Read more!

English | Telugu

సినిమా పేరు:అదుర్స్
బ్యానర్:వైష్ణవి ఆర్ట్స్ ప్రైవెట్ లిమిటెడ్
Rating:3.25
విడుదలయిన తేది:Jan 13, 2010
మిలటరీ అధికారి అయిన మేజర్‌ చంద్రకాంత్‌ (నాజర్‌) కొడుకు నర్సింహ (ఎన్టీఆర్‌). తన తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోవడంతో తల్లితో పాటు జీవనం సాగిస్తూ.. పోలీసాఫీసర్‌ కావాలనే పట్టుదలతో చదువుకుంటూ... నగరంలో కిడ్నాప్‌ గ్యాంగ్‌లు వసూలు చేసే డబ్బులని రికవరీ చేసి ఇన్స్‌పెక్టర్‌ నాయక్‌ (షాయాజీ షిండే) కి ఇచ్చేస్తుంటాడు. అలా చేస్తే నాయక్‌ పోలీస్‌ పదవి ఇప్పిస్తానని చెబుతాడు. నాయక్‌ కూతురు నందు (షీలా) నర్సింహని ఇష్టపడుతుంది. ఆ కిడ్నాప్‌ గ్యాంగ్‌స్టర్‌లు అయిన రసూల్‌, పాండులు తమ పనులకి అడ్డువచ్చిన నర్పింహని అంతమొందించాలని స్కెచ్‌ వేస్తూంటారు.మరో వైపు బ్రాహ్మణుడయిన భట్టాచార్య (బ్రహ్మానందం) దగ్గర పౌరోహిత్యంలో శిశ్యరికం చేస్తూంటాడు చారి (ఎన్టీఆర్‌). భట్టాచార్య చందు (నయనతార)ని పీకలవరకు ప్రేమిస్తాడు. ఆమెతో పెళ్లికుదుర్చుకునేందుకు చారి సహాయం తీసుకుంటాడు. నర్సింహ, చారిలు ఇద్దరూ ఒకేలా ఉండడంతో రసూల్‌, పాండులు చారియే నర్సింహ అని చారిని కిడ్నాప్‌ చేస్తారు. కానీ అతను నర్సింహ కాదని తెలిసి నర్సింహని పట్టుకోవడానికి పెద్ద ప్లాన్‌ వేస్తారు. అయితే వారి బారి నుండి నర్సింహను పట్టుకోవాలని వెతుకుతున్న ధన్‌రాజ్‌ (ఆశిష్‌ విద్యార్థి) కాపాడుతాడు.
ఎనాలసిస్ :
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాష్ట్ర విభజన సెగలు ఈ చిత్రానికి కూడా తగలడంతో విడుదల జాప్యం అయినా ఇప్పటికీ ఇంకా ఆ సెగలు తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ జిల్లాలలో ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలంగాణ వాదులు హెచ్చరించడంతో చివరికి ఎన్టీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే రిలీజయిన ఈ చిత్రం మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలో ఓ హిట్‌ చిత్రంగా చేరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ నటనలోనూ, వేసే స్టెప్పుల్లోనూ, చేసే ఫైట్స్‌లోనూ ఈ చిత్రాన్ని ఎలాగయినా హిట్‌ చేయాలనే తపనతో చేసారనిపించింది. ఇక కథ విషయానికి వస్తే హీరో డబుల్‌ రోల్‌ అనగానే ఓ క్యారెక్టర్‌ అమాయకంగానూ, మరో క్యారెక్టర్‌ ముదురుగానూ కనిపించే పాత ఫార్ములానే ఈ చిత్రంలో కూడా కనిపించినా సరికొత్త కథనంతో ఆ ఊహే రాకుండా చేసాడు దర్శకుడు.దర్శకుడు వివివినాయక్‌ తన పంథా మార్చుకుని కామెడీకి పెద్ద పీట వేస్తూ తీసిన కృష్ణ చిత్రం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.సరిగ్గా అదే ఫార్ములాని ఉపయోగించి ఈ చిత్రాన్ని కూడా సూపర్‌హిట్‌ చిత్రంగా మలిచారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, వివివినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆది తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రం సక్సెస్‌ సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. ఆయన వేసిన చారి, నర్సింహ రెండు పాత్రలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్లు నయనతార, షీల అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయకపోయినా నటనా పరంగా కూడా ఫర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో మరో ముఖ్యమైన క్యారెక్టర్‌ భట్టాచార్య పాత్ర. ఈ పాత్రలో బ్రహ్మానందం అందరినీ నవ్వుల సాగరంలో ముంచెత్తారు. సంజయ్‌మంజ్రేకర్‌ విలన్‌గా ఆకట్టుకుంటాడు. ఇక మిగతా నటులు కూడా వారి పాత్రలలో బాగానే చేసారు. సంగీతం-: ఈ చిత్రానికి మరో హైలెట్‌ సంగీతం. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం కూడా ఈ చిత్రం సక్సెస్‌లో భాగం అయ్యింది. అన్ని పాటలూ బాగున్నాయి. ఛాయా గ్రహణం-: ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పేదేముంది. ఈ చిత్రం స్థాయికి తగ్గట్టుగా ఛాయాగ్రహణం ఉంది. కనిపించే ప్రతీ ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా కనిపించేలా తీయడంలో ఆయన సక్సెస్‌ సాధించారు. ముఖ్యంగా సాంగ్స్‌ చిత్రీకరణలో కెమెరా పనితనం బావుంది. డాన్స్‌-: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా అంటేనే డాన్స్‌ విషయంలో ప్రేక్షకుల్లో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రంలో డాన్స్‌ ఉంటుంది. ఫైట్స్‌-: బావున్నాయి.ఈ చిత్రం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకి కనువిందు చేస్తుంది. అలాగే కామెడీని ఆస్వాదించే ప్రతీ వారూ ఈ చిత్రం చూడాలి.