Read more!

English | Telugu

సినిమా పేరు:ఆ ఒక్కడు
బ్యానర్:టాలీ 2 హోలీ
Rating:---
విడుదలయిన తేది:Jun 5, 2009
ఒక రిటైర్డ్ మేజిస్ట్రేట్‍ (విజయచందర్) కూతురు డాక్టర్ పవిత్ర (మధురిమ) ఒక సైక్రియాట్రిస్ట్.ఈ విడ నేరస్థులను పట్టుకోవటంలో ఒక్కోసారి పోలీసులకు సహాయం చేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ (సురేష్ గోపి) ఒక ప్రముఖ క్రిమినల్‍ లాయర్. అతని అసిస్టెంట్‍గా బుజ్జి (అజయ్‌‍) పనిచేస్తుంటాడు. ఒక స్వామీజీ ఆశ్రమం మీద నేర వలయం కమ్ముకుంటే, తన వాక్చాతుర్య పటిమతో, తన నేర్పరి తనంతో ఆ స్వామీజీని నిర్దోషిగా బయటకు తెస్తాడు శ్రీకృష్ణ. ఇదిలా ఉంటే డాక్టర్ పవిత్ర చెల్లెలి భర్త పెద్ద తాగుబోతు, బాధ్యతలేని మనిషి.అతను తన భార్య చనిపోయాక తన భార్య వాటా ఆస్తి కోసం మామగారిని ఇబ్బంది పెడుతూంటాడు. అతని పద్ధతి గమనించిన డాక్టర్ పవిత్ర అతని కూతుర్ని, తన మరిది వద్ద కాకుండా తన వద్దే పెంచుతూంటుంది. ఇదిలా ఉంటే డాక్టర్ పవిత్ర మీద విపరీతమైన అభిమానం ఉన్నఒక అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించటానికి ప్రయత్నిస్తూంటాడు. ఒక వేళ ఎవరన్నా ఆమెకు ఎవరన్నా సమస్యగా మారితే వాళ్ళను చంపటానికి కూడా ఆ అజ్ఞాత వ్యక్తి వెనుకాడడు. పైగా నువ్వు చంపమంటేనే నేను వాళ్ళను చంపుతున్నానంటాడు ఆమెతో. దీంతో అతన్నుంచి తప్పించుకోటానికి పోలీసుల సాయం తీసుకుంటుంది పవిత్ర. ఒక సందర్భంలో డాక్టర్ పవిత్ర కూడా దోషిగా మారే పరిస్థితి వస్తుంది. డాక్టర్ పవిత్రను పీడిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవటంలో బుజ్జి ఆమెకు సహకరిస్తాడు.ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి అదేనండీ "ఆ ఒక్కడు"ఎవరన్నది ఈ సినిమా చూస్తే కానీ తెలియదు.
ఎనాలసిస్ :
రెండు మూడు మళయాళ సినిమాలను ఒకేసారి చూస్తున్న భావన ఈ సినిమా చూస్తే కలుగుతుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని చిన్న సస్పెన్స్ తో నడించాలనుకుంటే ఈ సినిమా అవుతుంది. ఈ కథ చెప్పటానికి బాగానే ఉండి ఉండొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ మీద ప్రేజెంట్‍ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదనిపించింది. ప్రతి పాత్ర ముఖ్యమైనదేనన్న భ్రాంతి ప్రేక్షకులకు కలిగించే ప్రయత్నంలో ఈ చిత్రం నిడివి అనవసరంగా బాగా పెంచాడు దర్శకుడు.నిజానికి ఈ సినిమా కనీసం ఇంకా ఒక 45 నిమిషాల పాటు నిడివి తగ్గితే బహుశా బాగుండేది. దీన్ని బట్టి దర్శకుడి కెపాసిటీ ప్రేక్షకులకు అర్థమయిందనుకుంటాను. ఇక నటన విషయానికొస్తే అజయ్ విలన్‌గా చేసినప్పుడు తెర మీద ఎంతసేపుండేవాడో ఈ చిత్రంలో కూడా అంతే సేపున్నాడు. కాకపోతే ఈ చిత్రంలో హీరో అనే బిరుదు, రెండు పాటలు అదనంగా ఉన్నాయి అంతే తేడా. అజయ్‌లో కూడా 'నేను హీరోగా నటిస్తున్నాను' అనే భావన ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమాలో అతని పాత్రకున్న ప్రాథాన్యత గొప్పదేం కాదు. ఏందుకంటే ఈ చిత్రం మొత్తం హీరోయిన్ మీదే నడుస్తుంది. కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక సురేష్ గోపిని మళయాళం నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత గొప్ప పాత్రేం కాదతనిది. ఇక మధురిమ ఈ చిత్రాన్ని తన భుజాల మీద నడిపింది. ఈ చిత్రంలో చాలామంది హాస్యనటులున్నా కూడా కామెడీ ఈ చిత్రంలో మనకు పెద్దగా నవ్వు తెప్పించదు సరికదా బాగా విసిగిస్తుందని చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం -: ఈ సినిమా పాటల్లో మణిశర్మ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. రీ-రికార్డింగ్ కూడా అలాగే ఉంది. ఎడిటింగ్ -: ఇంకా ఈ చిత్రంలో ఎడిటింగ్ చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మాటలు -: ఆశించిన స్థాయిలో లేవు మిగిలిన సాంకేతిక విభాగాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్‍ చూసి ఈ సినిమాకొచ్చిన మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రంలో ఒక్క ఫైటూ లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అజచ్‌ని విలన్‌గా చూసిన వారికి హీరోగా ఎలా చేస్తాడోననే ఉత్సుకత ఈ సినిమాకు లాక్కొస్తుంది. కానీ అజయ్ వాళ్ళని నిరాశపరుస్తాడు. దానర్థం అతను సరిగ్గా నటించలేదని కాదు. అతనికి నటించటానికి అవకాశం లేని పాత్ర ఈ చిత్రంలో లభించింది. అతని పాత్రకున్న ప్రాథాన్యత కూడా చాలా తక్కువ. అజయ్ హీరోగా మారాలనుకుంటే పూర్తి స్థాయిలో అందుకు తగిన కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితముండొచ్చు.