Read more!

English | Telugu

సినిమా పేరు:అవతార్‌: ది వే ఆఫ్ వాటర్
బ్యానర్:లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్
Rating:4.50
విడుదలయిన తేది:Dec 16, 2022

సినిమా పేరు: అవతార్: ది వే ఆఫ్ వాటర్
తారాగణం: సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, జేమీ ఫ్లాటర్స్, బ్రిటన్ డాల్టన్
స్క్రీన్‌ప్లే: జేమ్స్ కామెరాన్, రిక్ జఫా, అమందా సిల్వర్
మ్యూజిక్: సైమన్ ఫ్రాంగ్లెన్
సినిమాటోగ్రఫీ: రస్సెల్ కార్పెంటర్
ఎడిటింగ్: స్టీఫెన్ ఇ. రివ్కిన్, డేవిడ్ బ్రెన్నర్, జాన్ రెఫౌవా, జేమ్స్ కామెరాన్
దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
ప్రొడక్షన్ కంపెనీస్: లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ 13 సంవత్సరాల క్రితం సృష్టించిన 'అవతార్' మూవీ విశ్వవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు. మనల్ని పండోరా అనే సరికొత్త లోకలోకి తీసుకెళ్లిన ఆ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందనే సరికి, ప్రేక్షకులు వేయికళ్లతో దానికోసం ఎదురుచూశారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ఉందా?...

 

కథ:
జేక్ సల్లీ, నేతిరి జంటకు పండోరాలో నెటేయం, లాఓక్ అనే ఇద్దరు అబ్బాయిలు, టుక్ అనే అమ్మాయి పుడతారు. కిరి అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటారు. మొదటి సినిమాలో పండోరాను ధ్వంసం చేసి, తమ కాలనీని అక్కడ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేసి, నేతిరి చేతిలో హతుడైన కల్నల్ మైల్స్ క్వార్టిచ్, నావీ తెగ మనిషి రూపంలో మళ్లీ వస్తాడు. యుద్ధం వల్ల జరిగిన నష్టం ఎంత బీభత్సంగా ఉంటుందో తెలుసు కాబట్టి, ఈసారి ఘర్షణ వద్దనుకున్న జేక్ తన కుటుంబాన్ని తీసుకొని అడవిని వదిలిపెట్టి, ఒక సముద్ర ద్వీపకల్పానికి వెళ్తాడు. అతడి మీద, నేతిరి మీద పగ సాధించడమే లక్ష్యంగా చేసుకున్న కల్నల్ మైల్స్ ఎలాగో వారి ఆచూకీ కనిపెడ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు జరిగిన ఘర్షణలో జేక్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా, లేదా?.. అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

మూడు గంటల పది నిమిషాల నిడివి ఉన్న 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మూవీ తొలి సినిమా తరహాలోనే ఒక విజువల్ వండర్. అందులో అడవిలోని పండోరా అని కల్పిత ప్రాంత అందాల్ని చూసి పరవశం చెందిన మనం, ఈ రెండో భాగంలో సముద్ర అందాల్ని చూసి, మైమరచిపోతాం. మరో సరికొత్త లోకంలోకి వెళ్లిపోయి విహరించేస్తాం. అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనేది కేవలం విజువల్ వండర్ కాదు, ఇందులో భావోద్వేగాలు, మన భారతీయ సినిమాల్లో తరచూ కనిపించే సెంటిమెంట్లు, ఫ్యామిలీ బాండింగ్ లాంటి అంశాలున్నాయి. అవి ఈ సినిమాకు బలంగా మారాయి. జేమ్స్ కామెరాన్ మస్తిష్కం నుంచి జాలువారిన ఆలోచనలకు అనుగుణంగా టెక్నీషియన్స్ అద్భుతమైన పనితనాన్ని కనపరచి, తొలి సినిమాకు ఏమాత్రం తగ్గని రీతిలో.. ఇంకా చెప్పాలంటే మరింత మెరుగైన ఫలితాన్ని రాబట్టారు. 3డి గ్లాసులు పెట్టుకొని సినిమా చూస్తున్నంత సేపూ మన నిజ ప్రపంచాన్ని మరిచి, మరో ప్రపంచంలోకి వెళ్లిపోతాం. 

తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తపన పడే జేక్, అడవిని వదిలి బయటకు రావడానికి అయిష్టత చూపే నేతిరి మధ్య ఘర్షణ, ఆమెను కన్విన్స్ చేసి అతను ఫ్యామిలీతో ఒక ఐలాండ్‌కు వెళ్లడంతో మనకు అర్థమవుతుంది.. ఈసారి యుద్దం నేల మీద కాకుండా నీటి మీద జరుగుతుందని. అలా మన ఊహకు తగ్గట్లే కథ నడిచినా, ఆ కథలో దర్శకుడు కల్పించిన సన్నివేశాలు విజువల్‌గా అబ్బురమనిపిస్తాయి. సినిమాలో పయకన్ అనే సముద్ర జీవి కూడా కీలక పాత్ర వహిస్తుంది. మనం చూసే నాటికే దాన్ని జేక్ ఫ్యామిలీ తలదాచుకున్న ఐలాండ్ వాసులు వెలి వేస్తారు. కారణం.. అది అనేకమంది చావుకు కారణమైందనే అపోహ. దానితో జేక్ రెండో కొడుకు స్నేహం చేయడం, జేక్ సహా ఐలాండ్ వాసులంతా ఆర్డీఏ సెక్యూరిటీ ఫోర్సెస్ బారినపడి, చావుబతుకుల మంధ్య ఊగిసలాడుతున్నప్పుడు అనూహ్యంగా పయకన్ వచ్చి సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడిచేసి, వారిని కాపాడే సీన్లు.. సూపర్బ్. విజువల్‌గా, టెక్నికల్‌గా 'అవతార్ 2' ఎంత గొప్ప స్థాయిలో ఉందో భావోద్వేగాల పరంగా, మిగతా విషయాలు అన్నింటి కన్నా కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యమనే విషయాన్ని జేమ్స్ కామెరాన్ చెప్పిన విధానం అంతే గొప్ప స్థాయిలో ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్ సినిమాని వేరే లెవల్లోకి తీసుకెళ్లాయి.

 

నటీనటుల పనితీరు:
జేక్ సల్లీగా సామ్ వర్తింగ్టన్ ఎప్పట్లా సెటిల్డ్ పర్ఫార్మన్స్ చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాలెన్స్ కోల్పోకుండా సంయమనం పాటించే సందర్భాల్లో అతను చూపిన హావభావాలు గొప్పగా ఉన్నాయి. నేతిరిగా జో సల్దానా మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించింది. తొలి భాగం తరహాలో ఈ మూవీలోనూ ఆమెకు నటించడానికి మంచి అవకాశం లభించింది. దాన్ని ఆమె బాగా వినియోగించుకుంది. కల్నల్ మైల్స్‌గా స్టీఫెన్ లాంగ్ సంగతి చెప్పేదేముంది! విలనీని సూపర్బ్‌గా ప్రదర్శించాడు. కిరి పాత్రలో సిగౌర్నీ వీవర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. మిగతా నటులందరూ తమ పాత్రల్ని చక్కగా చేశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మూవీ మనల్ని మరో ఊహాలోకంలోకి తీసుకెళ్లే ఒక టిపికల్ జేమ్స్ కామెరాన్ సినిమా. సముద్రం పైనా, సముద్రం లోపలా ఎన్నో అద్భుతాల్ని అవిష్కరించిన సినిమా. ఆ లోకంలోకి వెళ్లి ఆస్వాదించడమే మనం చేయాల్సిన పని.

- బుద్ధి యజ్ఞమూర్తి