Read more!

English | Telugu

సినిమా పేరు:అందరి బంధువయా
బ్యానర్:యుటోపియా ఎంటర్ టైనర్స్
Rating:3.00
విడుదలయిన తేది:May 14, 2010
నందు (శర్వానంద్) హైదరాబాద్ కి కొత్తగా వస్తాడు. ఎవరైనా ఆపదలో వుంటే వెనుకా ముందు చూడకుండా వారికి సహాయం చేయడం నందు నైజం. పరమ పిసినిగొట్టు అయిన పద్దు (పద్మప్రియ) పని చేస్తున్న ఆఫీసు లోనే నందు జాయిన్ అవుతాడు. తన ఫ్రెండ్ తో కలిసి పద్దు ఇంట్లోనే అద్దెకి దిగుతాడు. తన మాస్టారు కొడుకు ఆపరేషన్ కి డబ్బు అవసరం ఏర్పడితే గుండా అయిన జంగయ్య (ఆర్.కె.) దగ్గర తన కళ్ళు, గుండెని తాకట్టు పెట్టి అయిదు లక్షలు తీసుకుంటాడు. డబ్బుకంటే మనుషులకే విలువనిచ్చే నందు గ్రామానికి కొన్ని కారణాల వాళ్ళ పద్దు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ నందు తండ్రి హనుమంతు (నరేష్) కూడా తన ఆస్తిని సైతం అమ్మేసి ఇతరులకి సహాయం చేయడం వారికి ఆ గ్రామస్తులు ఏంతో ఆప్యాయంగా చూసుకోవడం కళ్ళార చుసిన పద్దు తన పిసినిగొట్టు తనానికి స్వస్తి పలికి ఆపదలో వున్న వారికి సహాయం చేయాలని సిద్దపడుతుంది. నందు, పద్దు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నా ఇద్దరూ బయటికి చెప్పుకోరు, ఇలాంటి పరిస్థితిలో పద్దు అక్కయ్యని పెళ్లి చేసుకోవడానికి యు.ఎస్. నుండి వచ్చిన పద్దు మేనబావ పద్దు అందానికి ముగ్దుడయిపోయి పద్దునే పెళ్ళిచేసుకోవడానికి సిద్దపడుతాడు. ఈ పరిస్థితిలో నందు, పద్దు ఏమి చేసారు, నందు జంగయ్య కి తన కళ్ళు, గుండె తాకట్ట పెట్టి తీసుకువచ్చిన అప్పుని ఎలా తీర్చాడు.. అన్నది మిగతా కథ...
ఎనాలసిస్ :
సాటి మనిషికి సహాయం చేస్తే అందులో వుండే ఆనందం ఎలా వుంటుందో, ఆ ఆనందం మనిషిలో ఎంత సంతోషాన్ని నింపుతుందో తెలియచెప్పే కథ ఇది. గమ్యం, ప్రస్థానం తర్వాత శర్వానంద్ కి లభించిన మరో మంచి పాత్ర. శర్వానంద్ తర్వాత చెప్పుకోవలసిన పాత్ర హనుమంతు. నరేష్ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. 'ఆ నలుగురు' చిత్రంతో మానవ విలువలతో కూడిన చిత్రాన్ని అందించిన దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రూపొందించాలని ప్రయత్నించాడు. కాని ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి కథలో టెంపో మిస్ చేసేసారు. తన మేన బావతో పెళ్లి ఫిక్స్ అవడంతో పద్దు నందుతో కలిసి ఆడే నాటకం బోర్ కొట్టిస్తుంది. ఇతరులకి సహాయ పడాలని తాపత్రయ పడే నందు అలా నాటకం ఆడడం బావోలేదు. ఇది తప్పితే ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకుటుంది. సెంటి మెంట్ సన్నివేశాలని తెరకెక్కించడంలో చంద్ర సిద్దార్థ తన టాలెంట్ ని మరో సారి నిరూపించుకున్నాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
శర్వానంద్ మరో సారి చక్కని నటనని కనబరిచారు. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది, ఎక్కడా ఓవర్ గా వుంది అని ప్రేక్షకులు ఫీల్ కాకుండా నటించారు. పద్మప్రియ నటన బావుంది. పద్దు పాత్రతో ఆమెకి ఓ మంచి పాత్ర లభించింది. ఆ పాత్రకి న్యాయం చేయడానికి చాలానే కష్టపడింది. నరేష్ హనుమంతు పాత్రలో జీవించారు. పల్లెటూరి మనిషిగా.. కొడుకంటే ఎనలేని ప్రేమని కురిపించే తండ్రిగా, తన ఊరి వారి అభిమానాన్ని చూరగొనే హనుమంతుగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. కృష్ణ భగవాన్ కాస్త నవ్వించినా, ఎమ్మెస్ పాత్ర సీరియస్ గా సాగుతుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా బాగానే చేసారు. ఈ చిత్రానికి మరో హైలెట్ మాటలు. బలబద్ర పాత్రుని రమణి అందించిన మాటలు ఆకట్టుకుంటాయి. ''ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోనక్కర లేదు, ఇంగ్లీష్ వచ్చిన మొగుడుని చేసుకుంటే చాలు', 'పక్షికి ఇంత ధాన్యం, పశువుకు ఇంత గ్రాసం, మనిషికి ఇంత సాయం' చేయడంలో ఏంతో తృప్తి వుంటుంది.. లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఫర్వాలేదు. చైతన్య ప్రసాద్ సాహిత్యం ఆకట్టుకుంటుంది. టైటిల్ లో వచ్చే 'సూర్యుడు ఎవరయ్యా.. అందరి బందువయా' పాట సాహిత్య పరంగా బావుంది. మిగతా పాటలు కూడా ఫర్వాలేదు.మంచి ఫీల్ గుడ్ కలిగించే సినిమా ఇది.