English | Telugu
బ్యానర్:విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శ్రవంత్ రామ్ క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 19, 2025
నటీనటులు: విజయ్ ఆంటోని, సునీల్ కృపలాని, కణ్ణన్, వాగై చంద్రశేఖర్, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: షెల్లీ ఆర్.కాలిస్ట్
ఎడిటింగ్: రేమండ్ డెర్రిక్ క్రాస్టా దిన్‌సా
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
బ్యానర్: విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్
రచన, దర్శకత్వం: అరుణ్ ప్రభు
విడుదల తేదీ: 19.09.2025
ప్రస్తుతం ఉన్న తమిళ హీరోల్లో విజయ్ ఆంటోనికి తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతని సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇటీవల విడుదలైన ‘మార్గన్’ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా విజయ్ ఆంటోని ప్రొడక్షన్ నుంచి తమిళ్‌లో వచ్చిన ‘శక్తి తిరుమగన్’ చిత్రాన్ని తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో విడుదల చేశారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోని 25వ సినిమాగా విడుదలైన ‘భద్రకాళి’ ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.
కథ :
సెక్రటరియేట్‌లో పవర్ బ్రోకర్‌గా పేరు తెచ్చుకున్న కిట్టు(విజయ్ ఆంటోని) ఎలాంటి పనినైనా ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తాడు. మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వంలోని కీలక పదవుల్లో వున్న వారిని ఉపయోగించుకొని పని చక్కబెడతాడు. అలాంటి కిట్టు.. ఒక సందర్భంలో కేంద్ర మంత్రికి సంబంధించిన 800 కోట్ల భూ లావాదేవీని టేకప్ చేస్తాడు. పని సక్రమంగానే పూర్తవుతుందనుకుంటున్న తరుణంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవుతుంది. ఇది ఎలా జరిగింది అని తెలుసుకునే క్రమంలో కేంద్ర మంత్రికి షాకింగ్ విషయాలు తెలుస్త్తాయి. ఇదంతా కిట్టు చేసిన పనేనని తెలుసుకొని షాక్ అవుతుంది. ఇలాంటి పైరవీలు చేయడం ద్వారా అక్రమంగా 6 వేల కోట్లకు పైగా కిట్టు సంపాదించాడని తెలుస్తుంది. అంతేకాదు, రాష్ట్రపతి అవ్వాలని ప్రయత్నిస్తున్న అభయంకర్ అనే వ్యక్తిని అడ్డుకుంటూ ఉంటాడు. అతనే కిట్టుపై 100 కేసులు పెట్టి జైలుకి పంపిస్తాడు. వీరిద్దరి మధ్య ఉన్న విరోధం ఏమిటి, అక్రమంగా కిట్టు వేల కోట్లు ఎందుకు సంపాదించాడు? అసలు అతని వ్యూహం ఏమిటి? చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఇది పూర్తిగా పొలిటికల్ అంశాలతో రూపొందిన సినిమా. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఎప్పటికప్పుడు వాటిని ఎనాలసిస్ చేసే వారికి సినిమా అర్థమవుతుంది. సాధారణ ప్రేక్షకులు ఈ కథలో ఇన్‌వాల్వ్ అయ్యే అవకాశాలు తక్కువ. వేల కోట్లు సంపాదించిన కిట్టు వాటిని ఏం చేస్తున్నాడు అనేది చాలా సినిమాల్లో చూపించినట్టుగానే రాబిన్‌హుడ్‌లా పేదలకు పంచిపెడుతుంటాడు. అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించదు. ఇక కిట్టు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? అతని ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న విషాదం ఏమిటి అనేది అన్ని సినిమాల్లో మాదిరిగానే ఉన్నప్పటికీ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. ఫస్ట్‌హాఫ్ ఇంటెలిజెంట్‌గా, గ్రిప్పింగ్‌గా అనిపించినా ఒకే పాయింట్ మీద సినిమా రన్ అవ్వడం ఆడియన్స్‌కి బోర్ కొట్టిస్తుంది. సెకండాఫ్ కొంత స్లో నేరేషన్‌లో నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కష్టం మీద లాక్కెళ్లినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డైలాగుల మోతాదు, ఫ్లాష్‌బ్యాక్ నిడివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
నటీనటులు:
కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని ఫర్వాలేదు అనిపించాడు. అతని పెర్‌ఫార్మెన్స్ ఏ సినిమాలోనైనా సెటిల్డ్‌గానే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. అయితే ఉన్నంతలో తన పాత్రకు నాయ్యం చేసేందుకు ప్రయత్నించారు. విలన్ పాత్రలో సునీల్ కృపలానీ, మారుతిగా సెల్ మురుగన్ పాత్రలు పర్వాలేదనిపించారు. అయితే హీరోయిన్‌కి సినిమాలో అంత ప్రాధాన్యం లేదు.
సాంకేతిక నిపుణులు :
ఈ సినిమాకి విజయ్ ఆంటోని అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. కానీ, కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపించడం, మ్యూజిక్‌కి తగ్గ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించినా దానికి తగినట్టుగా ఎడిటింగ్‌ను షార్ప్‌గా చేయడంలో టెక్నీషియన్స్ రాణించలేకపోయారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇదొక పొలిటికల్ రివెంజ్ డ్రామా. డైరెక్టర్ ఎంపిక చేసుకున్న పాయింట్ మంచిదే అయినా అది అందరికీ రీచ్ అయ్యే అవకాశం లేదనే విషయం సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. అయినప్పటికీ ఫస్ట్‌హాఫ్ కాస్త గ్రిప్పింగ్‌గా ఉండడం వల్ల ప్రేక్షకులు సినిమాను చూడగలిగారు. సెకండాఫ్‌కి వచ్చే సరికి కథను ముందుకు తీసుకెళ్ళడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే అవకాశం ఉంది.