Read more!

English | Telugu

సినిమా పేరు:భీమదేవరపల్లి బ్రాంచి
బ్యానర్:ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jun 23, 2023

సినిమా పేరు: భీమదేవరపల్లి బ్రాంచి
తారాగణం: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న, అభిరామ్, రూప శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, గడ్డం నవీన్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రాఫర్: కె. చిట్టిబాబు
ఆర్ట్: టి. మోహన్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
రచన, దర్శకత్వం: రమేష్‌ చెప్పాల
నిర్మాతలు: బత్తిని కీర్తిలత, రాజా నరేందర్‌ చెట్లపెల్లి
బ్యానర్స్: ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూన్ 23, 2023 

ఈమధ్య కాలంలో 'బలగం' తర్వాత ఆ స్థాయిలో మ్యాజిక్ చేయగలదేమో అనిపించిన సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్ చూడగానే మంచి విషయముంది అనిపించడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మరో 'బలగం' అవుతుందా?...

కథ:
ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడిన ఒక ఊరి కథ ఇది. ప్రభుత్వం అందరికీ జీరో అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించడంతో.. త్వరలో కేంద్రం ఇస్తానన్న రూ.15 లక్షలు అకౌంట్స్ లో వేయబోతున్నారని సంబరపడుతూ 'భీమదేవరపల్లి బ్రాంచి'కి క్యూ కడతారు ఆ ఊరి ప్రజలు. అందులో జంపన్న(అంజి వల్గుమాన్) కుటుంబం కూడా ఉంది. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన జంపన్న డప్పు కొట్టి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఆ సంపాదన సరిపోక ఊరిలో అప్పులు చేసి, అవి తీర్చలేక అందరిచేత మాటలు పడుతుంటాడు. అలాంటి సమయంలో జీరో అకౌంట్స్ న్యూస్ తెలుసుకొని, సర్కారు డబ్బులేస్తే తన కష్టాలు తీరిపోతాయని ఆశ పడతాడు. అందుకే బ్యాంక్ కి వెళ్లి తనతో పాటు తన తల్లికి, భార్యకి కూడా అకౌంట్స్ తీసుకుంటాడు. అలా అకౌంట్స్ తీసుకున్న కొద్దిరోజులకే జంపన్న తల్లి అకౌంట్ లో రూ.15 లక్షలు పడినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులు ప్రభుత్వం వేసిందని భావించిన జంపన్న వెనక ముందు ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. తనకున్న అప్పులను టిప్పులిచ్చి మరీ తీరుస్తాడు. తల్లి వారిస్తున్నా వినకుండా భార్యాభర్తలిద్దరూ పోటీపడి మరీ ఖర్చు చేస్తారు. దానికితోడు వ్యాపారం పేరుతో మోసపోయి జంపన్న చాలా డబ్బులు పోగొట్టుకుంటాడు. అకౌంట్ లో పడిన రూ.15 లక్షలు పూర్తిగా అయిపోయాక.. అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి "అవి ప్రభుత్వం వేసిన డబ్బులు కావు. వేరే అకౌంట్ లో పడాల్సిన డబ్బులు పొరపాటున మీ అకౌంట్ లో పడ్డాయి. రేపటికల్లా ఆ 15 లక్షలు కట్టండి. లేదంటే జైలుకెళ్తారు" అని చెప్పి షాకిస్తారు. దీంతో జంపన్న జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. ఆ 15 లక్షలు కోసం జంపన్న కుటుంబం ఏం చేసింది? వాళ్ళు అంత డబ్బు కట్టగలిగారా? లేక జైలుకెళ్లారా? జంపన్న లాగే 15 లక్షల కోసం ఆశపడిన ఆ ఊరిలోని మిగతా ప్రజల కథలేంటి? తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రమేష్‌ చెప్పాల ఎంచుకున్న కథాంశం బాగుంది. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్న రాజకీయ నాయకులకు, ఆ ఉచితాలకు అలవాటు పడిపోయిన ప్రజలను ప్రశ్నించేలా ఉంది ఈ చిత్రం. పిల్లలకు పౌష్టికాహారం అందించడం వంటి మంచి పథకాలు వరకు ఓకే కానీ, ఓట్ల కోసం ప్రజలకు సోమరిపోతులను చేసే పథకాలు ఇవ్వడం సరికాదనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పడంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు.

ప్రథమార్ధాన్ని ఎక్కువగా కామెడీతో నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. జంపన్న కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, అకౌంట్ లో డబ్బు పడగానే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం బాగానే నడిచింది. అయితే కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపించాయి. ఇలా వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాలు ఎంత సహజంగా ఉంటే అంత బాగుంటాయి. కానీ ఆ విషయాన్ని దర్శకుడు కొన్నిచోట్ల మరిచినట్లు అనిపించింది. ద్వితీయార్థంలో కంటతడి పెట్టించే స్థాయిలో భావోద్వేగాలు పండించే ఆస్కారముంది. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంతవరకే విజయం సాధించాడు. ఈ సినిమాలో జంపన్న కథకి సమాంతరంగా ఒక ప్రేమ కథ జరుగుతుంది. అయితే ఆ ప్రేమ కథ అంతగా ఆకట్టుకునేలా లేదు. పైగా ప్రేమ కథ కారణంగా, ఊరిలోని ఇతర జనాల ట్రాక్ కారణంగా జంపన్న కథకి పూర్తిగా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతామనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మెప్పించాయి. సినిమాని ముగించిన తీరు బాగుంది.

చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతాన్ని ఇవ్వలేదు కానీ సినిమాకి అవసరమైన మేర బాగానే ఇచ్చాడు. సినిమా చూస్తున్నప్పుడు పాటలు వినసొంపుగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా పరవాలేదు. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె వాతావరణాన్ని తన కెమెరా కంటితో చక్కగా చూపించాడు. బొంతల నాగేశ్వర రెడ్డి కూర్పు బాగానే కుదిరింది. ఊరిలోని ఇతరుల సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేయొచ్చు అనిపించింది. నిర్మాణ విలువలు పరవాలేదు. సినిమాకి అవసరమైన మేర ఖర్చు చేశారు.

నటీనటుల పనితీరు:
అకౌంట్ లో డబ్బు పడగానే మనల్ని మించినోడు లేడని ఖర్చు పెట్టి, అవి తిరిగి కట్టాలని తెలిశాక కన్నీళ్లు పెట్టుకునే అమాయకుడైన జంపన్న పాత్రలో అంజి వల్గుమాన్ చక్కగా ఒదిగిపోయాడు. అతను ఎంత అమాయకుడంటే.. మా అమ్మ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, అలాగే నా అకౌంట్ లో, నా భార్య అకౌంట్ లో డబ్బులు వేయండని ప్రధానికి లేఖ రాసే అంత అమాయకుడు. మూత్ర, మలవిసర్జనతో నిండిపోయిన బావిని చూపించి, పెట్రోల్ బావి అని చెప్తే నమ్మి కొనుక్కునేంత అమాయకుడు. అలాంటి అమాయకమైన జంపన్న పాత్రకు అంజి వల్గుమాన్ పూర్తి న్యాయం చేశాడు. ప్రేమ జంట అభి-కావేరిగా అభిరామ్, రూప.. జంపన్న భార్య స్వరూపగా సాయి ప్రసన్న, లేట్ వయసులో పెళ్లి కోసం కలలు కనే వ్యక్తిగా సుధాకర్ రెడ్డి, లింగం పాత్రలో గడ్డం నవీన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, జేడీ లక్ష్మీ నారాయణ, అద్దంకి దయాకర్ అతిథి పాత్రల్లో మెరిశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్న ఉచితాల మీద సెటైర్ వేస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా ఎంచుకున్న కథాంశం బాగుంది. అసలు ఇలాంటి కథ ఎంచుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని.. ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో ఆలోచన కలిగించాలని చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. అక్కడక్కడా తప్పులు దొర్లినా.. వాటిని చూసి చూడనట్టు వదిలేసి సినిమాని హ్యాపీగా ఒక్కసారి చూసేయొచ్చు.

-గంగసాని