Read more!

English | Telugu

సినిమా పేరు:బుడ్డా
బ్యానర్:వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , ఎబి కార్పోరేషన్
Rating:3.25
విడుదలయిన తేది:Jun 30, 2011

కథ - ఒక గ్యాంగ్ స్టర్ విజు (అమితాబ్ బచ్చన్) ప్రేమించి పెళ్ళి చేసుకుని భార్య( హేమా మాలిని) తో ఒక కొడుకుని కన్న తర్వాత తన నుంచి విడిపోతే, ఇండియా నుండి ప్యారిస్ వెళ్ళి అక్కడ ఒక పబ్ నడుపుకుంటూ బ్రతుకుతుంటాడు. అతను మళ్ళీ ఇండియాకి ఒక 60 యేళ్ళ వయసులో తిరిగి వస్తాడు. అప్పటికి అతని కొడుకు (సోనూ సూద్) ఎసిపి గా ముంబాయిలో ఉంటాడు. అతను ఒక సందర్భంలో ముంబాయిని భయపెడుతున్న మాఫియాని ఏరిపారేస్తానని అంటాడు. అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా సంపాదిస్తాడు. దాంతో మాఫియా డాన్ కబీర్ ( ప్రకాష్ రాజ్) ఆ ఎసిపిని చంపమని విజుకి సుపారీ ఇస్తాడు. తన కొడుకు ఎసిపిని కాపాడుకోవటానికి ఆ విజు ఏం చేశాడు...అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. "పోకిరి"తో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి వస్తే ఈవయసులో అమితాబ్‍ బచ్చన్ ని ఎలా చూపిస్తే అతని అభిమానులకు ఆనందం కలుగుతుందో అలా ప్రేక్షకుల నాడి, నరం పట్టుకుని దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసిన చిత్రం ఇది. పూరీ జగన్నాథ్ నిజానికి అమితాబ్ బచ్చన్ కి చాలా పెద్ద ఫ్యాన్. అది ఈ సినిమా ప్రతి ఫ్రేంలో, ఇంకా చెప్పాలంటే అణువణువులో మనకు కనపడుతూంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది.

 

ముఖ్యంగా అమితాబ్ ఎంట్రీ అదిరిపోయింది. అమితాబ్ ని ఒక యాంగ్రీ, యారగెంట్ ఓల్డ్ మ్యాన్ గా చూపించటం ప్రేక్షకులకు బాగా నచ్చేఅంశం. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ బాలీవుడ్ లో జండా పాతేసినట్లే. అక్కడి టాప్ కమర్షియల్ డైరెక్టర్లందరికి పూరీ జగన్నాథ్ ఒక సవాల్ గా మారతాడనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. మహేష్ బాబుతో "ది బిజినెస్ మ్యాన్ ‍" కమిటయ్యాడు గనక ఆ సినిమా చేస్తాడేమో. బాలీవుడ్ లో ఇంత ప్రతిభ చూపించాక మళ్ళీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు సినిమా చూడటం కొంచెం కష్టమే. బాలీవుడ్ లో ఒక తెలుగోడు తన ప్రతిభను చాటుకున్నాడంటే తెలుగు వారందరికీ గర్వకారణం.

 

నటన- అమితాబ్‍ బచ్చన్ నటన గురించి చెప్పటం అంటే సూర్యుడు చాలా కాంతివంతంగా ఉంటాడని చెప్పటం వంటిది. మనసుకి నచ్చిన పాత్ర దొరికితే అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ ఎలా రెచ్చిపోతాడో ఈ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది. "బుడ్డా" సినిమాలో అమితాబ్‍ బచ్చన్ నటన గురించి మాస్ భాషలో చెప్పాలంటే అదరగొట్టి బెదరగొట్టి ఇరగ్గొట్టాడని చెప్పాలి. ఆయన ఈ "బుడ్డా" సినిమాలో డైలాగ్ లు చెప్పిన విధానం కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన ఫ్రేంలో ఉంటే మరో నటుడు కనపడడు అంటే అతిశయోక్తి కాదు. అందులోనూ ముఖ్యంగా ఇలాంటి పాత్ర అమితాబ్‍ కి దొరికినప్పుడు.

 

ఆయన్ని తట్టుకున్న నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే. అతని నటన సూపర్. అమితాబ్ బచ్చన్ తో ప్రకాష్ రాజ్ ఢీకొనే సీన్లలో ప్రకాష్ రాజ్ తాను గతంలో జాతీయ ఉత్తమనటుణ్ణని నిరూపించుకున్నాడు. సోనూ సూద్ నటన ఆకట్టుకుంటుంది. సోనాలీ చౌహాన్ అందంగా కనిపించింది...నటించింది కూడా. సీనియర్ నటి హేమా మాలిని నటనలో గ్రేస్ ముచ్చటగా ఉంది.

 

రవీనా టాండన్ పాత్ర కాస్త అనవసరం అనిపిస్తుంది. ఇక మకరంద్ దేశ్ పాండే చాలా బాగా నటించాడని చెప్పాలి. ఛార్మి కౌర్ ఈ సినిమా సరదాగా సాగటానికి హెల్పయ్యింది. సుబ్బరాజు తన స్థాయిలో బాగానే నటించాడు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సంగీతం - శేఖర్ రావ్ జియానీ, విశాల్ దడ్లానీ సంగీతం ఈ "బుడ్డా" సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఈ "బుడ్డా" సినిమాలో పాటలన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా "బుడ్డా హోగా తేరా బాప్" అనే టైటిల్ సాంగ్, అలాగే టైటిల్ ట్రాక్, "గో మీరా గో" అనే పాటలో అమితాబ్ గతంలో నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి వినిపించిన తీరు బాగుంది. ఉదాహరణకు "కే పగ గుంగురూ బాంద్ మీరా నాచీతీ, హే సారా జమానా...హనీనోంకా దివానా"వంటి పాటలను రీమిక్స్ చేశారు. "హాల్ ఎ దిల్" అనే పాటలు అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ఇక రీ-రికార్డింగ్ చాలా బాగుంది.

 

మాటలు - పూరీ జగన్నాథ్ మాటలు ఈ "బుడ్డా" చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అమితాబ్ చెప్పే "హే మై మరూంగాతో గోలీ సే మరూంగా...బిపి యా సుగర్ సే నై మరూంగా" వంటి మాటలు ప్రేక్షకులను అలరిస్తాయి.

 

పాటలు - పాటల్లో సాహిత్యం నేటి సామాజిక వ్యవస్థలో హిందీ భాష ఎలా ఉందో అలాంటి వాడుక భాషనే ఉపయోగించటం బాగుంది.

 

సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో ఫొటోగ్రఫీ చాలా బాగుంది.

 

ఎడిటింగ్ - నీట్ గా ఒక్క వేస్ట్ షాట్ లేకుండా, ఒక్క వేస్ట్ ఫ్రేమ్ లేకుండా క్లీన్ గా ఉంది.

 

ఆర్ట్ - చాలా బాగుంది. కొరియోగ్రఫీ - ముచ్చటగా ఉంది.

 

యాక్షన్ - విజయ్ మాస్టర్ యాక్షన్ సీన్ల కంపోజింగ్ బాలీవుడ్ కి దడ పుట్టించేలా ఉంది. చాలా చాలా బాగుంది ఈ "బుడ్డా" చిత్రంలోని యాక్షన్ సీన్ల కంపోజింగ్. సింప్లీ సూపర్బ్.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ మసాలాలతో నిండిన ఈ "బుడ్డా" సినిమా చూడాల్సిన సినిమా. మీరు గనక అమితాబ్ అభిమాని అయితే తప్పకుండా, కచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడకపోతే ఏదో మిస్సయినట్లే. కనీసం అమితాబ్ బచ్చన్ కోసమైనా ఈ సూపర్ హిట్ సినిమాని ఒకసారైనా చూడాల్సిందే.