English | Telugu
బ్యానర్:కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
Rating:2.25
విడుదలయిన తేది:Apr 29, 2022
సినిమా పేరు: ఆచార్య
తారాగణం: చిరంజీవి, రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోను సూద్, జిషుసేన్ గుప్తా, కిశోర్ కుమార్, తనికెళ్ల భరణి, అజయ్, రఘుబాబు, వెన్నెల కిశోర్, నాజర్, శత్రు, బెనర్జీ, రవిప్రకాశ్, సత్యదేవ్ (గెస్ట్ అప్పీరెన్స్), సంగీత (స్పెషల్ అప్పీరెన్స్)
పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: సురేశ్ సెల్వరాజన్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, విజయ్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
రచన-దర్శకత్వం: కొరటాల శివ
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 29 ఏప్రిల్ 2022
చాలా రోజులుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చిన 'ఆచార్య' మూవీ ఈరోజు మన ముందుకు వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి పూర్తి స్థాయి పాత్రల్లో కలిసి నటించిన తొలి సినిమా కావడంతో 'ఆచార్య' కోసం మెగా ఫ్యాన్స్ మరీ ఎక్కువగా ఎదురుచూశారు. అయితే ట్రైలర్ వచ్చాక ఆ సినిమాపై హైప్ క్రియేట్ కావడానికి బదులు, విమర్శలు రేకెత్తాయి. దానికి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో వచ్చిన 'ఆచార్య' మూవీ ఎలా ఉందంటే..
కథ:- ఒక అడవిలో అమ్మవారి ఆశీస్సులతో పాదఘట్టం అనే ఒక తండా, ఆ తర్వాత పక్కనే ధర్మస్థలి అనే నగరం ఏర్పడతాయి. ధర్మస్థలిని బసవ (సోను సూద్) అనే దుర్మార్గుడు ఆక్రమించేసుకొని, అధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తుంటాడు. అతడిని ఎదుర్కోవడానికి, అతడి నుంచి పాదఘట్టాన్ని కాపాడ్డానికి ఆచార్య (చిరంజీవి) అనే వ్యక్తి అక్కడకు వస్తాడు. అతనొక నక్సలైట్ నాయకుడని తెలుస్తుంది. బసవకూ, ఆచార్యకూ మధ్య ఘర్షణలో సిద్ధ (రామ్‌చరణ్) అనే యువకుడి ప్రస్తావన వస్తుంది. ఒకప్పుడు పాదఘట్టాన్ని సంరక్షిస్తూ వచ్చిన సిద్ధ ఏమయ్యాడు? అతడికీ, ఆచార్యకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సిద్ధ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న నీలాంబరి (పూజా హెగ్డే) జీవితం ఏమయ్యింది? పాదఘట్టం ఉన్న సిద్ధవనాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ మైనింగ్ చేయాలనుకున్న రాథోడ్ (జిషుసేన్ గుప్తా)ను ఆచార్య ఎలా నిలువరించాడు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
ఎనాలసిస్ :
పాదఘట్టాన్ని సంరక్షించి, ధర్మస్థలిలో ధర్మాన్ని ప్రతిష్ఠించడమనే కథానాయకుడి లక్ష్యం చుట్టూ 'ఆచార్య' కథ నడుస్తుంది. ఈ నడకను అందంగా, ఆసక్తికరంగా చెప్పడంలో అడుగడుగునా దర్శకుడు కొరటాల శివ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కథానుసారం ఆచార్య నడివయస్కుడు. అయినప్పటికీ మంచి వయసులో ఉండి, బాడీ బిల్డర్లుగా కనిపించే వారిని వందమందినైనా ఇట్టే తుక్కురేగ్గొడతాడు. అక్కడ ఉంది చిరంజీవి కాబట్టి, మనకు బాగానే ఉంటుంది. కానీ అటు ఆచార్య పాత్రను కానీ, ఇటు సిద్ధ పాత్రను కానీ కొరటాల మలచిన తీరు వల్ల ఆ పాత్రలతో మనం సహానుభూతి చెందలేం. అసలు దీనికి నక్సల్ బ్యాక్‌డ్రాప్ ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే సరైన సమాధానం లభించదు. ఆచార్యను నక్సలైట్‌గా చూపించకపోతే కథకు వచ్చే నష్టమేమిటి? దీనికీ సమాధానం లేదు. ఎప్పుడైతే ఆయనకు బలవంతాన నక్సల్ బ్యాగ్రౌండ్‌ను జోడించారో.. అప్పట్నుంచీ ఆయన క్యారెక్టరైజేషన్‌లో ఆసక్తి క్రమేపీ సన్నగిల్లుతూ వచ్చింది. ఇందుకు బాధ్యత వహించాల్సింది దర్శకుడే. ఆ పాత్ర తీరు తెలిసి కూడా చేసిన చిరంజీవికీ అందులో భాగస్వామ్యం ఉంది.
సినిమా మన ముందుకు రాకముందే రామ్‌చరణ్ చేసిన సిద్ధ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందనే విషయం బయటకు పొక్కింది. అందువల్ల ఆ పాత్ర చనిపోతుందని ముందే తెలిసిపోయింది. ఒక వీరుడి మరణం ఎంత ఎమోషనల్‌గా ఉండాలి?! సిద్ధ పాత్ర ముగిసినప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవడం లేదంటే.. ఆ పాత్ర చిత్రణ విషయంలో దర్శకుడు తప్పులో కాలేశాడని అర్థం. సిద్ధనే నమ్ముకొని, అతడేమయ్యాడో తెలీక సతమతమవుతున్న నీలాంబరి పాత్రకు దర్శకుడు చాలా అన్యాయం చేశాడు. క్లైమాక్స్‌లో ఆమె పాత్రను పూర్తిగా ఉపేక్షించాడు. రవి కాలే అనే పేరుపొందిన నటుడు ఒకట్రెండు సీన్లలో బసవ బ్యాచ్‌లో గుంపులో గోవింద తరహాలో నిల్చొని కనిపించాడు. కానీ అతడిపై ఒక్క సీనూ సినిమాలో లేదు. ఎడిటింగ్‌లో కోసేశారనుకోవాలి. కాజల్ అగర్వాల్ పాత్రను లేపేశామని ముందే చెప్పారు కాబట్టి పేచీ లేదు. సినిమాలో చాలా మంది యాక్టర్లున్నారు. వారిలో చాలామందికి వాళ్ల సామర్థ్యాలకు తగ్గ పాత్రలు లభించలేదు. ఉదాహరణకు వెన్నెల కిశోర్, రఘుబాబు చేసిన పాత్రలు.
టెక్నికల్ విషయాలకు వస్తే, కొరటాల డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ తీవ్ర అసంతృప్తి కలిగించాయి. మిగతా ప్రధాన టెక్నీషియన్లు మంచి పనితనమే చూపించారు. మణిశర్మ మ్యూజిక్ ఇచ్చిన పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్‌గా ఉంది. తిరునావక్కరుసు (తిరు) సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. కథా కాలానికి తగ్గ కలర్ టోన్‌తో, చక్కని విజువల్స్‌ను ప్రెజెంట్ చేశాడు. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ వర్క్‌ను కూడా తప్పకుండా మెచ్చుకోవాలి. ధర్మస్థలి, పాదఘట్టం సెట్లు ఆయన పనితనానికి నిదర్శనం. సినిమాలో మాస్ ఆడియెన్స్‌కు నచ్చేవి యాక్షన్ సీక్వెన్స్‌లు. వాటిని రామ్-లక్ష్మణ్, విజయ్ మాస్టర్లు సూపర్బ్‌గా కొరియోగ్రఫీ చేశారు. అయితే మైనింగ్ జరిగే చోటకు వెళ్లి ఫైటర్లతో చిరు, చరణ్ కామిక్ తరహాలో చేసిన ఫైట్ ఒక్కటి మాత్రం సిల్లీగా ఉంది. కొరటాల డైలాగ్స్ కూడా పలుచోట్ల చాలా సాధారణ స్థాయిలో ఉన్నాయి.
నటీనటుల పనితీరు:- ఆచార్యగా చిరంజీవి తనదైన తరహాలో చెలరేగిపోయి నటించారు. ఫస్టాఫ్‌లో బలమైన క్యారెక్టరైజేషన్ కారణంగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా అలరించింది. పలు క్లోజప్ షాట్స్‌లో ఆయన హావభావాలు ఎప్పట్లా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ ఒదిగిపోయాడు. కానీ ఈ పాత్ర అతని ప్రస్తుత ఇమేజ్‌కు ఏమాత్రం సరిపడేది కాదు. అయినప్పటికీ ఆ పాత్రలో చక్కని నటనను చూపించాడు. నీలాంబరిగా పూజా హెగ్డే అందంగా ఉంది కానీ పాత్ర తీరువల్ల పాక్షికంగానే అలరించగలిగింది.
విలన్ బసవ క్యారెక్టర్‌కు సోను సూద్ అతికినట్లు సరిపోయాడు. ఇటు చిరంజీవితో, అటు రామ్‌చరణ్‌తో ఢీకొట్టే సీన్లలో వాళ్లకు సరిజోడీ అనిపించుకున్నాడు. మరో విలన్ రాథోడ్‌గా బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా కూడా మెప్పించాడు. ఉప విలన్లుగా కన్నడ నటుడు కిశోర్, శత్రు కూడా బాగానే రాణించారు. అయితే శత్రుకు నోరు వంకర తిరిగిపోయినట్లు చూపించడం ఎందుకో తెలీలేదు. పాదఘట్టంను అంటిపెట్టుకొని ఉండే వేద అనే పాజిటివ్ రోల్‌లో అజయ్ చక్కని నటన ప్రదర్శించాడు. అతని రోల్ కూడా బాగుంది. గుడి పూజారిగా తనికెళ్ల భరణి, సిద్ధను పెంచే ఆదెన్నగా నాజర్, నక్సల్స్‌గా బెనర్జీ, రవిప్రకాశ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సిద్ధ తండ్రి శంకరన్నగా సత్యదేవ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
బలహీనమైన స్టోరీ, స్క్రీన్‌ప్లే, ఆకర్షణీయంగా లేని క్యారెక్టరైజేషన్స్‌తో 'ఆచార్య' మూవీ మనల్ని తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తుంది. చిరంజీవి, రామ్‌చరణ్ అభినయంతో పాటు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు కొంతవరకు మెప్పిస్తాయి. ఒకసారి చూశాక, రెండోసారి కూడా చూడాలనిపిస్తేనే.. ఆ సినిమా బాగున్నట్లు. కొరటాల ఇచ్చిన ట్రీట్‌మెంట్ కారణంగా ఆచార్యకు ఆ సీన్ లేకుండా పోయింది.
- బుద్ధి యజ్ఞమూర్తి