Read more!

English | Telugu

సినిమా పేరు:భూతద్దం భాస్కర్ నారాయణ
బ్యానర్:మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగా ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Mar 1, 2024

సినిమా పేరు: భూతద్దం భాస్కర్ నారాయణ
తారాగణం: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, వెంకటేష్, సురభి 
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డీఓపీ: గౌతమ్
ఎడిటర్: గ్యారీ
రచన, దర్శకత్వం: పురుషోత్తం రాజ్
నిర్మాతలు: స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముదుంబి
విడుదల తేదీ: మార్చి 1, 2024

తెలుగులో అరుదుగా వచ్చే డిటెక్టివ్ సినిమాల పట్ల ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తుంటారు. ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఇటీవల ప్రచార చిత్రాలతో ఆ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన డిటెక్టివ్ చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. పురాణాలను ముడిపెడుతూ రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో మహిళలను హత్య చేసి, వారి తల స్థానంలో దిష్టి బొమ్మను పెడుతుంటారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఈ కేసు పోలీసులకి సవాలుగా మారుతుంది. ఎంత ప్రయత్నించినా హంతకుడు ఎవరనేది కనిపెట్టలేకపోతారు. అలాంటి కేసుని సాల్వ్ చేయడం కోసం చిన్నప్పటి నుండి డిటెక్టివ్ కావాలని కలలు కనే లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఒక్క క్లూ కూడా దొరకని క్లిష్టమైన ఆ కేసుని భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించగలిగాడు?. అసలు ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు పెట్టడానికి కారణమేంటి? ఈ కథకి పురాణాలతో ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

మామూలుగానే డిటెక్టివ్ సినిమాలు.. ఒక కేసు, దాని చుట్టూ అల్లుకున్న చిక్కుముడులతో ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆ డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెడితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. 'భూతద్దం భాస్కర్ నారాయణ' విషయంలో అదే జరిగింది. పురాణాలను ముడిపెడుతూ క్రైమ్ థ్రిల్లర్ ను తీయాలన్న దర్శకుడు ఆలోచనను ముందుగా అభినందించాలి.

హీరో పాత్రని పరిచయం చేస్తూ సినిమా సరదాగా ప్రారంభమవుతుంది. లవ్, కామెడీ సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక దిష్టిబొమ్మ హత్యల కేసు మొదలయ్యాక సినిమా సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. హత్యలు చేస్తున్నది ఎవరు అనే సస్పెన్స్ ని చివరివరకు మెయింటైన్ చేస్తూ.. ప్రేక్షకులకు క్యూరియాసిటీ కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. 

ఈ సినిమా కోసం దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేశాడని అర్థమవుతోంది. కథలోని పురాణం నేపథ్యం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ, సెకండాఫ్ అక్కడక్కడా సినిమాటిక్ గా అనిపించినప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గౌతమ్ జార్జ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు పనితీరు:
డిటెక్టివ్ భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి చక్కగా ఒదిగిపోయాడు. తన సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు. రిపోర్టర్ లక్ష్మిగా రాశి సింగ్ మెప్పించింది. దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

క్రైమ్ థ్రిల్లర్ కథను పురాణాలకు ముడిపెడుతూ రూపొందిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీ మెప్పించింది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.