Read more!

English | Telugu

సినిమా పేరు:బలగం
బ్యానర్:దిల్ రాజు ప్రొడక్షన్స్‌
Rating:3.00
విడుదలయిన తేది:Mar 3, 2023

సినిమా పేరు: బలగం
తారాగణం: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరామ్, మైమ్ మధు, వేణు, రచ్చ రవి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
ఎడిటర్: మధు
పాటలు: కాసర్ల శ్యామ్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
రచన, దర్శకత్వం: వేణు ఎల్దండి
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: మార్చి 3, 2023

 

వెండితెర మీద, బుల్లితెర మీద కమెడియన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వేణు టిల్లు(వేణు ఎల్దండి) 'బలగం' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది? దర్శకుడిగా వేణు తొలి ప్రయత్నం ఫలించిందా?.

 

కథ:
వ్యాపారాల పేరుతో లక్షల్లో అప్పులు చేసిన సాయిలు(ప్రియదర్శి) పెళ్లి చేసుకొని వచ్చే కట్నంతో అప్పు తీర్చాలి అనుకుంటాడు. అప్పటికే అతనికి పెళ్లి నిశ్చయమైంది. మొత్తం కట్నం 15 లక్షలు కాగా, ఎంగేజ్ మెంట్ రోజు పది లక్షలు ఇస్తామని వధువు కుటుంబం చెబుతుంది. మరో రెండు రోజుల్లో ఎంగేజ్ మెంట్, చేతికి పది లక్షలు వస్తాయని సాయిలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా.. అప్పటివరకు ఎంతో చలాకీగా తిరిగిన అతని తాత కొమురయ్య(సుధాకర్ రెడ్డి) ఒక్కసారిగా కన్ను మూస్తాడు. అయితే తాత చనిపోయాడని కొంచెం కూడా బాధపడని సాయిలు, పెళ్లి వాయిదా పడిందని ఫీల్ అవుతాడు. దానికి తోడు ఇరు కుటుంబాల మధ్య చిన్న గొడవై మాట మాట పెరిగి పూర్తిగా పెళ్లే వద్దు అనుకుంటారు. దీంతో అప్పు ఎలా తీర్చాలని సాయిలు ఆందోళన చెందుతుండగా.. అతని మేనత్త లక్ష్మి(విజయలక్ష్మి) కుటుంబం బాగా డబ్బున్న వాళ్ళని తెలిసి, ఆమె కూతురు సంధ్య(కావ్య కళ్యాణ్‌ రామ్‌)ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ ఇరు కుటుంబాల మధ్య మాటలే లేవు, అతని తండ్రి ఐలయ్య(జయరాం), మావయ్య నారాయణ(మురళీధర్‌ గౌడ్‌) కనీసం ముఖం ముఖం కూడా చూసుకోరు. 20 ఏళ్ళ తర్వాత ఇంటిపెద్ద చావు దగ్గర కలిసినా కూడా వారి పంతాలు వారివే. మరోవైపు కొమురయ్య ఏదో తీరని కోరికతో చనిపోవడంతో మూడో రోజు, ఐదో రోజు పిండం పెట్టగా కాకులు ముట్టవు. దానిని ఊరికి అరిష్టంగా భావించిన ఆ ఊరి పెద్దలు.. 11వ రోజు కాకులు ముట్టకపోతే కుటుంబాన్ని కఠినంగా శిక్షిస్తామని బెదిరిస్తారు. అసలు కొమురయ్య కోరిక ఏంటి? ఆ కోరిక నెరవేరి కాకులు పిండాన్ని తినడానికి వచ్చాయా? తాత చనిపోయాడనే బాధ ఏమాత్రం లేకుండా తన స్వార్థం కోసం మరదలు సంధ్యను పెళ్లి చేసుకోవాలనుకున్న సాయిలు కోరిక నెరవేరిందా? అతని అప్పులు తీరాయా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

దర్శకుడు వేణు ఎంచుకున్న కథాంశం బాగుంది. ఇది అద్భుతమైన కథ, ఊహకందని కథనంతో సాగే చిత్రం కాదు. ఇది తెలంగాణ మట్టి కథ. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి కథ. మనం చూసిన, విన్న మనుషుల నుంచి పుట్టిన కథ. అందుకే అంత సహజంగా ఉంది. దర్శకుడు వేణు దానిని అంతే సహజంగా తెరమీదకు తీసుకొచ్చాడు. ఈ చిత్రం మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఇందులో కన్నడ చిత్రం తిథి ఛాయలు ఉన్నప్పటికీ దర్శకుడు నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి.

ఇది చావు చుట్టూ అల్లుకున్న కథ అయినప్పటికీ సినిమా అంతా ఏడుపులే ఉండవు. బోలెడంత వినోదం కూడా ఉంది. అలా అని కావాలని హాస్య సన్నివేశాలను ఇరికించి, బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నించినట్లు ఎక్కడా ఉండదు. చావు దగ్గరకు వచ్చి కూడా విచిత్రంగా ప్రవర్తించే మనుషులను మనం నిజ జీవితంలో చూస్తుంటాం. అలాంటి పాత్రలను తీసుకొని సహజమైన హాస్యాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 'చావు కూడా పెళ్లి లాంటిదే' అని ఓ మహాకవి చెప్పినట్లు.. ఓ పెద్దాయన చనిపోతే ఆయనను ఘనంగా సాగనంపటం ఊళ్ళల్లో చూస్తుంటాం. ఆ సన్నివేశాలను కూడా చాలా సహజంగా చూపించాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు మాట కలపకుండా పంతానికి పోయి.. ఏళ్ళకు ఏళ్ళు సొంతవాళ్ళకు ఎలా దూరమవుతారు?.. రక్తం పంచుకున్న బిడ్డలు ఒకరికొకరు మాట్లాడుకోకపోతే ఆ ఇంటి పెద్ద మనోవేదన ఎలా ఉంటుంది? కొందరు తమ స్వార్థం కోసం వారిని, వారి కుటుంబాన్ని ఎలా మోసం చేసుకుంటున్నారు? వంటి విషయాలను చక్కగా చూపించాడు దర్శకుడు.

సినిమా అంతా చాలా సహజంగా ఉంది. పాత్రల రూపకల్పన, సన్నివేశాల చిత్రీకరణ సహజంగా ఉన్నాయి. ప్రతి పాత్ర మనకు నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట తారసపడినట్లు అనిపిస్తుంది. తన మాటే నెగ్గాలి, తనని ఎవరైనా ఒక్క మాట అన్నా పడలేని ఐలయ్య లాంటి మొండివాడి పాత్రయినా.. తన అన్న, భర్త పంతం కారణంగా 20 ఏళ్ళుగా పుట్టింటికి దూరమైన లక్ష్మి పాత్రయినా.. వ్యక్తిగత స్వార్థం ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే సాయిలు పాత్రయినా ఇలా అన్నీ నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి. ఊళ్ళల్లో మనకు తారసపడే పాత్రల నుంచి సహజమైన సన్నివేశాలు, సంభాషణలు రాసుకొని చక్కగా భావోద్వేగాలు పలికించాడు దర్శకుడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బయటకు వెళ్ళకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ప్రథమార్థంలో ఎంతలా నవ్విస్తాడో, ముగింపులో అంతలా ఏడిపిస్తాడు. అయితే ప్రస్తుతం యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ హవా నడుస్తున్న ఈ కాలంలో ప్రేక్షకులు ఎంతవరకు ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సహజత్వాన్ని కోరుకునే వారివరకు ఓకే గానీ మిగతా వారికి నెమ్మదిగా సాగే కథనం అక్కడక్కడా బోర్ కొట్టించవచ్చు. అలాగే చివరిలో సాయిలు పాత్ర రియలైజ్ అయ్యే సన్నివేశాలు మరింత బలంగా ఉంటే బాగుండేది.

ఈ చిత్రానికి ప్రధాన బలం సంగీతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. భీమ్స్ సిసిరోలియో కథకి అవసరమైన సంగీతం ఇచ్చాడు. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. ఇక కాసర్ల శ్యామ్ సాహిత్యంలో తెలంగాణ పల్లెతనం ఉట్టిపడింది. భీమ్స్ సిసిరోలియో, కాసర్ల శ్యామ్ ఇద్దరూ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ఆచార్య వేణు కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాలకు సహజత్వం తీసుకొచ్చారు.

 

నటీనటుల పనితీరు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి చక్కగా ఒదిగిపోయాడు. తాత చావులో కూడా తన పెళ్లి, అప్పుల గురించి ఆలోచిస్తూ నవ్వించాడు. అలాగే తండ్రి, మామ పంతాల నడుమ నలిగిపోయే యువకుడిగా అతని నటన ఆకట్టుకుంది. ఎమోషన్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. పుట్టిన 20 ఏళ్ళ తర్వాత మొదటిసారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లిన సంధ్య అనే యువతి పాత్రలో కావ్య కళ్యాణ్‌ రామ్‌ చక్కగా రాణించింది. ఇక సినిమాకి కీలకమైన కొమురయ్య పాత్రలో సుధాకర్‌ రెడ్డి ఎంతో సహజంగా చేశాడు. సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమా అంతా తన చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఉన్న కాసేపైనా ఆ పాత్రతో బలమైన ముద్ర వేయాల్సి ఉంది. ఆ విషయంలో సుధాకర్‌ రెడ్డి పూర్తి న్యాయం చేశాడు. ఇక సాయిలు తండ్రిగా జయరాం, మేనత్తగా విజయలక్ష్మి, మామగా మురళీధర్‌ గౌడ్‌, బాబాయ్ గా మైమ్ మధు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. నర్సిగా వేణు ఎల్దండి, సాయిలు స్నేహితులుగా రచ్చ రవి, కృష్ణ తేజ బాగానే నవ్వించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓ రెండు గంటల పాటు తెలంగాణలోని పల్లెటూరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. చావు ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. మనకి బాగా తెలిసిన మనుషులని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. వినోదం, భావోద్వేగంతో కూడిన ఓ సహజమైన చిత్రాన్ని అందించాడు దర్శకుడు వేణు. సినిమాల్లో సహజత్వాన్ని కోరుకునే వారు.. మట్టి కథలు, మనుషుల కథలు ఇష్టపడేవాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా 'బలగం'.

-గంగసాని