Read more!

English | Telugu

సినిమా పేరు:ఆ ఇంట్లో
బ్యానర్:యు 9 ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jul 16, 2009
కథ మొత్తం చెపితే ఈ చిత్రంలోని సస్పెన్స్ ఎలిమెంట్‍ తెలిసిపోతుంది. అందుకే ఈ కథని క్లుప్తంగా చెపుతాను. పవన్ (చిన్నా), పల్లవి (మయూరి) ఇద్దరూ భార్యాభర్తలు. వారికిద్దరు పిల్లలు. పక్కవాళ్ళు అసూయపడేలా ఉండే చాలా చక్కని సంసారం. చాలా సంతోషంగా వారంతా జీవితం గడుపుతుంటారు. ఉన్నట్టుండి పల్లవికి ఆరోగ్యం బాగోదు. ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు పవన్. అక్కడ ఆమె చనిపోయినంత పనయ్యి , మళ్ళీ బ్రతుకుతుంది. ఆమె కాస్త తేరుకున్నాక హాస్పిటల్‍ నుండి డిశ్చార్జ్ చేస్తూ, ఆమెకు హిస్టీరియా అనీ, ఆమెతో కొన్ని నెలల వరకూ శారీరకంగా కలవ వద్దని డాక్టర్ పవన్ కి చెపుతాడు. ఆమె ఇంటికి వచ్చిందగ్గర నుంచీ ఎప్పుడూ భర్తతో శారీరకంగా కలవటానికి తపించిపోతుంటుంది. ఇంట్లో కూడా ఊహకందని విచిత్రాలు జరుగుతూంటాయి. పల్లవి అనవసరంగా చిన్నాని అనుమానించి విసిగిస్తుంటుంది. పిల్లలను అనవసరంగా కొడుతుంది. వాళ్ళింట్లోని తులసి చెట్టు ఎండిపోతూంటుంది.కొత్త చెట్టు పెట్టినా అది కూడా మళ్ళీ ఎండిపోతుంది. ఇది గమనించిన పవన్ స్నేహితుడు (రాం జగన్) ఒక పంతులు (ఎ.వి.యస్ ) గారిని పిలిపించి శాంతి చేయిస్తాడు. శాంతిచేసిన అనంతరం "రేపు ఈ చెట్టు పాడవటానికి కారణమైన వారు ఈ గిరిలో ఉంటార" ని అక్కడో గిరి గీసి చేపుతాడు పంతులు. దెయ్యాల్నీ, దేవుణ్ణి నమ్మని పవన్ కి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. కానీ తేల్లారే సరికి శాంతి చేసిన పంతులు తానే ఆ గిరిలో చచ్చిపడి ఉంటాడు. రాత్రి పూట పవన్ కి తన ఇంట్లో ఎవరో భయంకరంగా, హృదయవిదారకంగా మూలుగుతూ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంటుంది. ఒక అఘోరా (భిక్షు) టైపు స్వామీజీ ఈ పరిస్థితి అంతా గమనిస్తూ ఉంటాడు. చివరికి తన స్నేహితుడి బలవంతంతో పవన్ ఒక జ్యోతిష్యు (కోట)డి వద్దకు వెళతాడు. అక్కడ పల్లవి జాతకం చూపిస్తే "చనిపోయిన వాళ్ళకి కూడా జాతకం చేపుతారా...?" అని ఎదురు ప్రశ్నిస్తాడు ఆ జ్యోస్యుడు. దాంతో పవన్ అతన్ని కొట్టబోతాడు. నిజంగా పల్లవి చనిపోయిందా...? అసలా పల్లవి ఎలా చనిపోయింది... ఆ ఇంట్లో ఏం జరుగుతోంది...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ఎనాలసిస్ :
రామ్ గోపాల వర్మకి బాగా స్నేహితుడైన నటుడు చిన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన తొలి చిత్రంతోనే చిన్నా దర్శకుడిగా రాము కన్నా చాలా బెటర్ దర్శకుడనిపించుకున్నాడు. రామూ చాలా హారర్, థ్రిల్లర్ చిత్రాలు తీసినా, ఈ చిత్రానికి అవేవి సరిపోవు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే తో సినిమాని ఆద్యంతం చాలా ఆసక్తికరంగా మలిచాడు చిన్నా. ఈ చిత్రంలో ఒక్క వేస్ట్ ఫ్రేమ్ లేదు. ఇక టేకింగ్ పరంగా తనకున్న పరిమిత వనరులతోనే శభాష్ అనిపించే రీతిలో ఈ చిత్రాన్ని మలచాడు చిన్నా. దర్శకుడిగా అతనికి నూటికి నూరు మార్కులూ ఈ చిత్రంతో లభిస్తాయి. చిన్నా దర్శకుడవటమనేది యాదృచ్చికంగా జరిగినా తెలుగు సినిమాకు ఒక ప్రతిభ కలిగిన దర్శకుడు లభించాడు. దర్శకుడిగా అతనికీ చిత్రంతో అవార్డులు లభిస్తాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దర్శకుడిగా చిన్నా ఈ సినిమాలో జనాన్ని భయపెడతాడు, ఆశ్చర్యపరుస్తాడు. సినిమా ఓపెనింగ్ సీన్లోనే తన కుటుంబం పరిస్థితి ఏమిటో సింబాలిక్ గా చూపించటంతోనే సినిమా మీద ఉత్కంఠ నెలకొనేలా చేశాడు చిన్నా.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: నటుడిగా చిన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. అతని స్థాయిలో అతను చాలా బాగా నటించాడు. ఇక ఐటం పాటలకే పరిమితమైన మయూరీ ఉరఫ్ ఆశాసైనీ ఈ చిత్రంలో తను కూడా నటించ గలనని నిరూపించుకుంది. ఆమె కొన్ని సీన్లలో చాలా బాగా నటించింది. ఈ చిత్రం ఆమె నట జీవితంలో పెను మార్పులు తెస్తుంది. అనుమానం లేదు. ఆమెకీ చిత్రంతో అవార్డులూ, రివార్డులూ వస్తాయి. ఆ స్థాయిలో ఆమె నటన ఉంది. ఆమె నటించిందీ అనటం కన్నా చిన్నా ఆమెచేత అలా నటింపజేశాడంటే బాగుంటుందేమో. అల్లరి సుభాషిణి రంగస్థలం నుంచి వచ్చిన నటి. ఆమె పాత్ర వరకూ ఆమె న్యాయం చేసింది. అఘోరాగా నటించిన భిక్షు కూడా బాగా నటించాడు. మిగిలిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం-: ఈ చిత్రంలో కేవలం రెండే పాటలున్నా వినటానికింపుగా ఉన్నాయి. ఇక కోటి అందించిన రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. కెమెరా-: చాలా బాగుంది. ముఖ్యంగా లైటింగ్ స్కీమ్ బాగుంది. ఈ చిత్రంలోని గ్రాఫిక్ షాట్లు కూడా బాగున్నాయి. అవసరమైనంత వరకే వాటిని వాడటం బాగుంది. ఎడిటింగ్-: చాలా బాగుంది. షార్ప్ గా కట్‍ చేశారు. ఆర్ట్-: ఏది సెట్టో‍... ఏది ఒరిజినలో అనేది అర్థం కానంత చక్కగా ఆర్ట్ పనితనముంది. యాక్షన్-: క్లైమాక్స్ లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఇందుకు హార్స్ మేన్ బాబుని అభినందించాలి. మీకు ఒక హారర్, ఒక థ్రిల్లర్, ఒక సస్పెన్స్ చిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రం తప్పకుండా చూడండి. కచ్చితంగా మీరు థ్రిల్‍ ఫీలవుతారు.