Read more!

English | Telugu

సినిమా పేరు:అధినేత
బ్యానర్:శ్రీ సత్యసాయి ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Apr 28, 2009
సూరిబాబు (జగపతిబాబు) అన్యాయాలను, అక్రమాలను, అధర్మాన్ని సహించని ఒక చక్కని బాధ్యత కలిగిన యువకుడు. అతను నిరుద్యోగి కూడా. అతనికి శ్రీరాములు (పరుచూరి గోపాలకృష్ణ) అనే ఒకతను గురువుగా, సలహా దారుడిగా, మార్గదర్శిగా, ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఒక గాడ్ ఫాదర్‌లా ఉంటాడు. ఉద్యోగం లేని సూరిబాబుకి ముఖ్యమంత్రి (ఆహుతి ప్రసాద్‌‍) కి పర్స్ నల్‍ సెక్రెటరీగా ఉద్యోగం వచ్చేలా చేస్తాడు శ్రీరాములు. సూరిబాబులాంటి నీతీ, నిజాయితీలున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్నది శ్రీరాములు కోరిక. ఆ విషయం తెలిసినా అది తనకు నచ్చకపోవటంతో సూరిబాబు పట్టించుకోడు. కొన్ని సంఘటనల అనంతరం ఒక సందర్భంగా అసాంఘిక శక్తుల వల్ల శ్రీరాములు హత్య చేయబడతాడు. అప్పుడు శ్రీరాములు చివరి కోరిక ప్రకారం, ఆయన కోరిక తీర్చటానికి సూరిబాబు రాజకీయాల్లోకి వస్తాడు. సూరిబాబు రాజకీయాల్లోకి రావటం అయితే వస్తాడుగానీ, అక్కడ అతనిది ఒంటరి పోరాటం. ఆ బాటలో అతనికి చాలా సవాళ్ళు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి ఎలాగైతేనేం ఎలక్షన్లలో గెలిచి, యమ్.యల్‍.ఎ.గా ఎన్నికవుతాడు. అలాగే డాక్టర్ రాజేశ్వరి (శ్రద్ధాదాస్) ని ప్రేమిస్తాడు సూరిబాబు. ఎన్నికల్లో గెలిచిన తరువాత గవర్నమెంట్‍ ఏర్పాటుచేయటంలో కీలకపాత్ర పోషిస్తాడు సూరిబాబు. ఒక దశలో ప్రభుత్వ ఏర్పాటులో తన ప్రాథాన్యతను తానే గుర్తించిన సూరిబాబు, ముఖ్యమంత్రిగా మారేందుకు పావులు కదుపుతాడు. అలాగే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత సమాజానికి కీడు చేసే సంఘ విద్రోహ శక్తులను అంతం చేసేందుకు ఒక పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్ (హంసానందిని) సాయంతో సూరిబాబు ఏంచేశాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇది సమకాలీన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల ముందే విడుదల చేసే ఉద్దేశ్యంతో నిర్మించిన సినిమా. ఈ చిత్రంలో దానికి తగ్గట్టే ప్రస్తుతమున్న రాజకీయపార్టీల పేర్లు గుర్తుకొచ్చేలా ఈ చిత్రంలో కూడా కొన్ని రాజకీయ పార్టీలకు అలాంటి పేర్లే పెట్టారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ పేరు గుర్తుకు తెచ్చేలా ఆంధ్రదేశం పార్టీ అని, కాంగ్రెస్‌ పార్టీ పేరు గుర్తుకు తేచ్చేలా ప్రోగ్రెస్ పార్టీ అనీ, ఇలాంటివి పెట్టటంతో పాటు జగపతిబాబు చేత ఉదయించే సూర్యుడు, మార్పు కోసం వంటి మాటలు చెప్పించటం ప్రజారాజ్యం పార్టీని గుర్తుచేస్తుంది. .అదిగాక మన రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రోజెక్టులకు తెలుగువారి పేర్లను పెట్టకపోవటం గురించి కూడా ఈ చిత్రంలో చర్చించారు. కానీ ఏం లాభం ఎన్నికలయిపోయాక ఈ చిత్రం విడుదలయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రం స్క్రీన్‌ప్లే బాగా వీక్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫరవాలేదు కానీ సెకండ్ హాఫ్ బాగా స్లో అయినట్లనిపించింది. అందుకు ముఖ్య కారణం అనవసరమైన సాగతీత. ఈ చిత్రంలో ఏ సీనుకాసీను బాగానే ఉంటాయి గానీ, వాటిమధ్య సమన్వయలోపం మాత్రం కనపడుతుంది. ఇక దర్శకత్వంలో తమిళ స్టైల్‍ కనపడుతుంది. ప్రతి సీన్లో అవసరానికి మించిన బిల్డప్‌లు కనపడటం చూస్తే అలాగే అనిపిస్తుంది.ఇక క్లైమాక్స్ గురించి ఏంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బుల్లెట్‍ ఛాతీలో దిగిన తర్వాత ఆ మనిషి స్టేజీ మీదకు వెళ్ళి. ఆవేశభరితమైన ఉపన్యాసం ఇవ్వటం ఒక్క తెలుగు సినిమాలోనే సాధ్యమవుతుంది. అదీ హీరో గనక అయితే ఎన్ని బుల్లెట్లు దిగినా ఆయన్ని అవేం పికలేవు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
"ఎవడైతే నాకేంటి'' చిత్రంలోని ముమైత్ ఖాన్ పాత్ర వంటి పాత్రలో హంసానందిని నటించింది. కృష్ణభగవాన్ కామెడీ ఒక్కోసారి మనల్ని నవ్విస్తుంది. ఇక హీరో జగపతిబాబు నటన విషయానికొస్తే తన అనుభవాన్ని ఈ చిత్రంలో జగపతిబాబు బాగానే వాడుకున్నాడని చెప్పాలి. అతని నటనలో చక్కని పరిణితి కనిపిస్తుందీ చిత్రంలో. కాకపోతే యాక్షన్ సీన్లు చూస్తే పాత చిత్రాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే హీరో బట్ట నలక్కుండా, క్రాపు చెదరకుండా పోరాడటం ఒక్క పాత సినిమాల్లోనే ఎక్కువగా మనం చూస్తాము. ఇక శ్రద్ధాదాస్ గ్లామర్ ఈ సినిమాకి బాగానే ఉపయోగపడింది. కుర్రకారుకి ఆమె అందాలు కనువిందు చేస్తాయి. అలాగే పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ హంసా నందిని కూడా వీలయినంతగా తన అందాలను ఆరబోయటానికే ప్రయత్నించింది. ఇక ఆహుతి ప్రసాద్, ఆనందరాజ్‍లు విలన్లుగా తమ వంతు కర్తవ్యాన్ని బాగానే నిర్వహించారు. సంగీతం -: ఈ చిత్రంలోని పాటలు వింటూంటే ఆ పాటలన్నీ ఎక్కడో ఇంతకు ముందే విన్నట్టనిపించటం విశేషం. రీ-రికార్డింగ్ ఒ.కె. కెమెరా - : ఈ డిపార్ట్ మెంట్‍ ఈ చిత్రంలో ఇంకా బాగుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పాటల్లో. ఎడిటింగ్ -: అనుభవజ్ఞుడైన ఎడిటర్ నందమూరి హరి ఈ చిత్రాన్ని ఇంకా బాగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. అనవసరమైన సీన్లు కథాగమనానికి అడ్డంపడే సీన్లు కట్‍ చేస్తే సినిమా ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండేది. యాక్షన్ -: ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రం రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారికి ఏమన్నా నచ్చుతుందేమో. కానీ ఇది చూసి తీరాల్సినంత గొప్పదేం కాదు. అలాగని చూడకూడనంత ఛండాలపు చిత్రం కూడా కాదు. ఇది అవుట్‍ అండ్ అవుట్‍ పూర్తి మాస్ చిత్రం. వారిని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రం తీశారు. మాత్రమే కాక వారి తల్లిదండ్రులకు కూడా పనికొచ్చే చిత్రం ఈ "ఆనంద తాండవం''.