్:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్
Rating:2.50
విడుదలయిన తేది:May 19, 2023

సినిమా పేరు: బిచ్చగాడు-2
తారాగణం: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, యోగిబాబు, హరీష్ పేరడి, జాన్ విజయ్, రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, దేవ్ గిల్ 
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్
ఎడిటర్: విజయ్ ఆంటోని
రచన, దర్శకత్వం: విజయ్ ఆంటోని
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
బ్యానర్: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ 
విడుదల తేదీ: మే 19, 2023

ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై తెలుగునాట సంచలన విజయం సాధించిన డబ్బింగ్ సినిమాలలో 2016 లో విడుదలైన 'బిచ్చగాడు' ముందు వరుసలో ఉంటుంది. ఇందులో తల్లి సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఏడేళ్ల తర్వాత 'బిచ్చగాడు' సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఇప్పుడు 'బిచ్చగాడు-2'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పైగా ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. మరి ఈ 'బిచ్చగాడు-2' కథేంటి? ఇది 'బిచ్చగాడు' స్థాయిలో ఉందా?...

కథ:
ఇండియాలో ఉన్న అత్యంత ధనవంతుల్లో విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోని) ఒకడు. అతని ఆస్తి విలువ లక్ష కోట్లు. అయితే అతని ఆస్తిపై కన్నేసిన విజయ్ స్నేహితుడు అరవింద్(దేవ్ గిల్) ఊహించని ప్లాన్ వేస్తాడు. విజయ్ ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆస్తిని కాజేయాలని భావించిన అరవింద్.. బిజినెస్ పేరుతో దుబాయ్ తీసుకెళ్లి, కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సీక్రెట్ గా బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేపిస్తాడు. విజయ్ పోలికలతో ఉన్న సత్య(విజయ్ ఆంటోని) అనే బిచ్చగాడిని చంపేసి, అతని బ్రెయిన్ ని విజయ్ కి ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు సత్య ఎవరు? ఆతను చాలా ఏళ్ళు జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎప్పుడో చిన్నతనంలో కనిపించకుండా పోయిన తన చెల్లిని వెతుకుతున్న సత్యకి ఆమె ఆచూకీ తెలిసిందా? విజయ్ రూపంలో ఉన్న సత్య ప్రారంభించిన యాంటీ బికిలి ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

ఇది 'బిచ్చగాడు'కి కొనసాగింపు కాదు. ఆ కథకి, దీనికి సంబంధం లేదు. అయితే బిచ్చగాడు మదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగితే.. బిచ్చగాడు-2 లో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. మొదటి సినిమాలో ప్రాణాపాయంలో ఉన్న తన తల్లిని కాపాడుకోవడానికి ఒక ధనవంతుడు బిచ్చగాడిగా దీక్ష చేపడతాడు. కథ చిన్నదే అయినా దానిని ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. కానీ బిచ్చగాడు-2 ఆ విషయంలో  విఫలమైంది. సిస్టర్ సెంటిమెంట్ కి మనం పూర్తిగా కనెక్ట్ కాలేము. పైగా కథకి జోడించిన ఇతర అంశాలు.. ఇందులో అసలైన కథ ఏదనే గందరగోళాన్ని కలిగించేలా ఉన్నాయి.

బిచ్చగాడు-2 సినిమా బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి సన్నివేశాలతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అయితే చివరివరకు ఆ టెంపోని మైంటైన్ చేయడంలో రచయితగా, దర్శకుడిగా విజయ్ ఫెయిల్ అయ్యాడు. అడుగడుగునా కథనంలో తడబాటు కనిపించింది. సినిమాలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా చూస్తే ఏ పాయింట్ కి మనం పూర్తిగా కనెక్ట్ కాలేం. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎపిసోడ్, చెల్లి సెంటిమెంట్ తో సత్య ఫ్లాష్ బ్యాక్, యాంటీ బికిలి ఎపిసోడ్ ఇలా విడివిడిగా కొన్ని భాగాలు చూస్తున్నట్లు ఉంటుంది కానీ.. తెరపై ఒక పూర్తి కథను చూస్తున్న ఫీలింగ్ కలగదు. కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా ఉన్నాయి. అలా అని ఇది పూర్తిగా తీసిపారేసే సినిమా కాదు. ఇందులో మెప్పించే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా ప్రారంభ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. 'యాంటీ బికిలి' పాయింట్ కొత్తది కాకపోయినా, ఆ ఆలోచన బాగుంది. కానీ దానిని ఆకట్టుకునేలా మలచలేకపోయారు. ఒకే సినిమాలో ఎక్కువ అంశాలు చూపించాలన్న ఉద్దేశంతో మెయిన్ పాయింట్ పై పూర్తి దృష్టి పెట్టలేకపోయారు అనిపిస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో తప్పులు దొర్లాయి. రచయిత, దర్శకుడు, ఎడిటర్ అన్నీ విజయ్ నే కావడంతో దానిని గుర్తించలేకపోయినట్టున్నాడు. స్క్రీన్ ప్లే, సీన్స్ ప్లేస్ మెంట్ పై దృష్టి పెట్టుంటే మెరుగైన అవుట్ పుట్ వచ్చి ఉండేది.

సంగీత దర్శకుడిగానూ విజయ్ ఆంటోని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. పాటల్లో 'చెల్లి వినవే' మాత్రమే ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం పరవాలేదు. ఓం నారాయణ్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.. కానీ వీఎఫ్ఎక్స్ తేలిపోయింది.  

నటీనటుల పనితీరు:
ధనవంతుడు విజయ్ గురుమూర్తిగా, పేదవాడు సత్యగా రెండు విభిన్న పాత్రల్లో విజయ్ ఆంటోని ఒదిగిపోయాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో సత్య లుక్ సహజంగా లేదు. విజయ్ మాత్రం తన నటనతో రాణించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. హీరోయిన్ కావ్య థాపర్ ఓ పాట, కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. క్లైమాక్స్ తప్ప నటనకు ఆస్కారమున్న సన్నివేశాలే ఆమెకు పడలేదు. విజయ్ గురుమూర్తి ఆస్తిని కొట్టేయడానికి బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి తెరదీసిన అరవింద్ అనే నెగిటివ్ రోల్ లో దేవ్ గిల్ ఆకట్టుకున్నాడు. అరవింద్ కుట్రలో భాగస్వాములుగా హరీష్ పేరడి, జాన్ విజయ్ రాణించారు. మోడ్రెన్ బెగ్గర్ గా యోగిబాబు, ముఖ్యమంత్రిగా రాధా రవి పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

బిచ్చగాడు స్థాయిలో ఉంటుందనే అంచనాలతో వెళ్తే నిరాశచెందుతారు. బిచ్చగాడులో తల్లి సెంటిమెంట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయినంతగా.. బిచ్చగాడు-2 లో చెల్లి సెంటిమెంట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ కాలేము. ఎంచుకున్న కథ, కొన్ని కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఎక్కువ హంగులు జోడించి కథను గందరగోళం చేయడం, కథనంలో తడబాటు కారణంగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పరవాలేదు అనిపిస్తుంది. 

 

-గంగసాని