Read more!

English | Telugu

సినిమా పేరు:భువన విజయమ్
బ్యానర్:హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా
Rating:2.25
విడుదలయిన తేది:May 12, 2023

సినిమా పేరు: భువన విజయమ్
తారాగణం: సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, ధనరాజ్, గోపరాజు రమణ, వైవా హర్ష, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, రాజ్ తిరందాసు, వాసంతి కృష్ణన్, సత్తిపండు, షేకింగ్ శేషు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: సాయి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
నిర్మాతలు: ఉదయ్ కిరణ్, శ్రీకాంత్
రచన, దర్శకత్వం: యలమంద చరణ్
బ్యానర్స్: హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా
విడుదల తేదీ: మే 12, 2023 

కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల, ఈ సినిమాలో ఏదో విషయం ఉంది అనుకునేలా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'భువన విజయమ్'. పైగా ఇందులో పలువురు ప్రముఖ కమెడియన్లు నటించడంతో ఎంటర్టైన్మెంట్ కి డోకా ఉండదనే అభిప్రాయం కలిగింది. మరి ఈ 'భువన విజయమ్' నిజంగానే వినోదాన్ని పంచి, విజయాన్ని అందుకునేలా ఉందా?...

కథ:

ఆటో డ్రైవర్ గా పనిచేసే యాదగిరి(ధనరాజ్) చనిపోవడంతో అతని ఆత్మని తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు భూమ్మీదకు వస్తారు. అయితే చిత్రగుప్తుని ఆజ్ఞ మేరకు, మరికొద్ది గంటల్లో మరో వ్యక్తి కూడా చనిపోతాడని తెలిసి, ఒకేసారి రెండు ఆత్మలను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో.. యాదగిరి ఆత్మని వెంటబెట్టుకొని యమదూతలు ఓ చోటుకి వెళ్తారు. అది ఒక పెద్ద నిర్మాత చలపతి(గోపరాజు రమణ)కి చెందిన మూవీ ఆఫీస్. తాను నిర్మించిన సినిమాలతో బిగ్ స్టార్ గా మారిన ప్రీతమ్ కుమార్(సునీల్)తో మరో సినిమాని ప్లాన్ చేస్తాడు నిర్మాత చలపతి. జాతకాల పిచ్చి ఉన్న ఆయన.. తన గురువుగారు చెప్పిన టైం లోగా హీరోకి అడ్వాన్స్ ఇచ్చి, కథ లాక్ అయ్యి అగ్రిమెంట్ లు జరిగిపోవాలని, లేకపోతే ఈ ఏడాది అసలు సినిమా చేయకూడదని నిర్ణయించుకుంటాడు. దాంతో కథలు వినడానికి రచయితలను పిలుస్తారు. మొత్తం ఏడుగురు రైటర్స్ కథలు చెప్తారు. అందులో చలపతి కారు డ్రైవర్ తో పాటు, అనుకోకుండా రైటర్ గా మారిన దొంగ కూడా ఉంటాడు. అయితే ఆ ఏడుగురు చెప్పిన కథలు చలపతికి నచ్చడంతో.. "కథలన్నీ నాకు నచ్చాయి. ఏ కథను ఎంపిక చేయాలో అర్థం కావట్లేదు. మీలో మీరు చర్చించుకొని ఒక కథని ఎంపిక చేయండి. ఆ కథ ఎవరిదో వారికి పది లక్షలిచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను" అని చెప్తాడు. దీంతో రచయితలంతా అదే ఆఫీస్ లో ఉన్న భువనవిజయం అనే గదిలోకి ప్రవేశిస్తారు. అయితే వారందరిలోనూ డ్రైవర్ కి ఆ డబ్బు ఎంతో అవసరం. అతని కూతురు చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఉంది. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే 8 లక్షలు ఖర్చవుతుంది. మరోవైపు ఈ ఏడుగురు రైటర్స్ లో ఒకరు చనిపోతారని, ఆ ఆత్మని మనతో పాటు తీసుకెళ్తామని యాదగిరితో యమదూతలు చెప్తారు. ఆ ఏడుగురిలో చనిపోయేది ఎవరు? డ్రైవర్ తన కూతురిని బతికించుకోగలిగాడా? నిర్మాత చలపతి, ప్రీతమ్ కుమార్ ని కాదని వేరే హీరోతో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

శ్రీ కృష్ణదేవ రాయలు ఆస్థానం భువనవిజయంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు. అలాగే ఈ 'భువన విజయమ్'లో కూడా ఎనిమిది మంది రచయితలు ఉన్నట్టు ప్రచార చిత్రాల్లో చూపించారు. కానీ సినిమాలో టెక్నికల్ గా చూస్తే ఏడుగురే ఉన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా కనిపించిన వెన్నెల కిషోర్ పాత్రను రచయితగా పరిగణించలేము. ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు ఎంచుకున్న కథాంశం పూర్తిగా కొత్తది కాకపోయినా.. దానిని సినిమా సెటప్ తో కొంచెం కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో అతను కొంతవరకే సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమాలో దాదాపు అన్ని ముఖ్య పాత్రల్లోనూ ప్రముఖ కమెడియన్లు నటించారు. స్క్రీన్ మీద అంతమంది కమెడియన్స్ ఉంటే ప్రేక్షకులు కామెడీని ఓ రేంజ్ లో ఆశిస్తారు. అయితే అక్కడక్కడా కొన్ని నవ్వులు తప్ప నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలచలేకపోయారు. ఇక ఈ సినిమాకి అత్యంత కీలకమైన, భువనవిజయంలో కథ ఎంపిక చేసే ఎపిసోడ్ తోనూ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. కామెడీకి ఎంతో స్కోప్ ఉన్నా అంతగా వినోదాన్ని పంచలేకపోయారు. ఫస్టాఫ్ లో ఆ ఎపిసోడ్ సోసోగా సాగింది. సెకండాఫ్ లో టాస్క్ లతో కొంతవరకు పరవాలేదు అనిపించింది. అయితే ఒకే లొకేషన్ లో ఆర్టిస్ట్ లను పెట్టి, తెర ముందు కూర్చున్న ఆడియన్స్ ను కదలకుండా చేయాలంటే అంతకుమించిన వినోదాన్ని అందించాలి.

సునీల్ ట్రాక్ కూడా అంత సంతృప్తిని ఇవ్వదు. సినిమాలో స్టార్ హీరోగా కనిపించిన అతను షూటింగ్ లో తలకు దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోవడం, కర్రతో కొడితే నార్మల్ అవ్వడం వంటి సన్నివేశాలు మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయి. ఈ సినిమాలో అంతోఇంతో వెన్నెల కిషోర్ ట్రాక్ నయం. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సినిమా అంతా ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. సినిమాలో ఎక్కడా ఊహించని మలుపులు ఉండవు. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ఉంటుంది. అయితే ప్రీక్లైమాక్స్ లో కూతురుని రక్షించుకోవడం కోసం రైటర్ కమ్ డ్రైవర్ వేదన పడే సన్నివేశాలు మెప్పిస్తాయి.

రెండు గంటలలోపే నిడివి ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చే ప్రధానాంశం. సినిమాలో చాలా సన్నివేశాలను ట్రిమ్ చేసినట్టున్నారు. ప్రచార చిత్రాల్లో కనిపించిన అనంత్, రాకెట్ రాఘవ వంటి నటుల సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. ఈ సినిమాలో పాటలు లేవు. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, సాయి కెమెరా పనితనం ఆకట్టుకున్నాయి. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఏమాత్రం మొహమాటం లేకుండా పలు సన్నివేశాలకు కోత పెట్టినట్టున్నారు. అయితే కొన్ని కొన్ని పాత్రలు అర్థాంతరంగా మాయమైనట్లున్నాయి.

నటీనటుల పనితీరు:

స్టార్ హీరో ప్రీతమ్ కుమార్ అనే గజినీ తరహా పాత్రలో సునీల్ ఆకట్టుకున్నాడు. తనకు బాగా తెలిసిన వాళ్ళకి కూడా మర్చిపోయి ఎవరు మీరు? అని అడిగే రోల్ లో బాగానే అలరించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి పాత్రలో కనిపించిన వెన్నెల కిషోర్ ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ఉన్నంతలో బాగానే నవ్వించాడు. శతాధిక చిత్రాల రచయిత సాంబమూర్తి పాత్రలో పృథ్వీరాజ్, అతని వద్ద శిష్యుడిగా పనిచేసి రచయితగా మారిన ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, దొంగ నుంచి అనుకోకుండా రైటర్ గా మారిన గంగులు పాత్రలో వైవా హర్ష రాణించారు. ధనరాజ్, గోపరాజు రమణ, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, రాజ్ తిరందాసు, సత్తిపండు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. వాసంతి కృష్ణన్, షేకింగ్ శేషు జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఎందరో ప్రముఖ కమెడియన్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా మాత్రమే నవ్వించగలిగే 'భువన విజయమ్' చిత్రాన్ని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒక్కసారి చూసేయొచ్చు.

 

-గంగసాని