Read more!

English | Telugu

సినిమా పేరు:ఏజెంట్
బ్యానర్:ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Apr 28, 2023

సినిమా పేరు: ఏజెంట్
తారాగణం: అఖిల్ అక్కినేని, మమ్మూట్టి, సాక్షి వైద్య, డినో మోరియా, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవాబ్ షా, భరత్‌రెడ్డి, అజయ్, అనీశ్ కురువిల్లా
కథ: వక్కంతం వంశీ
సాహిత్యం: చంద్రబోస్, రఘురాం 
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాశ్ కొల్లా
స్టంట్స్: విజయ్, స్టన్ శివ
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
బ్యానర్: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 28 ఏప్రిల్ 2023

మాస్ స్టార్‌గా ఎదగాలని కెరీర్ ప్రారంభించిన దగ్గర్నుంచీ తహతహలాడుతున్న అఖిల్ అక్కినేనితో డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'ఏజెంట్' మూవీని తీస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడే, ఈ మూవీపై సినీ గోయర్స్‌లో ఆసక్తి వ్యక్తమవుతూ వచ్చింది. మలయాళం లెజెండరీ యాక్టర్ మమ్మూట్టి కీలక పాత్ర చేయడం, బాలీవుడ్ యాక్టర్ డినో మోరియా విలన్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. చిరంజీవితో తీసిన 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ తర్వాత కొంత విరామం తీసుకొని, ఎక్కువ కాలం సెట్స్‌పై గడిపి సురేందర్ రెడ్డి ఈ మూవీని చెక్కాడు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించిన 'ఏజెంట్' సినిమా ఎలా ఉందయ్యా అంటే...

కథ

రామకృష్ణ అలియాస్ రిక్కీ (అఖిల్) అనే మిడిల్ క్లాస్ కుర్రాడు 'రా' ఏజెంట్ కావాలని కలలు కంటుంటాడు. అతనో ఎథికల్ హ్యాకర్. అయితే 'రా' పెట్టిన టెస్ట్‌కు అటెండ్ అయ్యి, తన క్రేజీ బిహేవియర్‌తో మూడు సార్లు రిజెక్ట్ అవుతాడు. దాంతో తనకు ఆరాధ్య దైవం లాంటి 'రా' చీఫ్ మహదేవ్ అలియాస్ ద డెవిల్ (మమ్మూట్టి) కంప్యూటర్‌ను హ్యాక్ చేసి, ఆయన దృష్టిలో పడతాడు. ఆ టైంలోనే వైద్య (సాక్షి వైద్య) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఎట్టకేలకు రిక్కీని తన టీంలో చేర్చుకొని అతనికి ఒక మిషన్ అప్పజెపుతాడు మహదేవ్. అది.. ఇండియాను సర్వనాశనం చేయాలనుకుంటున్న సిండికేట్ చీఫ్ ద గాడ్ (డినో మోరియా)ను పట్టుకొని, అతని ప్లాన్ ఏమిటో తెలుసుకోవడం. దీని కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి రెడీ అవుతాడు రిక్కీ. ద గాడ్‌ను రిక్కీ పట్టుకున్నాడా? అసలతను ఎవరు? ఇండియా అంటే అతనికి ఎందుకంత ద్వేషం? రిక్కీ లవ్ ఏ తీరానికి చేరింది?.. అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

'ఈ లోకంలో జరిగేదేదీ కాకతాళీయం కాదు, ప్రతిదీ సందర్భవశమే'.. అనే పాయింట్ మీద ఆధారపడి 'ఏజెంట్' కథను వక్కంతం వంశీ రాస్తే, దానికి తన స్క్రీన్‌ప్లేతో ట్రీట్‌మెంట్ ఇచ్చి ఈ మూవీని రూపొందించాడు సురేందర్ రెడ్డి. సినిమా కథ ప్రధానంగా మూడు క్యారెక్టర్ల చుట్టూ నడుస్తుంది. 'రా' చీఫ్ మహదేవ్, సిండికేట్ చీఫ్ ద గాడ్, 'రా' ఏజెంట్ రిక్కీ. ద గాడ్ అసలు పేరు ధర్మా. మహదేవ్‌ను బిగ్ డాడీ అని సంబోధిస్తుంటాడు. అతను మహదేవ్‌పైన ద్వేషం పెంచుకోవడానికి రీజన్ ఉంది కానీ, మొత్తం దేశంపైనే ద్వేషం పెంచుకొని, ఇండియాను సర్వనాశనం చెయ్యాలనుకొనే దానికి రీజన్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. 'అయాం ద బెస్ట్' అని అతను ఎప్పుడూ అనుకుంటూ, అందరూ తనని అలాగే అనుకోవాలని అనుకుంటున్నట్లు చూపించాడు దర్శకుడు. 

దేశాన్ని నాశనం చెయ్యాలనుకొనే విలన్‌కు గాడ్ అనీ, దేశాన్ని రక్షించడమే ప్రధానమనుకొనే రా చీఫ్‌కు డెవిల్ అనీ పేర్లు పెట్టడం.. వైవిధ్యంగా అనిపించాలనా? చంపాలి లేదా చచ్చిపోవాలి అనే మైండ్‌సెట్‌తో ఉన్నవాడిలా మహదేవ్ కనిపిస్తాడు. రా చీఫ్‌గా అతడిని తప్పించడం గవర్నమెంట్ వల్ల కూడా కాదన్నట్లు చూపించడం వింతగా అనిపిస్తుంది. గాడ్ పనులు చాలావరకు సిల్లీగా ఉంటాయి. రామకృష్ణ అలియాస్ రిక్కీ క్యారెక్టర్‌ను కోతితో పోలుస్తాడు మహదేవ్. ఆ కోతి పనులు కొన్నిసార్లు సరదాగా ఉన్నా, కొన్నిసార్లు విసుగు కూడా తెప్పిస్తాయి. రిక్కీ, ద గాడ్ గ్యాంగ్ మధ్య క్లైమాక్స్ సీన్ ఏమాత్రం ఆకట్టుకొనే విధంగా లేదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సడన్‌గా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల హీరోయిన్ క్యారెక్టర్‌కు ఫస్టాఫ్‌లో తప్ప సెకండాఫ్‌లో పెద్దగా పనిలేకుండా పోయింది. అఖిల్, సాక్షి మధ్య రొమాన్స్ లేకపోవడం ఇంకో మైనస్.

చాలామంది నటులు ఇందులో ఉన్నారు కానీ, వారి సామర్థ్యానికి తగ్గ క్యారెక్టర్లు పడలేదు. రిక్కీ ఫాదర్ మురళీ శర్మ, రా టీం మెంబర్ వరలక్ష్మీ శరత్‌కుమార్, మినిస్టర్ జయదేవ్‌గా సంపత్ రాజ్‌లకు నటించడానికి పెద్ద అవకాశం దక్కలేదు. రా ఏజెంట్‌గా అజయ్ ఇలా కనిపించి అలా మాయమవుతాడు. పాటలు కథ నడకకు ఆటంకం కలిగించాయి. అవి చిత్రీకరణ పరంగా ఫర్వాలేదు. హిప్ హాప్ తమిళ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. కొంత కాలంగా సినిమాలు తగ్గించుకున్న రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ ఏజెంట్‌కు బాగా కలిసొచ్చింది. ఆయన కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ క్వాలిటీగా లేకపోవడం మైనస్ అయ్యింది. ఫస్టాఫ్‌ను కొంతమేర ఇంటెరెస్టింగ్‌గా ఎడిట్ చేసిన నవీన్ నూలి.. సెకండాఫ్‌లో దాన్ని కొనసాగించలేకపోయాడు. అవినాశ్ కొల్లా కళా దర్శకత్వం స్టోరీలోని మూడ్‌కు తగ్గట్లు యాప్ట్ అనిపించింది. విజయ్, స్టన్ శివ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఎఫెక్టివ్‌గా లేవు. మినిస్టర్ గ్యాంగ్‌తో రిక్కీ చేసే ఫైట్ ఎంత సిల్లీగా ఉందో చెప్పలేం. చూసి తట్టుకోవాలంతే! క్లైమాక్స్‌దీ అదే బాపతు. వీఎఫ్ఎక్స్ వర్క్ మినహాయిస్తే, నిర్మాణ విలువలు బాగున్నాయి. గన్స్ కోసం డబ్బు బాగా ఖర్చుపెట్టారు.

నటీనటుల పనితీరు
హీరో రిక్కీ క్యారెక్టర్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. మొదట ఆ క్యారెక్టర్‌కు తగ్గట్లు తనను తాను శారీరకంగా మలచుకున్నాడు. కండలు పెంచి, దృఢంగా తయారయ్యాడు. ఆహార్యం బాగుంది. అభినయం కూడా బాగానే చేశాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మరింత మెరుగ్గా ఎక్స్‌ప్రెషన్స్ రావాల్సింది అనిపించింది. మమ్మూట్టి గురించి ఏం చెబుతాం! ఒక పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడంటే, ఆ పాత్రలా మారిపోవడం ఆయన స్వభావం. ఈ సినిమాలోని మహదేవ్ అలియాస్ ద డెవిల్ క్యారెక్టర్ అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే ఆయన తెలుగు డబ్బింగ్ ఇంప్రెసివ్‌గా లేదు. అందువల్ల సినిమాకు ఆయన ఎస్సెట్ కాలేకపోయాడు. గాడ్‌గా విలన్ రోల్‌లో డినో మోరియా రాణించాడు. అవసరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. హీరోయిన్ సాక్షి వైద్యకు ఈ సినిమాతో ఒరిగేదేమీ లేదు. పాటల్లో అందాలు ప్రదర్శించినా ఫలితం లేదు.  వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఆ పాత్రకు ఎందుకు ఎంపిక చేసుకున్నారో తెలీదు. ఆమె అలా కనిపిస్తూ ఉంటుందంతే!


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మనం ఇంతదాకా చూసిన దానికి భిన్నంగా అఖిల్ కనిపించిన 'ఏజెంట్' సినిమాలో ఆకట్టుకొనే అంశాలు, సన్నివేశాలను విసుగు తెప్పించే అంశాలు, సిల్లీ సీన్లు డామినేట్ చేశాయి. రక్తి కట్టించే కథనం లేకపోవడం ఈ సినిమాను అనాసక్తంగా మార్చేసింది. చాలా రోజుల సమయం తీసుకొని సురేందర్‌రెడ్డి చెక్కింది ఇలాంటి 'ఏజెంట్‌'నా?.. అని పెదవి విరిచేవాళ్లే ఎక్కువ. 2 గంటల 36 నిమిషాల 'ఏజెంట్‌'ను కడదాకా చూడాలంటే కాస్తంత ఎక్కువ ఓపిక ఉండాల్సిందే. 

 

- బుద్ధి యజ్ఞమూర్తి