Read more!

English | Telugu

సినిమా పేరు:భాగ్ సాలే
బ్యానర్:వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 7, 2023

సినిమా పేరు: భాగ్ సాలే
తారాగణం: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, సుదర్శన్, వైవా హర్ష, సత్యా, వర్ష సౌందరాజన్, నందిని రాయ్, సంజయ్ స్వరూప్, అపూర్వ
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: రమేశ్ కుషేందర్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైన్: శ్రుతి నూకల
నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, శింగనమల కల్యాణ్
రచన-దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
బ్యానర్స్: వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్
విడుదల తేదీ: 7 జూలై 2023

'మత్తు వదలరా' లాంటి జనాదరణ పొందిన సినిమాతో హీరోగా పరిచయమైన కీరవాణి గారబ్బాయి శ్రీసింహా.. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు.. 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు 'భాగ్ సాలే' అనే ఆసక్తికర టైటిల్‌తో మన ముందుకొచ్చాడు. అతని అన్న కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ సినిమాతో ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా పరిచయమయ్యాడు.

కథ
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అర్జున్ (శ్రీసింహా) తన అసలు ఐడెంటిటీని దాచిపెట్టి, తాను బాగా రిచ్ అని నమ్మించి, సంపన్న కుటుంబానికి చెందిన మాయ (నేహా సోలంకి)తో ప్రేమ వ్యవహారం నడుపుతాడు. ఒకప్పుడు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసి, తర్వాత సినీ నటిగా మారిన నళిని (నందినీ రాయ్) కోసం ఒక అరుదైన వజ్రం పొదిగిన ఉంగరం అన్వేషణలో ఉన్న శామ్యూల్ (జాన్ విజయ్)కు అది మాయ తండ్రి దగ్గర ఉందని తెలిసి, తన గ్యాంగ్‌తో వాళ్ల ఇంటిపై దాడిచేసి, మాయతో అసభ్యంగా ప్రవర్తించి, ఆ రింగు తెచ్చిస్తేనే తండ్రిని విడిచిపెడతామని ఆయనను కిడ్నాప్ చేసి తీసుకుపోతారు. మాయ కోసం శామ్యూల్ గ్యాంగ్‌తో తలపడతాడు అర్జున్. ఈ క్రమంలో అర్జున్ ఎవరో మాయకు తెలిసిపోతుంది. దాంతో ఆమె ఏం చేసింది? శామ్యూల్ చేసే నేరాలకు కారణభూతమైన రింగు కథేమిటి? మాయ ప్రేమ కోసం ఎన్నో తప్పులు చేసిన అర్జున్ చివరకు రియలైజ్ అయ్యాడా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

'భాగ్ సాలే' సినిమాలో రెండు కథలు మిళితమై ఉన్నాయి. ఒకటి- అర్జున్, మాయ ప్రేమకథ. ఇంకొకటి- రింగు సంపాదించి, తద్వారా నళినిని పొందాలనుకొనే శామ్యూల్ కథ. డబ్బున్న అమ్మాయి మాయను అర్జున్ ఎలా, ఎప్పుడు ప్రేమలో దించాడో మనకు తెలీది కానీ, తనది రాయల్ ఫ్యామిలీ అని మాయను నమ్మించడానికి అర్జున్ పదే పదే చెప్పే అబద్ధాలు, ప్రేమ పేరుతో చేసే మోసాలు మొదట్లో వినోదాన్ని పంచినా రాను రాను అతడి అబద్ధాలు, చేష్టలు విసుగు పుట్టిస్తాయి. దాంతో మనం అతడితో సహానుభూతి చెందలేం. ప్రేమ కోసం అతడు పడే పాట్లు మనవి ఎప్పుడు కాకుండా పోయాయో.. అప్పుడు అతడి క్యారెక్టర్‌తోనూ మనం డిటాచ్ అయిపోతాం. 

అర్జున్ ప్రేమలోని నిజాయితీతో పోలిస్తే.. నళిని ప్రేమ కోసం శామ్యూల్ చేసే దాష్టీకాల్లో ఎక్కువ నిజాయితీ కనిపించడం గమనార్హం. రింగు సంపాదించడానికి తన గ్యాంగ్‌తో అతడు చేసే నేరాల్లోనూ మనకు వినోదం లభిస్తుంది. అతడి బావమరిది జాక్సన్ (వైవా హర్ష) క్యారెక్టర్ ఈ వినోదాన్ని పంచుతుంది. కొన్ని కొన్ని సీన్లలో డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది. నళినిని తండ్రితో కలిసి అర్జున్ కిడ్నాప్ చేసే సీన్ వీటిలో ఒకటి. అలాగే 'భగవద్గీత'ను కథలో అతను ఉపయోగించుకున్న తీరు కూడా బాగుంది. హీరో అర్జున్ క్యారెక్టర్ కంటే విలన్ శామ్యూల్ క్యారెక్టర్ ఎక్కువ ఎఫెక్టివ్‌గా రావడం ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా సినిమాకి నష్టం కలిగించే అంశం. 

సెకండాఫ్‌లో ఇన్‌స్పెక్టర్ ప్రామిస్ రెడ్డి క్యారెక్టర్‌లో సత్యాను ప్రవేశపెట్టడం, భార్య (వర్షా సౌందరాజన్) కంటే పనిమనిషితోటే అతడికి అనుబంధం ఎక్కువ అన్నట్లు చూపడం లాంటి అడల్ట్ కామెడీ కొంతమేర సినిమాకు వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. సినిమాలో ద్వంద్వార్థ సంభాషణలు, సగం బూతు పదాలను బాగానే వాడారు. 

కాలభైరవ సంగీతం సినిమాకు ఎస్సెట్ అనలేము కానీ, బాగానే కుదిరింది. పాటలు ఓ మోస్తరుగా ఆకట్టుకోగా, బీజీఎం సందర్భోచితంగా సాగింది. రమేశ్ కుషేందర్ సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. ప్రధానంగా ఒక రింగు చుట్టూ నడిచే ఈ రెండు గంటల నిడివి సినిమా కూడా పలుచోట్ల విసుగు పుట్టించిందంటే.. దానికి కారణం.. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ లోపాలు. 

నటీనటుల పనితీరు
అర్జున్ పాత్రలో శ్రీసింహా రాణించాడు. మునుపటితో పోలిస్తే అతని నటనలో మరింత పరిణతి, మరింత ఈజ్ కనిపించాయి. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ పాత్ర కావడంతో సునాయాసంగా అందులో ఇమిడిపోయాడు. శామ్యూల్ క్యారెక్టర్‌కి జాన్ విజయ్ అతికినట్లు సరిపోయాడు. చక్కని అభినయం ప్రదర్శించడంతో పాటు వినోదాన్నీ పంచాడు. హీరోయిన్ మాయ పాత్రలో నేహా సోలంకి బాగానే ఉంది. జాక్సన్‌గా వైవా హర్ష, కిట్టుగా సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ ప్రామిస్ రెడ్డిగా సత్యా వినోదాన్ని పంచారు. అర్జున్ తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల, నళినిగా నందినీ రాయ్, రమగా వర్ష పాత్రల పరిధి మేరకు చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, బలమైన సీన్లు ఉన్నట్లయితే 'భాగ్ సాలే' ఇంకా మెరుగ్గా వినోదాన్ని అందించగలిగేది. హీరో క్యారెక్టర్ ఆడియెన్స్‌తో కనెక్ట్ కాలేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. కాలక్షేపం కోసమైతే ఓసారి చూడొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి