Read more!

English | Telugu

సినిమా పేరు:అఖిల్
బ్యానర్:శ్రేష్ట మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Nov 11, 2015

కాన్ఫిడెన్స్‌కీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కీ ఓ చిన్న గీతే అడ్డు.
ఆత్మ విశ్వాసంతో ఓ ప‌ని చేస్తే.. ఖ‌చ్చితంగా గెలిచి తీరుతాం. అతి విశ్వాసంతో చేస్తే.. ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు.
అఖిల్ సినిమా విష‌యంలో అంద‌రిలోనూ ఆ ఓవ‌ర్ కాన్షిడెన్స్ క‌నిపించింది.
అఖిల్ సినిమా క‌దా, ఎలాగూ క్రేజ్ ఉంటుంద‌న్న అతి న‌మ్మ‌కంతో ఓ రొటీన్ ఫార్ములా క‌థ ఎంచుకొన్నాడు వినాయ‌క్‌.
వినాయ‌క్ ఉన్నాడు క‌దా.. ఎలాగైనా పండి న‌డిచిపోతుంద‌ని ఫాలో అయిపోయాడు అఖిల్‌.
అఖిల్‌పై అంద‌రికీ గురి ఉంది, ఎంత ఖ‌ర్చు పెట్టినా తిరిగొచ్చేస్తుంద‌ని లెక్క‌లేశాడు నితిన్‌.
త‌మ‌న్ చూసుకొంటాడులే అని అనూప్‌,
అనూప్ ఉన్నాడులే అని త‌మ‌న్‌.. వీళ్లిద్ద‌రూ ఉండ‌గా నా వ‌ర్క్ ఎలివేట్ అవ్వ‌ద‌ని మ‌ణిశ‌ర్మ‌.. ఇలా ఎవ‌రికి వారు త‌ప్పించుకొని తిరిగారు.
దాంతో.. అఖిల్ అడ్ర‌స్స్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదంలో ప‌డిపోయింది. మొత్తానికి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కి నిలువెత్తు నిదర్శ‌నంలా త‌యారైంది.

స్టొరీ:

సూర్యుడి నుంచి పుట్టిన భూమి ఏదో ఓ కాలంలో సూర్యుడి వేడిని త‌ట్టుకోలేక‌... మొత్తం ఈ ప్ర‌పంచ‌మంతా నాశ‌న‌మైపోతుంద‌ని గ్ర‌హించిన పూర్వీకులు ఓ క‌వ‌చాన్నిభూమ‌ద్య‌రేఖ ప్రాంతాంలోని కంగోలియా అనే ప్రాంతంలో ఉంచి, దాన్ని ర‌క్షించే బాధ్య‌త  ఒజ అనే తెగకు అప్పగిస్తారు. ఆ క‌వ‌చాన్ని కైవ‌సం చేసుకొంటే.. మొత్తం ఈ ప్ర‌పంచం త‌న గుప్పెట్లోకి వ‌స్తుంద‌ని రష్యన్ జనరల్ కత్రోచి న‌మ్మ‌కం. అందుకే దాన్ని ఎలాగైనా కాజేయాల‌ని ప‌ధ‌కం వేస్తాడు. క‌ట్ చేస్తే.. క‌థ హైదారాబాద్ షిప్ట్ అవుతుంది. ఇక్క‌డ‌.. అఖిల్ (అఖిల్‌) ఓ అనాథ‌. దివ్య (సాయేషా)ని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. దివ్య కోసం స్పెయిన్ కూడా వెళ్తాడు. అక్క‌డ‌.. క‌త్రోచీ బ్యాచ్ దివ్య‌ని కిడ్నాప్ చేస్తుంది. దివ్య‌ని వాళ్లెందుకు కిడ్నాప్ చేశారు??  సూర్య క‌వ‌చం క‌త్రోచి చేతికి చిక్కిందా?  దుర్మార్గుల నుంచి ఈ ప్ర‌పంచాన్ని ర‌క్షించ‌డానికి అఖిల్ చేసిన సాహ‌సాలేంటి??  అనేది తెర‌పై చూడాలి.


ఎనాలసిస్ :

అఖిల్ అన‌గానే ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాటిని అందుకోవ‌డానికి అఖిల్ కూడా కాస్త ముందస్తుగా క‌ష్ట‌ప‌డ్డాడు. క‌థ‌ల కోసం నెల‌ల‌పాటు అన్వేషించాడు. చివరికి ఈ సోషియో ఫాంట‌సీ టైపు క‌థ‌కి ఓకే చెప్పాడు. త‌న టాలెంట్ అంతా తొలి సినిమాలో చూపించాలి కాబ‌ట్టి ఫైట్స్‌, డాన్స్‌ల‌కు చోటున్న క‌థ‌ని ఎంచుకోవాల‌న్న తాప‌త్ర‌యంతో ఈ స్టోరీకి ఓకే చెప్పాడేమో అనిపిస్తుంది. ఓ వైపు ల‌వ్ ట్రాక్‌, మ‌రోవైపు ఓ సూర్య క‌వ‌చం స్టోరీ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డానికి వినాయ‌క్ ప‌డిన తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. క‌థ ఎప్పుడూ సైడ్ ట్రాక్‌లోనే ఉంటుంది త‌ప్ప మెయిన్ ట్రాక్ ఎక్క‌దు. క‌థ తేలిపోయిన‌ప్పుడు దాన్ని రెండు గంట‌ల సినిమాగా మ‌ల‌చ‌డం. . క‌త్తిమీద సామే. ఈ విష‌యంలో వినాయ‌క్ అనుభ‌వం కూడా ఏమాత్రం ప‌నిచేయ‌లేదు. దాంతో సినిమా మొత్తం త‌ప్పుల త‌డ‌క కింద త‌యారైంది. లాజిక్‌లు వెదికితే.. సినిమా అంతా డొల్లే. బ‌డా డాక్ట‌ర్లు కూడా చేయ‌లేని ఆప‌రేష‌న్ అని బిల్డ‌ప్ ఇచ్చి, దాన్ని కాస్త సెల్ ఫోన్‌లో జ‌రిపించేడం సిల్లీగా అనిపిస్తుంది.రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. పేరుకి ఓ డీన్‌. కానీ.. ఆయ‌న ద‌గ్గ‌ర రెండు ల‌క్ష‌లు కూడా ఉండ‌వ‌ట‌. అబ్బో... ఇలా లాజిక్ ల్ని వెదుకుతూ కూర్చుంటే స‌వాల‌క్ష తప్పులు క‌నిపిస్తాయి.  జువా అనేది ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్టే. కాక‌పోతే.. అందులోకి హీరోని ఇన్‌వాల్వ్ చేయ‌డం ఆల‌స్య‌మైపోయింది. దానికి తోడు ల‌వ్ స్టోరీలో కిక్ లేదు. కామెడీ న‌వ్వించ‌దు. దాంతో ద‌ర్శ‌కుడు ఏం చెబుతున్నాడో, ఏం చెప్పాల‌నుకొంటున్నాడో అర్థం కాదు.

క్లైమాక్స్ అయితే నేల విడ‌చి సామే. ఈ మాత్రం దానికి ఇన్ని బిల్డ‌ప్పులు ఇవ్వ‌డం ఎందుకు?? ప‌వ‌ర్ ఆఫ్ జువా అంటూ.. ఊద‌ర‌గొట్ట‌డం ఎందుకు అనిపిస్తుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అఖిల్‌కి ఇదే తొలి సినిమా. డాన్స‌లు బాగా చేశాడు. ఫైట్లు కూడా అంతే. అయితే ఇంకా బాగా చేయాల‌న్న కుతూహ‌లంతో... కాస్త ఓవ‌ర్ చేశాడు. ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించాల‌న్న ఆత్రుత‌తో.. ఓవ‌ర్ చేశాడు. మొత్తంగా చెప్పాలంటే.. కుర్రాడిలో విష‌యం ఉంది. అయితే ఏ సీన్‌కి ఎంత చేయాలి అన్న విష‌యంలో మీట‌ర్ పాటిస్తే మంచిది. ఎమోష‌న్ సీన్స్ విష‌యంలో ఇంకాస్త హోం వ‌ర్క్ చేయాలి. సాయేషాకీ అంత సీన్ లేదు. అఖిల్‌ని ఎలివేట్ చేయాల‌న్న దృష్టిలో ప‌డి ఆ పాత్ర‌ని మ‌ర్చిపోయాడు ద‌ర్శ‌కుడు. మ‌హేష్ మంజ్రేక‌ర్ ఆకట్టుకొన్నాడు. రాజేంద్ర ప్ర‌సాద్ జ‌స్ట్ ఓకే. బ్ర‌హ్మానందం మ‌రోసారి వేస్ట్ పీస్‌లా త‌యార‌య్యాడు. వెన్నెల కిషోర్ పాసైపోయాడంతే.

అనూప్‌, త‌మ‌న్ ఇద్ద‌రిదీ ఒకటే శైలి. సౌండ్లెక్కువ‌. ఈసారీ అదే రిపీట్ అయ్యింది. పాట‌లు అంత క్యాచీగా లేవు. పాట ఎలాగున్నా స‌రే. స్టెప్పుల‌తో నింపేయాల‌న్న అఖిల్ తాప‌త్ర‌యం త‌ప్ప‌.. ఏ పాట‌లోనూ ఏదీ క‌నిపించ‌దు. మ‌ణిశ‌ర్మ ఆర్‌.ఆర్ కూడా అలానే తయారైంది. వినోదం ఈసినిమాలో అతి పెద్ద మైన‌స్‌. న‌వ్వించ‌డానికి ప్ర‌య‌త్నించారు గానీ.. థియేట‌ర్లో న‌వ్వులు పండ‌లేదు. స్ర్కీన్ ప్లే ప‌ర‌మ వీక్‌గా ఉంది. క‌థ‌ని ఎలా మొద‌లెట్టాలో, ఎక్క‌డెక్క‌డ లింకులు ఇవ్వాలో.. కోన‌కు అర్థంకాలేదు.

అఖిల్ ని భ‌విష్య‌త్ స్టార్ అంటున్నారంతా. అలాంటి ఓ హీరోని చేతులో పెట్టినప్పుడు వినాయ‌క్ ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి?  ఎంత ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ని ఎంచుకోవాలి??  క‌థ విష‌యంలో అటు అఖిల్‌గానీ, ఇటు వినాయ‌క్‌గానీ, ఆఖ‌రికి నిర్మాత నితిన్ గానీ దృష్టి పెట్ట‌లేదు. అందుకే అఖిల్‌లో బిల్డ‌ప్పులు మాత్ర‌మే క‌నిపించాయి. ఎన్ని బిల్డ‌ప్పులిచ్చినా ఏం లాభం??  క‌థ‌లో విష‌యం లేన‌ప్పుడు. నాగ్ ఫ్యాన్ అయితే ఈ సినిమాని ఒక్క‌సారి చూడొచ్చు. అదీ ఓ పాట‌లో నాగ్ ఎంట్రీ కోసం. అంతే త‌ప్ప‌.. మ‌రేం ఆశించ‌కండి.